How To Keep Bananas Fresh : తక్కువ ఖర్చులో ఆరోగ్యాన్ని అందించే పండ్లలో అరటి పండ్లు ముందంజలో ఉంటాయి. కాలంతో సంబంధం లేకుండా అన్ని రోజుల్లో లభ్యమవడంతో పాటు.. పోషకాలు ఎక్కువగా ఉండటంతో చాలా మందిని వీటిని కొనుగోలు చేస్తుంటారు. వైద్యులు కూడా అన్ని వయస్సుల వారు వీటిని తీసుకోవాలని సూచిస్తుంటారు.
అయితే.. వాటిని నిల్వ చేయడం కొందరికి సమస్యగా ఉంటుంది. మార్కెట్ నుంచి ఇంటికి తీసుకొచ్చే వరకు పండ్లు బాగానే ఉంటాయి. ఆ తర్వాతే వాటి పరిస్థితి దిగజారిపోతుంది. మచ్చలు ఏర్పడి.. త్వరగా పాడైపోతుంటాయి. ఇలాంటి వాటిపై ఈగలు, దోమలు వాలుతుంటాయి. ఈ పరిస్థితి రాకుండా.. ఎక్కువ రోజుల పాటు అరటి పండ్లు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. మరి.. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండ్లు త్వరగా పాడయిపోకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు..
- చాలా మంది మార్కెట్ నుంచి అరటి పండ్లను కవర్లో అలాగే తీసుకువచ్చి పెడుతుంటారు. ఇలా అస్సలు చేయవద్దు. వచ్చిన వెంటనే వాటిని కవర్ నుంచి వేరు చేయాలి. లేకపోతే పాడైపోతాయి.
- మార్కెట్లో విడివిడిగా అమ్మే పండ్లను కొనకండి. ఇవి త్వరగా పాడవుతాయి.
- అరటిపండ్లు గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి. కాబట్టి వాటిని ప్రిడ్జ్లో పెట్టకండి. ఎక్కువ చల్లగా ఉండే చోట ఉంటే అవి నల్లగా మారిపోతాయి.
- అరటి పండ్లను నేలపై పెట్టకండి. నేల చల్లగా ఉండటం వల్ల తొందరగా పాడవుతాయి. కాబట్టి, వాటిని బల్లపైన గానీ, లేదా హ్యాంగర్‌లో ఉంచండి. సాధారణంగా ఈ పండ్లను వేలాడతీయడం మనం అరటి పండ్ల వ్యాపారుల వద్ద గమనిచవచ్చు.
- అరటి పండ్లను కొన్న తరవాత వాటిని వేరువేరుగా విడదీయండి. ఆ తరవాత ఒక్కో అరటి పండు స్టెమ్ చుట్టూ సిల్వర్ ఫాయిల్ కాయిల్‌ను గానీ, లేదా ప్లాస్టిక్ కవర్‌ను చుట్టి రబ్బర్ వేయండి.
- ఇలా చేయడం వల్ల అరటి పండ్లను ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంచే అందులోని ఎథిలిన్ గ్యాస్ విడుదల తగ్గుతుంది. దీంతో పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
- అరటి పండ్ల గుత్తిలో ఏదైనా పాడైపోతే.. వెంటనే దానిని వేరు చేయండి. లేకపోతే మిగిలిన పండ్లు పాడయ్యే అవకాశం ఉంది.
- ఎండ తగిలే చోట, వేడిగా ఉండే వంటగదిలో నిల్వ ఉంచకండి. దీని వల్ల త్వరగా పాడవుతాయి.
- మనలో చాలా మంది అరటి పండ్లను ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి నిల్వ చేస్తుంటారు. కానీ, ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇతర పండ్ల నుంచి విడుదలయ్యే ఎథిలిన్ గ్యాస్ అరటి పండ్లను త్వరగా పాడయ్యేలా చేస్తుంది.
- ముఖ్యంగా అవకాడో, కివిస్, యాపిల్స్, టమాటల వద్ద వీటిని అస్సలు ఉంచకూడదు.
- ఇలా చేయడం ద్వారా అరటి పండ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు.
మూర్ఛ వ్యాధి - ఎవరికైనా రావొచ్చు! ఎందుకు వస్తుంది?
మగాళ్లకన్నా మహిళల్లోనే తలనొప్పి ఎక్కువ! - ఎందుకో తెలుసా?- రీసెర్చ్‌లో విస్తుపోయే నిజాలు!
మునగ ఆకుతో 300 వ్యాధులకు చెక్ - ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!