వాము, నువ్వులు, జీలకర్ర, ఇంగువ వంటి పదార్థాలతో తయారయ్యే.. చక్లీలు కాలక్షేపానికే కాదు ఆరోగ్యానికీ మంచివే. తెలుగు రాష్ట్రాల్లో మురుకులు, చక్రాలుగా పిలిచే ఈ స్నాక్.. గుజరాత్, మహారాష్ట్రలలో చక్లీలుగా ఫేమస్. మరి ఈ రుచికరమైన వంటకాన్ని వాళ్ల స్టైల్లో మనమూ ఓసారి ట్రై చేసేద్దాం రండి...
కావలసినవి ఇవే..
బియ్యం పిండి-1 కప్పు, శనగ పిండి- పావు కప్పు, ఉప్పు-తగినంత, ఇంగువ-చిటికెడు, కారం పొడి- అర టీస్పూన్, వాము- 1 టీస్పూన్, నువ్వులు-1 టీస్పూన్, నూనె-డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి-1 టీస్పూన్, నీళ్లు-పిండి కలుపుకోడానికి సరిపడా, మురుకులు వేసే పాత్ర.
తయారీ విధానం..
ముందుగా ఓ బౌల్లో బియ్యం పిండి, శనగ పిండి, ఉప్పు, ఇంగువ, కారం, వాము, నువ్వులు వేసుకుని కలుపుకోవాలి. అందులోనే నెయ్యి వేసి పిండికి పట్టించాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త మెత్తటి ముద్దలా చేసుకోవాలి. దాన్ని మురుకుల పావులో వేసి.. బాగా కాగిన నూనెలో చక్రాల్లా వేసుకోవాలి. వాటిని బంగారు రంగు వచ్చేవరకు డీప్ ఫై చేసుకోవాలి. అంతే... మీ చాయ్ టైం కల్లా నోరూరించే చక్లీలు సిద్ధం. మినుములతోనూ ఈ వంటకాన్ని టై చేయొచ్చు. మరి మీరూ ఈ రెసిపీని ఓసారి చేసి, మీ అభిప్రాయాన్ని ఈటీవీ భారత్తో పంచుకోండి.