ETV Bharat / opinion

భారత్​- ఇరాన్​ బంధం మళ్లీ బలపడేనా? - india iran ties

పాకిస్థాన్​లోని చైనా నిర్మిస్తోన్న గ్వాదర్ పోర్ట్​కు చెక్​ పెట్టేందుకు ఇరాన్​ చాబహార్​ నౌకాశ్రయం భారత్​కు కీలకం. అంతేకాదు ఇరాన్​తో బంధం బలపడితే అఫ్గాన్, మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యానికి అడ్డుగా ఉన్న పాకిస్థాన్​ ఆట కట్టించటమూ సులుభమవుతుంది. అయితే అనేక పరిణామాలతో ఈ ప్రాజెక్టు నుంచి భారత్​ బయటికి రావాల్సి వచ్చింది. అయితే భారత్​ పంథా మార్చుకుని ఇరాన్​తో సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

INDIA- IRAN
భారత్​- ఇరాన్
author img

By

Published : Sep 7, 2020, 7:43 AM IST

అఫ్గానిస్థాన్‌, మధ్యాసియా దేశాలతో భారత్‌ వాణిజ్యానికి సైంధవుడిలా అడ్డుపడుతున్న పాకిస్థాన్‌ ఆట కట్టించడానికి ఇరాన్‌లోని చాబహార్‌ రేవు ఎంతో ఉపకరిస్తుంది. ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌ల మధ్య ఇప్పటికే భూమార్గం ఉండగా భారత్‌, ఇరాన్‌ల మధ్య నౌకలు, విమానాల ద్వారా రవాణా జరుగుతోంది. చాబహార్‌ రేవు మూలంగా భారత్‌ నుంచి సరకులు ఇరాన్‌, అఫ్గాన్‌, మధ్యాసియాలకు సులువుగా రవాణా అవుతాయి. ఇంతకాలం సరకుల ఎగుమతులు, దిగుమతుల కోసం పాకిస్థాన్‌ మీద ఆధారపడుతూ వచ్చిన అఫ్గానిస్థాన్‌ కూడా ప్రత్యామ్నాయం కోసం చూస్తోంది.

సముద్ర తీరం లేని అఫ్గాన్‌కు ఇరాన్‌లోని చాబహార్‌ రేవు ఎంతో అనువైనది. ఇరాన్‌ సేనాని, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీ) ప్రధానాధికారి కాశిం సులేమానీని అమెరికా హతమార్చడంతో, ప్రత్యామ్నాయ వ్యాపార మార్గం కోసం అఫ్గానిస్థాన్‌ అన్వేషణకు ఎదురుదెబ్బ తగిలింది. అఫ్గాన్‌ ఉత్తర ప్రాంతంలో నివసించే షియా తెగకు చెందిన హజారాలతో సులేమానీకి అత్యంత సాన్నిహిత్యం ఉండేది. అందువల్ల ఆయన ఇరాన్‌, భారత్‌లతో చేతులు కలపాల్సిందిగా అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. 'మూడు దేశాలను దగ్గర చేసిన వ్యక్తి సులేమానీయే' అని హైదరాబాద్‌ లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయాధిపతి మహమ్మద్‌ హఘ్‌ బిన్‌ఘోమీ ‘ఈటీవీ భారత్‌’తో వ్యాఖ్యానించారు.

సులేమానీ మరణంతో..

సులేమానీ నాయకత్వంలోని ఐఆర్‌జీ అంటే అమెరికాకు ఏమాత్రం గిట్టదు. ఇది భారత్‌కు సమస్యాత్మకమైంది. సులేమానీ తెరచాటునే ఉండి భారత్‌, ఇరాన్‌, అఫ్గాన్‌ల మధ్య వాణిజ్యాభివృద్ధికి ప్రాతిపదిక ఏర్పాటు చేయసాగారు. పాకిస్థాన్‌లో చైనా నిర్మిస్తున్న గ్వాదర్‌ రేవుకు కేవలం 68 కి.మీ. దూరంలోనే చాబహార్‌ ఉంది. దీనిద్వారా చాలా తక్కువ ఖర్చుతో భారత సరకులను దిగుమతి చేసుకునే సౌలభ్యం ఉండటం వల్ల అఫ్గాన్‌ దీనివైపు మొగ్గు చూపింది. దశాబ్దం క్రితమే చాబహార్‌ నుంచి దక్షిణ అఫ్గాన్‌లోని హెరాత్‌, కాందహార్‌లదాకా రహదారి సౌకర్యం ఏర్పడింది. అక్కడి నుంచి రాజధాని కాబూల్‌, ఉత్తర అఫ్గానిస్థాన్‌ వరకు రహదారి అనుసంధానం ఉంది.

చాబహార్‌ నుంచి అఫ్గాన్‌ దాకా రైలుమార్గం నిర్మించేందుకు భారత్‌ చేసిన ప్రతిపాదన కాబూల్‌కు ఎంతో ఉపయోగకరం. చాబహార్‌ నుంచి జహేదాన్‌ వరకు రైలు మార్గ నిర్మాణానికి అఫ్గాన్‌, ఇరాన్‌, భారత్‌ల మధ్య నాలుగేళ్ల క్రితమే ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను భారత కంపెనీ ఇర్కాన్‌కు అప్పగించారు. ఇందులో తమ కంపెనీకి కూడా భాగస్వామ్యం కల్పించాలని ఇరాన్‌ కోరడం వల్ల చిక్కులు మొదలయ్యాయి. ఇరానియన్‌ కంపెనీకి ఐఆర్‌జీతో సంబంధాలు ఉండటంతో భారత్‌ అందుకు అంగీకరించలేకపోయింది. ఈ విషయంలో అమెరికాను కాదని భారత్‌ ముందడుగు వేయలేకపోయింది. సులేమానీ మరణంతో చాబహార్‌-జహేదాన్‌ రైలు ప్రాజెక్టు నిలిచిపోయింది.

చైనాకు అవకాశం..

ఈ పరిణామాన్ని అవకాశంగా తీసుకున్న చైనా రైలు ప్రాజెక్టు నిర్మాణానికి ఇరాన్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇరానీ దౌత్యాధికారి హఘ్‌ బిన్‌ ఘోమీ ఈ వార్తను ఖండించారు. "చాబహార్‌-జహేదాన్‌ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి ఇరాన్‌ సొంత నిధులను వెచ్చిస్తోంది. చైనా మార్గదర్శకత్వం మాత్రమే వహిస్తుంది" అని ఆయన వివరించారు. చాబహార్‌ రేవు నిర్మాణాన్ని కనుక భారత్‌ పూర్తి చేసి ఉంటే, అది పాక్‌ తీరంలో చైనా నిర్మించిన గ్వాదర్‌ రేవుకు చెక్‌ పెట్టేది. చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఐర్‌ఐ), చైనా-పాక్‌ ఆర్థిక నడవా (సిపెక్‌) ప్రాజెక్టులకు గ్వాదర్‌ రేవు ఎంతో కీలకమైనది.

ఇరాన్‌ మీద అమెరికా విధించిన ఆంక్షలు చైనాకు మహదవకాశం కల్పించాయి. ఆర్థిక ముట్టడిలో ఉన్న ఇరాన్‌కు చేరువయ్యే అవకాశాన్ని చైనా సద్వినియోగం చేసుకుంది. వచ్చే 25 ఏళ్లలో ఇరాన్‌లో 40 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతానని బీజింగ్‌ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఒప్పందం ఇంకా కుదరాల్సి ఉంది. అమెరికా మాట కాదనడానికి భారత్‌ సిద్ధపడకపోవడం వల్లే ఇరాన్‌, చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, చైనాపై అతిగా ఆధారపడటం మంచిది కాదని ఇతర దేశాల అనుభవాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా గల్ఫ్‌ ప్రాంతంలో భారత్‌ తనదైన పంథాతో ముందుకు సాగితే, చైనా ఉక్కు పిడికిలిలో గల్ఫ్‌ దేశాలు ఇరుక్కుపోకుండా చూడవచ్చు.

(రచయిత- బిలాల్‌ భట్‌)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.