మటన్‌లో చాలా రకాలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి ఘుమఘుమలాడే 'మలబార్ మటన్ కర్రీ'ని చేసేయండి.
మలబార్ మటన్ కర్రీ తయారీకి కావలసినవి :
మటన్ - 800 గ్రా, ఉల్లిపాయలు - రెండు పెద్దవి, అల్లం తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - పదిహేను, పచ్చిమిర్చి - నాలుగు, టొమాటోలు - మూడు, నూనె - అరకప్పు, జీలకర్ర - చెంచా, ధనియాలు - టేబుల్‌స్పూను, ఎండుమిర్చి - ఐదు, మెంతులు - అరచెంచా, దాల్చినచెక్క - రెండు అంగుళాల ముక్క, యాలకులు - ఆరు, లవంగాలు - ఎనిమిది, బిర్యానీ ఆకులు - రెండు, కొబ్బరి తురుము - ముప్పావుకప్పు, గసగసాలు - రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలు - పన్నెండు, ఆవాలు - రెండు చెంచాలు, కరివేపాకు రెబ్బలు - నాలుగు, పసుపు - అరచెంచా, కారం - అరచెంచా, ఉప్పు - తగినంత.
తయారీ విధానం :
- ముందుగా మిక్సీజారులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి.
- ఓ బాణలిని పొయ్యిమీద పెట్టి కొద్దిగా నూనె వేడిచేసి జీలకర్రా, ఎండుమిర్చి, ధనియాలూ, మెంతులూ, దాల్చినచెక్కా, లవంగాలూ, యాలకులూ, బిర్యానీ ఆకులూ వేయించుకోవాలి. అరనిమిషం తరవాత కొబ్బరీ, గసగసాలూ, మిరియాలూ వేసి వేయించుకోవాలి. కొబ్బరి కొద్దిగా వేగాక దింపేయాలి. వేడి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
- అదే బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలూ, కరివేపాకు వేయించాలి. తరవాత ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి వేగాక అల్లం,వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు కలపాలి. తరవాత మటన్ వేసి వేయించాలి. పదినిమిషాలయ్యాక మంట తగ్గించాలి.
- పసుపూ, కారం, ఉప్పూ, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. కాసేపటికి నూనె పదార్థాల నుంచి వేరవుతుంది. అప్పుడు నాలుగుకప్పుల నీళ్లు పోసి మటన్‌ని ఉడికించుకోవాలి.
- చివరగా చేసి పెట్టుకున్న మసాలా వేసి కలిపి గ్రేవీలా తయారయ్యాక దింపేస్తే చాలు.