ఉరుకుల పరుగుల జీవితంలో విధులకు హాజరవ్వాలని సరిగ్గా తినకుండానే వెళ్లిపోతుంటారు కొంతమంది. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవచ్చు. ఒక్కోసారి పని చేయడానికి శక్తి సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటారు. నీరసం, ఉత్సాహాం కోల్పోవడం వంటి సమస్యల నుంచి బయటపడటానికి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 'గుడ్ నింబు కా షరబత్' ఎంతో సహకరిస్తుంది. దీని తయారీలో ఉపయోగించే బెల్లం.. రక్తంలోని ఐరన్‌ను పెంపొందించడమే కాకుండా అందులోని గూక్లోజ్ తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది.
కావాల్సిన పదార్థాలు
బెల్లం-250 గ్రాములు, నిమ్మకాయలు-4, ఉప్పు-2 టీస్పూన్లు, మిరియాలు పొడి-1 టీస్పూన్, నీళ్లు-1 లీటరు, ఐస్‌ముక్కలు-తగినన్ని.
తయారీ విధానం
ముందు పైన చెప్పిన పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. బెల్లం పొడిగా చేసి ఓ పాత్రలో వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయలను రెండు భాగాలుగా చేసి.. వాటి రసాన్ని ఆ బెల్లం పొడిలో కలపాలి. తర్వాత రెండు టీస్పూన్ల ఉప్పు, ఒక టీ స్పూన్ మిరియాల పొడి అందులో వేయాలి. ఆ మిశ్రమానికి ఒక లీటరు నీళ్లు పోయాలి. తర్వాత బెల్లం కరిగేంత వరకు కలపాలి. అనంతరం గ్లాస్‌లోకి తీసుకొని కొన్ని ఐస్ ముక్కలు వేసుకోవాలి. అంతే 'గుడ్ నింబు కా షరబత్' సిద్ధం. మీరూ తయారు చేసి, మీ అనుభూతిని ఈటీవీ భారత్‌తో పంచుకోండి.
ఇదీ చూడండి: సమ్మర్ స్పెషల్: సోంపు షర్బత్ సింపుల్ రెసిపీ