ETV Bharat / opinion

కరోనా వేళ జీవితానికో లేఖ రాయకూడదా?

కాలం గమ్మత్తయింది... చిత్రమైంది కూడా. ఎన్నో జ్ఞాపకాల్ని మోసుకొస్తుంది. ఇంకెన్నో స్మృతుల్ని చెరిపేస్తుంది. ఈ కాలగమనంలోనే కరోనా పుట్టుకొచ్చింది. చూస్తుండగానే అప్రతిహతంగా పెరిగిపోయింది. దావానలమై ఖండాల్ని చుట్టబెట్టింది. జీవితమనేది చీకటి వెలుగుల రంగేళి- అంటాడో సినీ కవి. కరోనా సైతం జీవితానికి రెండు దృక్కోణాల్ని పరిచయం చేసింది. ఒకటి విమర్శ, రెండోది ఆత్మవిమర్శ. విమర్శలు కోకొల్లలు. నిజానికి విమర్శ కంటే ఆత్మవిమర్శ శ్రేష్ఠమైంది. ఎందుకంటే, విమర్శ పలాయనవాదానికి దారితీస్తుంది. ఆత్మవిమర్శ గుణపాఠాన్ని శోధించి స్వీకరిస్తుంది. నా ఈ లేఖకు ఆధారం... ఆత్మపరిశీలనే!

Why not write a letter to life?
జీవితానికో లేఖ రాయకూడదా?
author img

By

Published : May 15, 2020, 10:04 AM IST

డియర్​ జిందగీ,

పూర్వం కవులు మేఘసందేశం పంపేవారట. అంత స్థోమత లేని వాళ్లు కాకితో కబురంపేవారట. మరికొందరు ఎంచక్కా కపోత సందేశాలు నడిపారేమో. ఇవన్నీ సాదాసీదా వ్యవహారాలు. రాచరిక ప్రాభవం వేరు. రాజు తలచుకుంటే రాయబారులకు కొదవా? పాండవులైతే ఏకంగా శ్రీకృష్ణుడినే దూతగా పంపించారు. ఆపై కలం, కాగితం రాకతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఇప్పుడంతా డిజిటల్‌ పలకరింపుల శకం. ఇలా లేఖో భిన్న కాలమానస్థితిః!

చరిత్రలో లింకన్‌ లేఖ ప్రశస్తమైంది. అది బోధనకు దిశానిర్దేశం చేసింది. అంతెందుకు- ఇందిరకు నెహ్రూ రాసిన లేఖలు సైతం పేరెన్నికగన్నవే. అవి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి సోపానాలు వేశాయి. ప్రపంచయుద్ధ నియంత్రణకై గాంధీజీ, హిట్లరుకు రాసిన ఉత్తరం; అణ్వాయుధాల విషయమై ఐన్‌స్టీన్‌, రూజ్‌వెల్ట్‌కి రాసిన ఉత్తరం; శాస్త్ర తాత్విక రంగాలను లోతుగా చర్చిస్తూ మార్క్సుకి ఏంగెల్స్‌ రాసిన లేఖలు... ఇవన్నీ కూడా విశ్వవిఖ్యాతమైనవే. అంతెందుకు, మన విశ్వకవి రవీంద్రుడు సైతం ఆ సర్వేశ్వరుడికి అర్జీ పెట్టుకున్న లేఖలే కదా... గీతాంజలి! ఇలా లేఖల తీరుతెన్నులు ఎన్నెన్నో. లేఖలు కేవలం బంధుమిత్రులు, సన్నిహితులు, అధికారులకేనా? చంద్రుడికో నూలుపోగులా, జీవితానికో లేఖ రాయకూడదా? ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం.

కాలం గమ్మత్తయింది... చిత్రమైంది కూడా. ఎన్నో జ్ఞాపకాల్ని మోసుకొస్తుంది. ఇంకెన్నో స్మృతుల్ని చెరిపేస్తుంది. అది సంజీవనిలా అద్భుతాలు చేయగలదు. వామనపాదమై అధఃపాతాళానికి తొక్కేయనూగలదు. పరుసవేదిలా పసిడిరెక్కల్ని విప్పార్చగలదు. కాలకూట విషమై యమపాశాన్ని విసరనూగలదు. కురుక్షేత్రమై వినాశనం సృష్టించగలదు. గీతాసారమై విశ్వరూప సందర్శనం చేయించనూ గలదు. అంతేనా? ఎంత సారూప్యం. ఇంకెంత వైవిధ్యం. ఎన్ని ఆవిష్కరణలు. ఇంకెన్ని అంతర్ధానాలు. ఎంతటి పురోగతి. ఇంకెంతటి తిరోగమనం. ఇవన్నీ కాలం తాలూకు ఇంద్రజాల మహేంద్రజాలాలే. కరవులు, వరదలు, భూకంపాలు, సునామీలు, మహమ్మారులు, యుద్ధాలు, మారణహోమాలు... ఎన్నెన్నో! ఈ అనంత పరిణామక్రమానికి తిరుగులేని సాక్షీభూతం... కాలచక్రమే.

ఈ కాలగమనంలోనే కరోనా పుట్టుకొచ్చింది. చూస్తుండగానే అప్రతిహతంగా పెరిగిపోయింది. దావానలమై ఖండాల్ని చుట్టబెట్టింది. భూగోళాన్ని లాక్‌డౌన్‌ చేసింది. ప్రపంచాన్ని క్వారంటైన్‌ చేసింది. మానవాళిని చిగురుటాకులా వణికిస్తోంది. భౌతికదూరం, సహజీవనం అనే రెండు కొత్త తారకమంత్రాలకు పురుడుపోసింది. మహా మహిమాన్విత కాలగ్రంథంలో కరోనా తనకంటూ ఓ పేజీని కేటాయించుకుంది.

జీవితమనేది చీకటి వెలుగుల రంగేళి- అంటాడో సినీ కవి. కరోనా సైతం జీవితానికి రెండు దృక్కోణాల్ని పరిచయం చేసింది. ఒకటి విమర్శ, రెండోది ఆత్మవిమర్శ. విమర్శలు కోకొల్లలు. కరోనా సృష్టి చైనా పనేనని అమెరికా దుమ్మెత్తిపోసింది. కరోనా కట్టడి విషయమై ట్రంప్‌, ప్రపంచ ఆరోగ్యసంస్థను చెడామడా చెడుగుడు ఆడేసుకున్నాడు. కొవిడ్‌ కల్లోలంపై తాను జనవరిలోనే హెచ్చరించినా మోదీ పెడచెవిన పెట్టారని రాహుల్‌ గాంధీ శాపనార్థాలు పెట్టారు. కరోనా ఉద్ధృతి తగ్గకముందే మద్యానికి పచ్చజెండా ఊపడమేమిటని ప్రతిపక్షాలు కన్నెర్ర చేశాయి. నిజానికి విమర్శ కంటే ఆత్మవిమర్శ శ్రేష్ఠమైంది. ఎందుకంటే, విమర్శ పలాయనవాదానికి దారితీస్తుంది. ఆత్మవిమర్శ గుణపాఠాన్ని శోధించి స్వీకరిస్తుంది. నా ఈ లేఖకు ఆధారం... ఆత్మపరిశీలనే!

కరోనా నేర్పిన భౌతిక దూరానికి నవ్య భాష్యం చెప్పి కొత్తపుంతలు తొక్కించాలి. ఇకపై, మద్యపాన అంటరానితనం పాటించాలి. ధూమపానానికో దణ్నం పెట్టాలి. గుట్కా వ్యసనానికి గుడ్‌ బై చెప్పాలి. జంక్‌ ఫుడ్‌ జోలికి పోరాదు. కాఫీ, టీల ప్రవాహానికి చెక్‌ పెట్టాలి. ఫోన్‌ అతివాడకానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. సామాజిక మాధ్యమాలతో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలి. దుబారా ఖర్చులకు కళ్లెం వేయాలి. ఆడంబరాలను ఆమడదూరం పెట్టాలి. ఎడాపెడా ఉమ్మే నోటికి మాస్కు వేయాలి. చీటికీ మాటికీ ఆస్పత్రుల చుట్టూ పరిభ్రమించే అలవాటుకు చెల్లుచీటీ పాడాలి. కాలుష్య కారకాలను వెదజల్లే వాహనాల్ని లాక్‌డౌన్‌ చేయాలి. ప్రతికూల ఆలోచనలకు ఓ నమస్కారం పెట్టాలి. బద్ధకాన్ని క్వారంటైన్‌లో బందీ చేయాలి. అతినిద్రను ఐసొలేషన్‌లో పెట్టాలి. ఇలా సరికొత్త జీవనశైలితో భౌతిక, బౌద్ధిక ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలి.

కరోనా కనువిప్పుతో సహజీవనానికి సరికొత్త సూక్తి ముక్తావళి రచించుకోవాలి. కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచాలి. బంధాల్ని బలోపేతం చేయాలి. స్నేహ మాధుర్యానికి పెద్దపీట వేయాలి. అభిరుచులకు కొత్త రెక్కలు తొడగాలి. పుస్తకాలతో దోస్తీ చేయాలి. కళాపోషణ, క్రీడారాధనల్ని ద్విగుణం బహుళం చేయాలి. ఐకమత్యమే మహాబలమని చాటాలి. తోటి జీవరాశిపై సఖ్యత చూపాలి. నేల, నింగి, నీరు, నిప్పు, గాలిని చైతన్యంతో బాధ్యతగా వాడుకోవాలి. ప్రకృతిలో లీనమై పరవశించాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలి. సామాజిక ఎరుక కలిగి మెలగాలి. ఈ కొంగొత్త భౌతిక దూరం, సహజీవన తారకమంత్రాలే జీవితానికి శ్రీరామరక్షగా నిలుస్తాయని బలంగా కాంక్షిస్తూ...

ఇట్లు..

మనిషి!

-నాగరాజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.