ETV Bharat / opinion

బడ్జెట్‌ సంజీవని అవుతుందా?

కరోనా సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కుదేలైన రంగాలను అభివృద్ధివైపు నడిపించడం ఏ ప్రభుత్వానికైనా సవాలుతో కూడుకున్న పనే అవుతుంది. అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థల్ని మెరుగుపరిచేందుకు ఓ వైపు ఉద్ధీపన ప్యాకేజీలు ప్రకటిస్తూనే.. ఆర్థికలోటును భర్తేచేసేందుకు కావాల్సిన ఆదాయ మార్గాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. కొవిడ్‌ సృష్టించిన అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో ఈ బడ్జెట్లో 'ఆరోగ్య భారతావని ఆవిష్కారాని'కి గట్టి పునాది పడాలన్నదే అందరి ఆకాంక్ష!

WILL THE BUDGET BE HARDENING FROM THE COVID CRISIS
బడ్జెట్‌ సంజీవని అవుతుందా?
author img

By

Published : Jan 29, 2021, 6:46 AM IST

కొవిడ్‌ సృష్టించిన కల్లోలం నుంచి కోలుకొని వివిధ రంగాలను పునరుద్ధరించుకునే క్రమంలో ప్రపంచం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. నేలచూపులు చూస్తున్న రంగాలకు ఊపిరిలూది వాటిని తిరిగి మేలుబాట పట్టించడం ఏ ప్రభుత్వానికైనా కత్తిమీద సామే! అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఒకవైపు ఉద్ధీపన ప్యాకేజీలు ప్రకటిస్తూనే మరోవంక విస్తరించిన ఆర్థిక లోటు కట్టడికి ప్రభుత్వం ఇతర ఆదాయ మార్గాలపైనా దృష్టి సారించాల్సి ఉంటుంది. దేశ ఆరోగ్య వ్యవస్థల్లోని లోటుపాట్లను కొవిడ్‌ బహిర్గతం చేసిన నేపథ్యంలో- వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది. ఈ దృష్ట్యా మరో రెండు రోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ ఎంతో కీలకమైనది. దేశ సామాజిక, ఆర్థిక చిత్రాన్ని గుణాత్మకంగా ప్రభావితం చేయగల శక్తిగల బడ్జెట్‌ ఇది.

పరిశోధనలకు ప్రాధాన్యం

ప్రజారోగ్య అవసరాలు అంతకంతకూ పెరుగుతూ, ఎప్పటికప్పుడు కొత్త వైరస్‌లు దండెత్తుతున్న తరుణంలో- ప్రభుత్వాలు ఏనాడూ ఆరోగ్య వ్యవస్థలను ప్రాథమ్యాంశంగా పరిగణించకపోవడమే విషాదం. 2008-09లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.2శాతంగా ఉన్న ప్రజారోగ్య వ్యయం నామమాత్రంగా పెరిగి 2019-’20నాటికి 1.6శాతానికి చేరింది. సుమారు 135 కోట్లు దాటిన జనాభాగల దేశంలో ఆరోగ్య రంగ వ్యయం వాటా రెండు శాతం మించకపోవడం బాధాకరం. చైనా 3.2శాతం, అమెరికా 8.5శాతం, జర్మనీ 9.4శాతం వ్యయంతో ఈ విషయంలో భారత్‌తో పోలిస్తే చాలా ముందున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు 2019-20లో రూ.64,609 కోట్లు కేటాయించగా, ఆ తరవాతి ఏడాది కేటాయింపుల్లో పెరుగుదల 3.9శాతం (రూ.67,112 కోట్లు) మాత్రమే కావడం గమనార్హం. ఈ కేటాయింపులను ఇబ్బడిముబ్బడిగా పెంచాలి. ఎప్పటికప్పుడు కొత్త ఆరోగ్య సమస్యలు విరుచుకుపడుతున్న తరుణంలో ఆరోగ్య రంగంలో పరిశోధనలకు నిధులు పెంచాలి. కానీ, మొత్తం కేటాయింపుల్లో పరిశోధనల వాటా మూడు శాతాన్ని మించకపోవడం గమనార్హం. కొవిడ్‌ మహమ్మారి ఆరోగ్య రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు పరిశోధన సంస్థలు పూనుకొని వ్యాక్సిన్‌ తయారు చేశాయి. అదే ప్రభుత్వ రంగంలో పరిశోధన వ్యవస్థలు అద్భుతంగా ఉండి ఉంటే వ్యాక్సిన్‌ తయారీ అవకాశం వాటికే దక్కి ఉండేదేమో!

'ఆయుష్మాన్​ భారత్'​తో..

ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను, వైద్య విద్యావ్యవస్థలను మెరుగుపరచుకోవలసిన బాధ్యతను ప్రపంచ ఆరోగ్య సంస్థ మన దేశానికి ఇటీవల గుర్తుచేసింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ పరిధిలో ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాలు, కాస్తో కూస్తో సౌకర్యాలతో జిల్లా ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజానీకానికి ఇవే ఆరోగ్య ప్రదాయినులు. ఈ వ్యవస్థలు వారంలో అన్ని రోజులూ గర్భిణీ, స్త్రీ, శిశు సంరక్షణ సౌకర్యాలతోపాటు- బ్లడ్‌ బ్యాంకు సదుపాయాలనూ కలిగి ఉండాలి. కానీ, కింది స్థాయిలో ఆ పరిస్థితి లేదు. గడచిన పదిహేనేళ్లలో దేశంలో కేవలం రెండు వేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మాత్రమే కొత్తగా ఏర్పాటు చేసుకోగలిగారు. 'ఆయుష్మాన్‌ భారత్‌'లో భాగంగా దేశంలోని లక్షా యాభైవేల ఆరోగ్య ఉప కేంద్రాలను, పీహెచ్‌సీలను 'ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు'గా నవీకరించారు. వీటి స్థాయిని మరింత పెంచి అసాంక్రమిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలకూ చికిత్స అందించే విధంగా తీర్చిదిద్దాలి. క్రమేణా పెద్ద ఆసుపత్రులపై భారం తగ్గించే ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రైవేటు రంగంలో సుమారు 60శాతం ఆసుపత్రులు, 80శాతం వైద్యులు ఉన్నప్పటికీ- అందుబాటులోని పడకలు 29శాతం మాత్రమే కావడం గమనార్హం.

సరైన అర్హత లేకపోయినా..

దేశ జనాభాలో దాదాపు 70శాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నా- ఇక్కడ పని చేస్తున్న ఆరోగ్య సిబ్బంది 40శాతం మాత్రమే. దేశంలోని సుమారు రెండువేల పీహెచ్‌సీలలో అసలు వైద్యులే లేరు. గ్రామాల్లోని 19శాతం వైద్యులకు సరైన అర్హతలు లేవు. 90శాతం నర్సులు, మంత్రసానులకు ఎలాంటి విద్యార్హతలూ లేవు. అర్హతగల వైద్యుల కొరతను తగ్గించేందుకు జిల్లా ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా మార్చే ప్రక్రియ ఇంకా పట్టాలకు ఎక్కలేదు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీలతో కుదేలైన ఫార్మా రంగానికి రాయితీలు ప్రకటించాలి. అంకురాల ఏర్పాటునూ ప్రోత్సహించాలి. ధరల విషయంలో అడ్డూఆపూ లేకుండా వ్యవహరిస్తున్న ఫార్మారంగానికి సహేతుక మార్గదర్శకాలు రూపొందించాలి. మందుల తయారీకి సంబంధించి ఇప్పటికీ చాలావరకు చైనాపై ఆధారపడుతున్నాం. దేశవాళీ ఫార్మా పరిశ్రమలకు ఔషధ తయారీలో రాయితీలు ఇచ్చి ప్రోత్సహించే విధంగా బడ్జెట్‌ను తీర్చిదిద్దాలి. కొవిడ్‌ కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి లక్షల మంది బాధితులకు సేవచేసిన జూనియర్‌ డాక్టర్లకు, పీజీ వైద్యులకు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. కొవిడ్‌ కాలంలో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన వెంటిలేటర్లను కనిష్ఠ కాలావధిలో అవసరాలకు సరిపడా తయారుచేసిన సాంకేతిక ప్రజ్ఞ మన సొంతం. ఈ నేపథ్యంలో 'భారత్‌లో తయారీ'లో భాగంగా అంకురాలకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు అందించాలి. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆసుపత్రుల్లో వ్యయానికి కోతపడి రోగులపైనా ఆర్థిక భారం తగ్గుతుంది.

మౌలిక సౌకర్యాలను విస్తరించాలి

దేశంలోని 80శాతం ప్రజలు ఆరోగ్య వ్యయాన్ని సొంతంగా భరిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడం వారికి మరింత సాంత్వన చేకూరుస్తుంది. నగరాల్లోని అన్ని వైద్యశాలలకు 'పీఎం కేర్స్‌' కింద యంత్రసామగ్రి సమకూర్చుకునే వెసులుబాటు కల్పించాలి. అనేక రాష్ట్రాలు ఈ పథకంలో చేరుతున్నందున ప్రధానమంత్రి స్వాస్థ సురక్ష యోజనకు కేటాయింపులు పెంచాలి. ప్రపంచంలో ప్రతి వెయ్యి మందికి సగటున 3.4 పడకలు ఉండగా, భారత్‌లో ఆ వాటా 0.7 మాత్రమే. మెడికల్‌ కళాశాలల్లో సీట్లు పెంచితే వైద్యుల కొరత తీరదు. బోధన, మౌలిక సౌకర్యాలు కల్పించకపోతే ఎవరూ వాటిలో చేరరు. చివరికి 'ఎయిమ్స్‌' వంటి సంస్థల్లోనూ ఎంబీబీఎస్‌ సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. అసాధారణ ఆరోగ్య విపత్తులు ఎదుర్కొనే స్థాయిలో దేశాన్ని సంసిద్ధం చేయాల్సిన అవసరాన్ని కొవిడ్‌ తెలియజెప్పింది. అఖిల భారత పాలన సర్వీసుల తరహాలోనే 'ఆల్‌ ఇండియా వైద్య సర్వీసుల'నూ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఈ మహమ్మారి నొక్కి చెప్పింది. కొవిడ్‌ సృష్టించిన అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో ఈ బడ్జెట్లో 'ఆరోగ్య భారతావని ఆవిష్కారాని'కి గట్టి పునాది పడాలన్నదే అందరి ఆకాంక్ష!

- డాక్టర్​ శ్రీభూషణ్​ రాజు, రచయిత-నెఫ్రాలజీ విభాగాధిపతి, హైదరాబాద్​ నిమ్స్​

ఇదీ చదవండి: నేడు పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.