అఫ్గానిస్థాన్ జాతీయ వంటకం... కాబూలీ పులావ్ అంటే పార్శీ భాషలో అద్భుతమైన అన్నం అని అర్థం. దీన్ని మటన్, ఎండుద్రాక్ష, బాదం, పిస్తా పలుకులు దండిగా పోసి చేస్తారు. ఈ భిన్నమైన వంటకాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా?
కావాల్సినవి
బాస్మతిబియ్యం- రెండు కప్పులు, ఉప్పు- రుచికి తగినంత, యాలకులపొడి- పావుచెంచా, జీలకర్రపొడి- పావుచెంచా, కుంకుమపువ్వు- కొద్దిగా , క్యారెట్ తురుము- పావుకప్పు, ఎండుద్రాక్ష- పావుకప్పు, నూనె- తగినంత, పంచదార- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత
తయారీ విధానం
బాస్మతి బియ్యాన్ని అరగంటపాటు నానబెట్టి ఉంచుకోవాలి. వెడల్పాంటి పాన్‌లో నీళ్లు, తగినంత ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఇందులో బాస్మతిబియ్యాన్ని పోసి ఓ పదినిమిషాలు ఉడికించుకుంటే చాలు. నీళ్లను వడకట్టి అన్నాన్ని పక్కన ఉంచాలి. మందపాటి పాత్ర లేదా కుక్కర్ తీసుకుని నూనె పోసి వేడిచేసుకోవాలి. అందులో క్యారెట్ తురుము, పంచదార, ఎండుద్రాక్షలు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అల్యుమినియం ఫాయిల్ తీసుకుని అందులో వేయించిన క్యారెట్, ఎండుద్రాక్షలని ఉంచి ఫాయిల్‌ని మూసేయాలి. మిగిలిన నూనెను పక్కన పెట్టుకోవాలి. క్యారెట్లు వేయించుకున్న కుక్కర్‌ని పొయ్యిమీద నేరుగా కాకుండా ఒక పెనం పెట్టి దానిపై తక్కువ మంటమీద ఉంచాలి. ఇందులో ఉడికించిన బాస్మతి బియ్యాన్ని వేసి అందులో ఓ పక్కగా అల్యూమినియం ఫాయిల్‌ని ఉంచాలి. అన్నంపైన పైన యాలకుల పొడి, జీలకర్రపొడి చల్లి.. మిగిలిన నూనెను కూడా వేసుకోవాలి. కుక్కర్ మూతపెట్టేసి పావుగంటపాటు ఉడికించుకోవాలి. ఫాయిల్‌లోని క్యారెట్, ఎండుద్రాక్షలు, కుంకుమపువ్వు అన్నంలో కలుపుకుంటే కాబూలీ పులావ్ రెడీ.
ఇదీ చూడండి: 'చిక్కుడు- చికెన్ పలావ్' సింపుల్ రెసిపీ!