చికెన్ ఫ్రాంక్ ఎంత రుచిగా ఉంటుందో.. దీనిని చేసుకోవడం అంత సులభంగా ఉంటుంది. అదెలాగో చూసేయండి..
కావాల్సినవి
బోన్లెస్ చికెన్- అరకేజి (అర అంగుళం ముక్కల్లా కట్ చేసుకోవాలి), గోధుమపిండి- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, నూనె-రెండు టేబుల్స్పూన్లు, మధ్యస్థంగా ఉండే ఉల్లిపాయలు- రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద- రెండు టీస్పూన్లు, ధనియాల పొడి- రెండు టీస్పూన్లు, పసుపు- అర టీస్పూన్, కారం- రెండు టీస్పూన్లు, మధ్యస్థంగా ఉండే టమాటాలు- రెండు, సన్నగా తరిగిన కొత్తిమీర- రెండు టేబుల్స్పూన్లు, నిమ్మరసం- రెండు టేబుల్స్పూన్లు, గుడ్లు- నాలుగు.
తయారీ
- గోధుమపిండిలో తగినన్ని నీళ్లు పోసి, కాస్త ఉప్పు వేసుకుని ముద్ద కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఉల్లిపాయ, టమాటాలను చిన్న ముక్కలుగా కోయాలి. కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మరో నిమిషంపాటు వేయించాలి.
- ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుని మూడు నిమిషాల పాటు వేయించాలి. తగినంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలపాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి చికెన్ కాస్త ఉడికేవరకూ ఉంచాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీద ముక్కలు వేసుకుని పొడిగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఈ మిశ్రమం మీద నిమ్మరసం పిండి, బాగా కలిపి పక్కనపెట్టాలి.
- ఇప్పుడు గోధుమపిండి ముద్దను ఎనిమిది భాగాలు చేసి, ఎనిమిది చపాతీలు చేయాలి. పాన్ మీద ఒక్కో చపాతీనీ కాల్చాలి. గుడ్ల సొనను ఒక గిన్నెలో వేసుకుని బాగా కలిపి ఒక్కో చపాతీ మీద కొద్దిగా సొన వేసి కాల్చాలి. సొన చపాతీ మీదే వేయాలిగానీ దాన్ని దాటి పక్కలకు రాకుండా చూసుకోవాలి.
- ఇప్పుడు చపాతీని తిరగేసి కింది భాగం కూడా బాగా కాల్చాలి. సొన భాగం పైకి వచ్చేలా చపాతీని పెట్టి చికెన్ మిశ్రమం వేయాలి. దీని మీద ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ వెనిగర్, గ్రీన్ చట్నీలనూ చల్లాలి. ఇప్పుడు చపాతీని గట్టిగా చుట్టాలి.
అలంకరణకు..
సన్నగా తరిగిన ఉల్లిపాయలు-రెండు, చిల్లీ వెనిగర్-నాలుగు టీస్పూన్లు, గ్రీన్చట్నీ-ఎనిమిది టీస్పూన్లు.
ఇదీ చదవండి: అప్పడంతో 'పాపడ్ లడ్డూ' చేసి చూడూ..!