ఆరోగ్యానికి ఎంతో మంచివైన పుట్టగొడుగులతో.. ఎప్పుడూ కూరలూ, ఫ్రైలేనా? భిన్నంగా కాసిన్ని మిరియాలు, మసాలా జోడించి చక్కనైన వంటకాన్ని తయారుచేసుకోవచ్చు. అదెలాగంటారా? ఇదిగో మీరు ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:
- పుట్టగొడుగులు: అరకిలో
- ఉల్లిపాయ: ఒకటి
- టొమాటో: ఒకటి
- అల్లం వెల్లుల్లి: టీస్పూను
- వెల్లుల్లి: 4 రెబ్బలు
- పచ్చిమిర్చి: ఒకటి
- దనియాల పొడి: టీస్పూను
- కారం: అర టీస్పూను
- పసుపు: చిటికెడు
- గరం మసాలా: చిటికెడు
- నూనె: టేబుల్ స్పూను
- ఆవాలు: పావు టీస్పూను
- ఉప్పు: రుచికి సరిపడా
- మిరియాలు: టీస్పూను
- జీలకర్ర: పావు టీస్పూను
- నిమ్మరసం: అరటీస్పూను
- కొత్తిమీర: కట్ట
- కరివేపాకు: రెండు రెమ్మలు
తయారుచేసే విధానం:
- వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర కచ్చాపచ్చాగా నూరి పక్కన ఉంచాలి.
- బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగాక కోసిన పుట్టగొడుగు ముక్కలు వేసి మూతపెట్టి ఉడికించాలి. అవి ఉడికిన తరవాత పసుపు, కారం, దనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. నీళ్లన్నీ ఆవిరైపోయేవరకూ ఉడికించి ఆపై మిరియాల మిశ్రమాన్ని వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండి, కొత్తిమీర తురుము చల్లి దించితే సరి ఎంతో రుచికరమైన పెప్పర్ మష్రూమ్ మసాలా రెడీ అయినట్లే.
ఇదీ చదవండి: కన్నడ స్వీట్ 'బెళగావి కుంద' సింపుల్ రెసిపీ