టిఫిన్ చేయాలని అనిపిస్తే వెంటనే మనకి తినాలని అనిపించే వంటకం దోశ. వీటిలో ఎన్నో రకాలు ఉన్నా.. మసాలా దోశది ప్రత్యేక స్థానం. కర్ణాటకలో పుట్టిన ఈ వంటకం ఇప్పుడు దేశంలోని హాట్ ఫేవరెట్ ఫుడ్స్‌లో ఒకటి. ఈ మసాలా దోశకే కేరాఫ్‌గా ఎన్నో టిఫిన్ సెంటర్లు వెలిశాయి. మరి ఈ మసాలా దోశను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి. బయట టిఫిన్ సెంటర్లలో వచ్చే రుచే రావడానికి ఏం చేయాలంటే..
కావాల్సినవి : అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండు మిరపకాయలు, ఉప్పు, బియ్యం, మినపప్పు, అటుకులు, ఉప్పుడు బియ్యం, మెంతులు, శెనగపప్పు, పసుపు, ఆవాలు, నూనె, కొత్తిమీర, కరివేపాకు, బంగాళదుంపలు.
తయారు చేసే విధానం..
ముందుగా వెల్లుల్లి, నానపెట్టిన ఎండు మిరపకాయలు, ఉప్పుతో మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత బియ్యం, మినపప్పు, అటుకులు, ఉప్పుడుబియ్యం, మెంతుల మిశ్రమాన్ని ఆరుగంటల పాటు నానపెట్టాలి. ఆ తర్వాత రుబ్బి 6 నుంచి 8 గంటల దాకా ఆగాలి.
కడాయిని వేడి చేసి.. అందులో నూనె వేయాలి. ఆవాలు, శెనగపప్పు, పసుపు, మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించి చిదిమేసిన బంగాళదుంప వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో నిమ్మరసం వేసి మగ్గించుకుంటే దోశెలోకి మసాలా రెడీ అవుతుంది.
ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పిండితో దోశెలు వేసి.. దానిపై మనం చేసుకున్న మిర్చి మసాలాను రాసి.. ఆ తర్వాత బంగాళదుంపతో తయారు చేసుకున్న మసాలాను దాని మీద వేసుకుంటే నోరూరే మసాలాదోశె రెడీ.
ఇలా దేశెల పిండితో మరో నాలుగు రకాల వంటలను కూడా తయారు చేసుకోవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మసాలా పునుగులు..
కావాల్సినవి : క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బేకింగ్ సోడా, కరివేపాకు, నూనె.
తయారీ : దోశెల పిండిలో కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బేకింగ్ సోడా, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఓ కడాయిలో నూనె మరిగించి అందులో ఈ పిండి మిశ్రమాన్ని ఉండల్లా వేసుకుని ఫ్రై చేసుకుంటే మసాలా పునుగులు సిద్ధం.
ఎర్ర కారం దోశ..
కావాల్సినవి : వెన్న, టమాట, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, పుట్నాల పొడి.
తయారీ : ఎండుమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలతో చేసిన పేస్ట్‌లో కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఎర్రటి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసుకుని పిండితో దోశె వేసుకోవాలి. పైన వెన్న, ఎర్రటి మిశ్రమం వేసి, పుట్నాల పొడి చల్లి కాల్చుకుంటే ఎర్రకారం దోశె రెడీ.
ఊతప్పం..
కావాల్సినవి : బేకింగ్ సోడా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, కొత్తిమీర, క్యారెట్ తురుము, టమాట, దంచిన మిర్యాలు, జీలకర్ర, కొబ్బరి తురుము, కరివేపాకు.
తయారీ : ముందుగా సిద్ధం చేసుకున్న దోశెల పిండిలో ఉప్పు, బేకింగ్ సోడా, నీళ్లు వేసి కలుపుకోవాలి. ఓ గిన్నెలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, కొత్తిమీర ముక్కలు కలిపి పక్కనపెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో టమాట, క్యారెట్ తురుము, కొత్తిమీర కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో దంచిన మిర్యాలు, జీలకర్ర, కరివేపాకు, కొబ్బరి తురుము కలుపుకోవాలి, ఇప్పుడు పెనం మీద మూడు ఉతప్పాలు వేసుకోవాలి.
వాటిపైన కలుపుకున్న మూడు మిశ్రమాలు సమానంగా పరుచుకుని పైన వెన్న వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే ఊతప్పం రెడీ.
గుంట పొంగణాలు..
కావాల్సినవి : ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చల్ల మిర్చి, కరివేపాకు, ఉప్పు, అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయలు.
తయారీ : బాండీలో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చల్ల మిర్చి, కరివేపాకు వేసి పోపు చేసుకోవాలి. ఆ తర్వాత దానిని రుబ్బుకున్న పిండిలో వేసుకుని కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పొంగనాల పీటలో ఈ పిండి వేసి రెండు వైపుల కాల్చుకుంటే గుంటపొంగణాలు రెడీ.
ఇదీ చూడండి : నోరూరించే రొయ్యదోశలు.. తింటే వదలరు!