దిల్ బహార్ మిఠాయిలు అతి తక్కువ పదార్థాలతో.. ఇంట్లోనే అత్యంత సులభంగా చేసుకోవచ్చు. పాలు, కోవా వంటి పదార్ధాలతో తయారయ్యే ఈ రెసిపీలో ప్రోటీన్లు, కాల్షియం నిండుగా ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం ఓ సారి ట్రై చేసేద్దాం రండి.
కావాల్సినవి
పాలు - లీటర్
చక్కెర - ముప్పావు కప్పు
పాల పొడి - అర కప్పు
కోవా - అర కప్పు (చక్కెర కలపనిది)
పిస్తా - కొన్ని
ఫుడ్ కలర్ - చిటికెడు
నిమ్మరసం - పావు టీస్పూన్
![try-dil-bahar-sweet-recipe-with-kowa-and-milk-in-telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8288858_317_8288858_1596530718455.png)
తయారీ
ఒక ప్యాన్‌లో పాలను వేడిచేసుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ కలుపుకోవాలి. అందులో నిమ్మరసం వేసి, పాలను విరగ్గొట్టి పనీర్ తయారుచేసుకోవాలి. ఇందులో పాల పొడిని కలుపుకుంటూ బాగా పిసకాలి. తర్వాత దీన్ని హార్ట్ షేప్‌లో ఉండేలా తయారుచేసుకోవాలి. మరోప్యాన్‌లో పావు కప్పు చక్కెర, మూడు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. దీన్ని వడబోసి తిరిగి వేడిచేయాలి.
మరుగుతున్న నీటిలో పనీర్ హార్ట్స్ వేసి వాటి సైజు రెట్టింపయ్యేంతవరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి వాటిని అందులోనే నాలుగు గంటల పాటు నాననివ్వాలి. ఈలోపు మరో ప్యాన్‌లో కోవా, చక్కెర వేసి బాగా కలుపుకుంటూ వేడిచేయాలి. ఇది కాస్త దగ్గరపడగానే దింపేయాలి. పనీర్ హార్ట్స్ పూర్తిగా నానిన తర్వాత ట్రేలో ఉంచి, వాటిపై కోవా మిశ్రమాన్ని ఉంచాలి. దానిపై సన్నగా తరిగిన పిస్తా వేసి, అలంకరించుకోవాలి.
ఇదీ చదవండి: శ్రావణం స్పెషల్ 'నువ్వుల పులిహోర' రెసిపీ!