నువ్వుల పులిహోర చేయడమంటే అదో పెద్ద పనిగా భావిస్తారు కొందరు. అందరికీ అది కుదరదని వదిలేస్తుంటారు. కానీ, ఈ రెసిపీనీ అచ్చం ఇలాగే చేసి చూడండి... ఎందుకు కుదరదో అప్పుడు చెప్పండి.
కావాల్సినవి
- బియ్యం - కప్పు (కడిగి, నానబెట్టుకోవాలి)
- నువ్వులు - మూడు టేబుల్‌స్పూన్లు
- నువ్వుల నూనె - తగినంత
- పోపు దినుసులు (ఆవాలు, మినపప్పు, సెనగపప్పు) - టేబుల్‌స్పూన్
- పల్లీలు - రెండు టేబుల్‌స్పూన్లు
- ఎండు మిరపకాయలు - 8
- కరివేపాకు - ఒక రెమ్మ
- పసుపు - టీస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- చింతపండు గుజ్జు - నాలుగు టేబుల్‌స్పూన్లు
- బెల్లం - పావు టీస్పూన్
- పచ్చిమిర్చి - 4 (సగానికి కట్ చేసుకోవాలి)
తయారీ
- ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అన్నం వండుకోవాలి. అన్నం ఉడికాక, ఒక పెద్ద పళ్లెంలోకి తీసుకోవాలి. ఇది చల్లారాక ఒక టేబుల్‌స్పూన్ నువ్వుల నూనె వేసి అన్నాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు నువ్వుల పొడి తయారు చేసుకోవాలి. దీనికోసం నువ్వులు, రెండు ఎండు మిరపకాయలను ప్యాన్‌పై వేయించుకొని.. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై మరో ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్‌స్పూన్ల నువ్వుల నూనెను వేడిచేసి పోపు దినుసులు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త చిటపటలాడాక, చింతపండు గుజ్జు, బెల్లం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నని సెగపై 5-10 నిమిషాల పాటు (చింతపండు గుజ్జు పచ్చి వాసన పోయి చిక్కబడేదాకా) కలుపుతూ ఉండాలి.
- ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి.. ఈ చింతపండు మిశ్రమాన్ని అన్నంలో వేసుకొని బాగా కలుపుకొని, చివరగా నువ్వుల పొడి కూడా వేసి మరోసారి కలుపుకుంటే నోరూరించే నువ్వుల పులిహోర రెడీ! ఈ పులిహోర తయారు చేసుకున్న అరగంట తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఇదీ చదవండి: రాణి గారి 'రాయల్ చాక్లెట్ కప్ కేక్' రెసిపీ ఇది!