Crisis of SAARC: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ వైఖరి, అఫ్గానిస్థాన్‌లో ఇటీవల చోటుచేసుకొన్న అధికార మార్పిడి వంటివి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్) కూటమి పునరుజ్జీవాన్ని జటిలం చేస్తున్నాయి. సార్క్ ఛార్టర్‌పై సభ్యదేశాలు సంతకాలు చేసి నేటితో 36 ఏళ్లు నిండుతున్నా, దాని నుంచి దక్షిణాసియాకు ఒనగూడిన లబ్ధి అతిస్వల్పమే. ప్రాంతీయంగా భారతదేశ పరపతిని అడ్డుకోవడానికి పాక్ తరచూ సార్క్‌ను ఒక వేదికగా ఉపయోగించుకుంటోంది. స్వప్రయోజనాల కోసం ఆ దేశం పన్నుతున్న కుయుక్తులు- కూటమి సమష్టితత్వాన్ని దెబ్బతీస్తున్నాయి.
రాజకీయం చేయాలని..
Pakistan role in saarc: ఉరీలో సైనికులపై ఉగ్రదాడికి నిరసనగా 2016లో భారత్ తొలిసారి సార్క్ సదస్సును బహిష్కరించింది. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఆ సదస్సుకు హాజరు కావడంపై బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్ సైతం నిరాసక్తత కనబరచాయి. ఆనాటి నుంచి సార్క్ సదస్సులు మళ్ళీ పట్టాలెక్కలేదు. నిరుడు కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో సార్క్‌లో చిన్న కదలిక వచ్చింది. ఇండియా చొరవతో ప్రజారోగ్యంపై నిర్వహించిన దృశ్యమాధ్యమ సదస్సుకు పాకిస్థాన్ మినహా మిగిలిన దేశాధినేతలు హాజరయ్యారు. పాక్ తరఫున మాత్రం ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సహాయకుడు జాఫర్ మీర్జా పాల్గొన్నారు. మానవతా అంశాలపై ఏర్పాటైన ఆ సదస్సులోనూ కశ్మీరు అంశాన్ని ప్రస్తావించి రాజకీయం చేయాలని మీర్జా ప్రయత్నించారు. అంతేకాదు- ఆ వేదికపై చైనాను పొగడ్తలతో ముంచెత్తారు. ఆ వ్యవహారాన్ని భారత్ మౌనంగా గమనించింది. సార్క్ సభ్యదేశాలకు రూ.74 కోట్ల సాయం ప్రకటించింది. ఆ తరవాత టీకాల పంపిణీలో పాక్‌ను పక్కన పెట్టింది. 2021 నవంబరు 30 నాటికి పాక్ మినహా మిగిలిన ఆరు దేశాలకు- వాటి వాణిజ్య కొనుగోళ్లకు అదనంగా 61.62 లక్షల టీకా మోతాదులను భారత్ అందజేసింది.
ఇదీ చూడండి: వీడుతున్న అపనమ్మకాలు- భారత్-నేపాల్ సంబంధాలు ఆశావహం
పాక్ తెంపరితనం
Saarc on taliban afghanistan: మరోవైపు, సమష్టిగా నిర్ణయం తీసుకోవాలనే సార్క్ నిబంధనను 'వీటో'లా వాడుకుంటూ సొంత ఎజెండాను ముందుకు తీసుకెళ్ళేందుకు పాకిస్థాన్ తరచూ యత్నిస్తోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక సార్క్‌కు చిక్కుముడులు ఇంకా పెరిగిపోయాయి. సెప్టెంబరు 25న ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా సార్క్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. దానికి అఫ్గానిస్థాన్ తరఫున తాలిబన్ ప్రతినిధిని ఆహ్వానించాలని పాక్ పట్టుబట్టింది. అఫ్గాన్ కొత్త ప్రభుత్వాన్ని భారత్‌తో సహా బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక గుర్తించలేదు. పాక్ సైతం తాలిబన్లకు అధికారికంగా గుర్తింపునివ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో ఐరాస ఆంక్షల జాబితాలోని తాలిబన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్ ముత్తఖీని సార్క్ సమావేశానికి ఆహ్వానించాలనడం పాక్ తెంపరితనాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి మానవహక్కులను ఏ మాత్రం పట్టించుకోని తాలిబన్ నేతృత్వంలోని అఫ్గానిస్థాన్‌ను సార్క్ నుంచి బహిష్కరించాలి. ఆ నిర్ణయాన్ని పాక్ అడ్డుకునే అవకాశం ఉండటంతో మొత్తం సమావేశాన్ని వాయిదా వేయడానికే మిగిలిన దేశాలు మొగ్గుచూపాయి.
ఇదీ చూడండి: India Russia Relations: చిరకాల చెలిమి.. కదనాన బలిమి!
Saarc safta: సార్క్ దేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్యం కోసం చేసుకున్న 'సాఫ్టా' (ది సౌత్ ఆసియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా) ఒప్పందమూ నిస్తేజమవుతోంది. మొత్తం దక్షిణాసియా వాణిజ్యంలో కేవలం అయిదు శాతమే ఆ ఒప్పందం పరిధిలో సాగుతోంది. సభ్యదేశాల నడుమ మోటారు వాహనాల రాకపోకలను సరళతరం చేసేందుకు భారత్ ప్రతిపాదించిన ప్రత్యేక ఒప్పందానికి పాక్ అడ్డుపుల్ల వేసింది. దాంతో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ విడిగా ఆ ఒప్పందం చేసుకున్నాయి. స్థానిక రవాణారంగం దెబ్బతింటుందనే భయంతో భూటాన్ ప్రభుత్వం ఆ తరవాత దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సార్క్ సభ్యదేశాలు సమష్టిగా దిల్లీలో నెలకొల్పిన దక్షిణాసియా విశ్వవిద్యాలయం (ఎస్‌ఏయూ) పరిస్థితి సైతం అగమ్యగోచరంగా మారింది. రెండేళ్లుగా దానికి పూర్తికాలపు అధ్యక్షుడు లేరు. వేతనాల పరంగా సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎస్‌ఏయూలో చదువుకున్న సభ్యదేశాల విద్యార్థులు ఎందరో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పొరుగు దేశాల్లో భారతదేశ పరపతిని పెంచేందుకు ఈ విశ్వవిద్యాలయం ఉపయోగపడుతుంది. దాన్ని మెరుగుపరచే విషయంలో పాక్‌తో సంబంధం లేకుండా భారత్ కొంత చొరవ తీసుకోవాల్సి ఉంది.
డ్రాగన్ పాత్ర
China in saarc: సార్క్‌లో చైనాకు పరిశీలక హోదా మాత్రమే ఉంది. అయినా దాని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం. భారత్, భూటాన్ మినహా కూటమిలోని మిగిలిన దేశాలన్నీ డ్రాగన్ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగస్వామ్య పక్షాలే. దాన్ని వాడుకుంటూ సార్క్‌లో చొరబడేందుకు చైనా గతంలో విశ్వప్రయత్నాలు చేసింది. పాక్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంకలతో ఇండియా సంబంధాలు దెబ్బతినడంలో చైనా పాత్ర సుస్పష్టం. ప్రస్తుతం పాక్ మినహా మిగిలిన వాటితో ద్వైపాక్షిక సంబంధాలు కొంత మెరుగుపడ్డాయి. దాయాదుల నడుమ ఉద్రిక్తతలను చల్లారకుండా సార్క్ పునరుజ్జీవం పొందడం కష్టసాధ్యం. అది సాకారం కావాలంటే ఉగ్రమూకలను తయారుచేసే పనిని పాక్ మానుకోవాలి. ప్రపంచ దేశాల గుర్తింపును సంపాదించుకునేలా తాలిబన్ల వ్యవహరశైలిలో మార్పు రావాలి. అప్పటి వరకు 'బిమ్స్‌టెక్'(బంగాళాఖాత పరీవాహక ప్రాంతాల సాంకేతిక ఆర్థిక సహకార కూటమి)లో చురుకైన పాత్ర పోషించడమే భారత్‌కు ప్రయోజనకరమవుతుంది.
- పి.కిరణ్
ఇవీ చూడండి: