వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి చల్లని వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో జీవక్రియలు మందగిస్తాయి. ఇలాంటి సమయంలో ఫాస్ట్ఫుడ్ బదులు శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే మంచిది. అందుకే కరోనా కాలంలో ఆరోగ్యాన్ని పెంచే ఈ వంటలను ఓసారి ట్రై చేయంది..
క్యారట్, పెసరపప్పు సలాడ్
కావాల్సినవి
కడిగి నానబెట్టిన పెసరపప్పు- పావుకప్పు, క్యారెట్ తురుము- రెండుకప్పులు, నూనె- రెండు చెంచాలు, జీలకర్ర- అరచెంచా, పచ్చికొబ్బరి తురుము- పావుకప్పు, నిమ్మరసం- రెండు చెంచాలు, అల్లం తురుము- చెంచా, మిరియాలపొడి- పావుచెంచా, పంచదార- అరచెంచా, ఉప్పు- తగినంత
తయారీ విధానం
ఒక చిన్నగిన్నెలో నిమ్మరసం, అల్లం, ఉప్పు, మిరియాలపొడి, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్‌లో చెంచా నూనె వేసి వేడెక్కాక అందులో జీలకర్ర వేసి వేయించుకోవాలి. వెంటనే స్టౌ ఆపి చల్లారనివ్వాలి. ఇందులో దానిలో క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, పచ్చికొబ్బరి తురుము, వేసి బాగా కలుపుకోవాలి. దీనికి నానబెట్టిన పెసరపప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ముందుగా తయారుచేసుకున్న డ్రెస్సింగ్ వేసి బాగా కలుపుకొని పదిహేను నిమిషాలపాటు పక్కన ఉంచాలి.
యాంటీ ఆక్సిడెంట్లు, బీటాకెరొటినాయిడ్లు పుష్కలంగా ఉండే క్యారెట్స్‌ని చలికాలంలో తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. పెసరపప్పు నుంచి మేలురకం మాంసకృత్తులు అందుతాయి.
కాబూలీ సెనగల పులావ్
కావాల్సినవి
బాస్మతిబియ్యం- కప్పు, నానబెట్టిన కాబూలీ సెనగలు- 200గ్రా, టమాటాలు- రెండు, ఆలుగడ్డ- ఒకటి, పాలకూర తురుము- కప్పు, నూనె- మూడు చెంచాలు, క్యాప్సికమ్ ముక్కలు- రెండు చెంచాలు, జీలకర్ర- చెంచా, బిర్యానీ ఆకు- ఒకటి, అల్లం తురుము- చెంచా, పచ్చిమిరపకాయలు- రెండు, ఉప్పు- తగినంత, పసుపు- అరచెంచా, ఆమ్‌చూర్‌పొడి- అరచెంచా, గరంమసాలా- చెంచా, నీళ్లు- ఒకటిన్నర కప్పు
తయారీ విధానం
ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసుకుని అందులో బిర్యానీఆకు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటాముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. అవి మెత్తబడిన తర్వాత అందులో కాబూలీసెనగలు, సన్నగా తరిగిన ఆలుగడ్డముక్కలు వేసి సన్నమంటపై వేయించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు, పాలకూర వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి. బాస్మతిబియ్యం కూడా వేసి తగినన్ని నీళ్లుపోసి మూతపెట్టి ఉడికించుకోవాలి. పులావ్ పూర్తిగా ఉడకడానికి కొద్దిగా ముందు గరంమసాలా, ఆమ్‌చూర్ పొడి వేసి కలుపుకోవాలి.
సర్‌సోంకాసాగ్-మక్కీకి రోటీ
కావాల్సినవి
ఆవ ఆకు- 750గ్రా, పాలకూర- 250గ్రా, ముల్లంగి ఆకు-100గ్రా, పచ్చి మిరపకాయలు- 8, అల్లం- 30గ్రా, బియ్యంరవ్వ- 40గ్రా, మొక్కజొన్నపిండి- రెండు చెంచాలు, వెన్న- 200గ్రా, బెల్లం- కొద్దిగా
తయారీ విధానం
మందపాటి పాన్‌లో వెన్న వేసి వేడి చేసుకోవాలి. మొక్కజొన్న పిండి తప్పించి మిగతా వాటిని అందులో వేసుకుని నిమిషం పాటు వేయించుకోవాలి. అందులోనే నీళ్లుపోసి ఉడికించుకుని.. పప్పుగుత్తితో మెత్తగా అయ్యేలా మెదుపుకోవాలి. ఆ తర్వాత మళ్లీ పొయ్యిమీద పెట్టి సన్నమంట మీద ఉడికించుకోవాలి. ఉప్పు, కారం సరి చూసుకుని కొద్దిగా బెల్లం మొక్కజొన్నపిండిని కలుపుకోవాలి. ఈ కూరను మొక్కజొన్నపిండితో చేసిన రొట్టెలతో తింటారు.
మక్కీకి రోటీ
కావాల్సినవి
మొక్కజొన్నపిండి- కప్పు, ఉప్పు, నూనె- తగినంత, బియ్యప్పిండి- రొట్టెలపైన చల్లుకోవడానికి
తయారీ విధానం
మొక్కజొన్నపిండిలో ఉప్పు కలుపుకొని కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలుపుకొంటూ ముద్దలా చేసుకోవాలి. చిన్న ఉండలు చేసుకుని బియ్యప్పిండిని పైపిండిలా చల్లుకుని చపాతీల మాదిరిగా ఒత్తుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. చలికాలంలో శక్తినిచ్చే ఆహారం ఇది. ఈ రొట్టెలని వేడివేడిగా సర్‌సోంకాసాగ్ కూరతో తింటే బాగుంటుంది.
దాల్‌పాలక్ షోర్బా
కావాల్సినవి
నానబెట్టి ఉడికించిన పెసరపప్పు- 100గ్రా, ఉడికించిన కందిపప్పు- 100గ్రా, గరంమసాలా- 10గ్రా, పసుపు- అరచెంచా, అల్లం- 15గ్రా, పాలకూర- పావుకేజీ, నూనె- చెంచా, జీలకర్ర- చెంచా, సన్నగా తురిమిన పచ్చిమిర్చి- చెంచా, సన్నగా తురిమిన వెల్లుల్లిరెబ్బలు- ఎనిమిది, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత, నిమ్మరసం- నాలుగు చెంచాలు, క్రీం- తగినంత
తయారీ విధానం
పెసరపప్పు, కందిపప్పులని రెండు గంటలపాటు నానబెట్టుకుని తగినంత నీరుపోసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. ఒక పాత్రలో నూనె వేడిచేసుకుని అందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. తర్వాత గరంమసాలా, పసుపు, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. పాలకూరను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పాన్‌లో ఉన్న మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు, కందిపప్పులని కూడా ఈ మిశ్రమానికి కలుపుకోవాలి. ఉప్పు, నిమ్మరసం, క్రీం వేసి దింపుకోవాలి.
చిలగడదుంపల రబిడీ
కావాల్సినవి
పాలు-200ఎం.ఎల్, ఉడికించి మెత్తగా చిదిమిన చిలగడదుంపల పేస్ట్- మూడుచెంచాలు, పంచదార- చెంచా, గోరువెచ్చని నీళ్లు- అరకప్పు యాలకులపొడి- అరచెంచా, కుంకుమపువ్వు- కొద్దిగా, డ్రైఫ్రూట్స్- చెంచా
తయారీ విధానం
చిలగడదుంపలని మెత్తగా ఉడికించి పైన పొట్టు తీసేసి చేత్తో మెత్తగా చిదుముకోవాలి. మందపాటి అడుగు ఉన్న గిన్నెలో పాలు మరిగించుకోవాలి. కొద్దిగా కుంకుమపువ్వు ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టుకోవాలి. మరుగుతున్న పాలలో చిలగడదుంపల మిశ్రమాన్ని వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కుంకుమపువ్వు నీళ్లని కూడా అందులో కలుపుకోవాలి. యాలకులపొడిచేసి బాగా కలిపి మూడు నుంచి నాలుగు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. రుచి చూసి పంచదార కలుపుకోవాలి. దింపడానికి ముందు డ్రైఫ్రూట్స్ వేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- బాదం, కిస్‌మిస్, పిస్తా, అంజీర్, డ్రైఫ్రూట్స్, గోరువెచ్చనిపాలు అల్పాహారంగా తీసుకోవడం మంచిది. మిరియాలు, మెంతులు, ఇంగువ, జీలకర్ర, సోంఫు వంటి వాటిని వంటల్లో చేర్చుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. సూపుల్లో వీటిని వాడుకోవచ్చు.
- తులసి ఆకులని కషాయంగా చేసుకోవచ్చు. సాసులు, సలాడ్లు, డిప్స్‌లో వాడితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
- క్యారెట్స్, ఉల్లిపాయలు, పాలకూర, తోటకూర, ఆలుగడ్డలు, బీట్‌రూట్, మెంతికూర, ఆవకూర ఈ కాలంలో విరివిగా తినాలి. వీటివల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.
- అన్నానికి బదులు రాగులు, సజ్జలు, జొన్నలు, బార్లీ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
ఇదీ చూడండి: ఆహా! అనిపించే 'తోటకూర చికెన్'