రాజ్యాంగాన్ని మార్చకుండానే కేవలం పాలన యంత్రాంగం సరళిని ఏమార్చడం ద్వారా రాజ్యాంగస్ఫూర్తిని కదలబార్చి, దాన్ని భ్రష్టుపట్టించడం సాధ్యమేనని 1948 నవంబరులో డాక్టర్ అంబేడ్కర్ విస్పష్టంగా హెచ్చరించారు. నిబద్ధతగల ఉద్యోగిస్వామ్యాన్ని ప్రతిపాదించిన ఇందిర జమానా నుంచే పాలన యంత్రాంగం సరళి భ్రష్టుపట్టిపోగా రాజ్యాంగబద్ధ పాలన ఎండమావిగా మారి ప్రజల్ని చెండుకు తింటోందిప్పుడు! పౌరసేవా (సివిల్ సర్వీస్) దళంలో ఆత్మశోధనకు 24 ఏళ్ల క్రితం దిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా నిర్వహించిన ప్రధాన కార్యదర్శుల సదస్సు విలువైన సూచనలెన్నో చేసినా వాటికి ఈనాటికీ మన్నన దక్కని తీరు- ఊడలు దిగిన అవ్యవస్థకు గరళవైద్యమే శరణ్యమని చాటుతోంది.
మిషన్ కర్మయోగి..
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం- ‘మిషన్ కర్మయోగి’ పేరిట అతిపెద్ద సంస్కరణకు సమ్మతి తెలిపింది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు ప్రభుత్వ ఉద్యోగుల్ని తీర్చిదిద్దడం, పారదర్శకత, సాంకేతికతల మేళవింపుతో నిర్మాణాత్మక నవ్యావిష్కరణల దిశగా వారి సామర్థ్యాలకు సానపట్టడం తాజా మిషన్ పరమోద్దేశమని ప్రధాని మోదీ చాటుతున్నారు. ఇంతవరకు అఖిల భారత సేవలకే పరిమితమైన మధ్యంతర శిక్షణను అన్ని సర్వీసులు, అన్ని స్థాయుల్లోనివారికీ వర్తింపజేస్తామని, ఉద్యోగుల పనితీరుపై శాస్త్రీయ సమీక్ష ఆధారంగా నియామకాలతో గుణాత్మక మార్పు సాధ్యపడుతుందని కేంద్ర సచివులు ఘనంగా ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఖ్య 46 లక్షలు. దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందిదాకా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల జీతనాతాల నిమిత్తం ఏటా వెచ్చిస్తున్నది రూ.12 లక్షల కోట్లు. పౌరులకు సక్రమంగా సేవలు అందించడంలో, సామాజిక ఆస్తుల నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచడం ద్వారా ప్రతి ఉద్యోగి పని సామర్థ్యాన్ని మెరుగుపరచాలంటూ- వారి నైపుణ్యాల అభివృద్ధికి అంతర్గత శిక్షణ అవసరాన్ని వైవీ రెడ్డి నేతృత్వంలోని పద్నాలుగో ఆర్థిక సంఘం ప్రస్తావించింది. అలాంటి ఎన్నో యోచనల కార్యరూపమే... మిషన్ కర్మయోగి!
ఆ సర్వేల్లో భారత్ చివరి స్థానం..
'కేంద్రం రాష్ట్రాల స్థాయుల్లో అధికార కేంద్రాలుగా చక్రంతిప్పే బ్యూరాక్రాట్లు తమ పనిపోకడల్లో ఎలాంటి సంస్కరణల్ని తలపెట్టినా తీవ్రంగా ప్రతిఘటిస్తారు'- ఆసియాలోని దేశాల పాలన యంత్రాంగాల్ని విశ్లేషించిన సంస్థ 2009లో చేసిన వ్యాఖ్య అది. సింగపూర్ సివిల్ సర్వీసులకు అగ్రాసనం దక్కిన నాటి సర్వేలో ఇండియా అధమస్థానం మూటగట్టుకొంది. సివిల్ సర్వీసెస్ చరిత్రలోనే గొప్ప పరివర్తనకు మేలుబాటలు పరచేలా రెండో పరిపాలన సంస్కరణల సంఘంతోపాటు జీఎస్ వాజ్‌పేయీ, వైకే అలఘ్, సురేంద్రనాథ్, పీసీ హోతా కమిటీల నివేదికలెన్నో పోగుపడి ఉన్నా- వాటిని పట్టించుకోని పర్యవసానమది! అవినీతి నేతాగణంతో అంటకాగుతూ అధికారులు శిక్షలు తప్పించుకోవడమే కాదు, కీలక పదవుల్నీ ఒడిసిపడుతున్నారని 2010లో 4,800 మంది సివిల్ సర్వెంట్లు పాల్గొన్న సర్వే నిగ్గుతేల్చింది.
దేశ ప్రగతి అప్పుడే సాధ్యం..
ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు అంటున్న ప్రజాస్వామ్యంలో అవినీతిపరులకు ఊడిగం చేయడమా పౌరసేవకుల పని? పండంటి పాలనకు పదకొండు సూత్రాలన్న మన్మోహన్ జమానా ఎంతగా అవినీతి లోతులు ముట్టి పతనమైందో అందరికీ తెలిసిందే. నిజాయతీపరులకు వరస బదిలీలు బహుమానం అవుతుంటే, అవినీతి కంటకులకు అంబారీలు కట్టే అవ్యవస్థ మలిగిపోయేలా శిక్షణలతో పాటు శిక్షలూ రాటుతేలాల్సిందే! ప్రభుత్వోద్యోగుల జీతంలో 40 శాతాన్ని స్థిరవేతనంగాను, తక్కిన మొత్తాన్ని వారి పని సామర్థ్యంతో ముడిపెట్టిన బ్రెజిల్ నమూనా- ఎక్కడికక్కడ జవాబుదారీతనాన్ని పారదర్శకతను పెంచగలుగుతోంది. 'కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన' అంటున్న మోదీ సర్కారు ఉద్యోగిస్వామ్య సాకల్య క్షాళన సాధించగలిగితే దేశ ప్రగతి- కళ్ళెం విడిచిన రేసు గుర్రం అవుతుంది.
ఇదీ చదవండి: నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!