విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది ఉద్యమబాట పట్టారు. సుమారు 38వేల మందికి ప్రత్యక్షంగానూ, మరెంతో మందికి పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్న సంస్థను ప్రైవేటీకరించాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారుతోంది. సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందన్న సాకునే ప్రస్తావించి, దాన్ని ప్రైవేటీకరించడమే పరిష్కారమన్నట్లు పలువురు పెద్దలు తీర్పులిస్తున్నారు. కానీ, సంస్థకు కళ్లుచెదిరే ఆస్తులున్న విషయాన్ని మాత్రం విస్మరిస్తుండటం పలువురికి తీవ్ర ఆవేదన మిగులుస్తోంది. సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ప్రైవేటుపరం చేయడానికి పెద్దయెత్తున కుట్ర జరుగుతోందన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతోంది. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద కర్మాగారంగా గుర్తింపు పొందిన 'విశాఖ ఉక్కు' భవితవ్యాన్ని గందరగోళంలో పడేసే కార్యక్రమాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే తలకెత్తుకోవడం వల్ల పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.
అప్పులు.. తిప్పలు!
ఒకే ప్రాంగణంలో దశలవారీగా భారీ ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని నిర్వహించేందుకు వీలుగా ఏకంగా 22వేల ఎకరాల్లో దీన్ని నిర్మించారు. తొలిదశలో భూసేకరణ, మౌలికవసతులు, యంత్రసామగ్రి కొనుగోలు చేసి 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న కర్మాగారం నెలకొల్పారు. నిర్మాణ ప్రక్రియ పూర్తి కావడానికి వివిధ కారణాలతో అంతులేని జాప్యం జరగడం సంస్థపై పెను ఆర్థిక భారం మోపింది. సుమారు రూ.2,256 కోట్లతో పూర్తికావాల్సిన నిర్మాణానికి రూ.8,656కోట్ల వరకు వెచ్చించాల్సి వచ్చింది. కర్మాగార నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.4,900కోట్లు ఏమాత్రం చాలలేదు. దాంతో సంస్థ రూ.3,756 కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. చివరకు ఆ అప్పులే సంస్థకు గుదిబండగా మారాయి.
1998-99నాటికి సంస్థ నికర నష్టాలు రూ.4,600కోట్లకు చేరుకున్నాయి. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి సంస్థ బీఐఎఫ్‌ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైన్సాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్) పరిధిలోకి వెళ్లే ముప్పు ముంచుకొచ్చింది. అప్పట్లోనే దీన్ని ప్రైవేటీకరిస్తారన్న ఊహాగానాలు చెలరేగాయి. దాంతో వేల సంఖ్యలో కార్మికులు, కార్మికసంఘాల నేతృత్వంలో ఉద్యమం చెలరేగింది.
అప్పుపై కర్మాగారం ఏటా రూ.1,500కోట్ల వడ్డీ
అప్పులో కొంతభాగాన్ని కేంద్రం 'ప్రిఫరెన్షియల్ షేర్లు'గా మార్చడం వల్ల సంస్థకు ఒకింత ఆర్థిక వెసులుబాటు కలిగినట్లయింది. 2002 సంవత్సరం నుంచి సంస్థ క్రమంగా లాభాలబాట పట్టడం కారణంగా అంతకు ముందు అప్పులన్నీ తీరిపోయాయి. 2007నాటికి సుమారు రూ.8,500కోట్ల నిధులు సమకూర్చుకోగలిగింది. ఆ తరవాత క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు, ఆ తరవాత దాన్ని 7.3 మిలియన్ టన్నులకు విస్తరించారు. ఇందుకోసం ఏకంగా రూ.18వేల కోట్లు వెచ్చించారు. పనులు పూర్తికావడంలో మళ్లీ అంతులేని జాప్యం, విస్తరణ వ్యయాలు గణనీయంగా పెరగడం వల్ల అప్పుల భారం భారీగా పెరిగి సంస్థపై ప్రస్తుతం రూ.22వేల కోట్ల రుణం పోగుపడింది. తీసుకున్న అప్పుపై కర్మాగారం ఏటా ఏకంగా రూ.1,500కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.
భూమి విలువ అనూహ్యం
సంస్థకున్న 22వేల ఎకరాల భూముల విలువే సుమారు లక్షకోట్ల రూపాయలకు పైగా ఉంటుందంటే ఏమాత్రం అతిశయోక్తిలేదు. ఇందులోని మౌలికవసతులను ఇప్పటి స్థాయిలో అభివృద్ధి పరచాలంటే మరో లక్ష కోట్ల రూపాయలు హీనపక్షం వెచ్చించాలి. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని సంస్థ ప్రస్తుత విలువ హీనపక్షం రూ.2లక్షల కోట్లు ఉంటుందని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం సంస్థ ఆడిటర్లు మాత్రం భూమి వాస్తవ విలువ కలపకుండా సంస్థలోని నిర్మాణాలు, ఇతర అన్ని మౌలికవసతుల విలువ సుమారు రూ.23,135కోట్లు ఉంటుందని తేల్చినట్లు తెలుస్తోంది. అందులోంచి సంస్థకున్న రూ.22వేల కోట్ల అప్పును మినహాయిస్తే సంస్థ నికర విలువ రూ.1135కోట్లేనని తేల్చారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. కారుచౌకగా ఉన్న ఆ అతితక్కువ నికర విలువే దేశ, విదేశాల్లోని బడా పారిశ్రామికవేత్తల్ని విశేషంగా ఊరిస్తోంది. ఈ పరిస్థితుల్లో సంస్థలో కేంద్రానికి ఉన్న వందశాతం వాటాలను విక్రయించాలన్న ప్రతిపాదనలు వెలుగులోకి వచ్చాయి. దాంతో వేల సంఖ్యలో కార్మికులు ఉద్యమాలు, ఆందోళనల బాటపట్టారు.
ఏటా రూ.20వేల కోట్లకు పైగా 'టర్నోవర్' సాధించే స్థాయికి చేరుకున్న కర్మాగారానికి రూ.22వేల కోట్ల అప్పులు తీర్చడం పెద్ద విషయమేమీ కాదు. సొంత గనులు లేని కారణంగా ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తికి కర్మాగారం కనీసం నాలుగు వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క ఇనప ఖనిజం కారణంగానే ఏటా రూ.3వేల కోట్లు నష్టపోతోంది. గనులు కేటాయిస్తే ఆ అదనపు ఖర్చుకాస్తా లాభం కింద మారి సంస్థ వేలకోట్ల రూపాయల లాభాలు ఆర్జించే స్థాయికి ఎదుగుతుంది. ‘సెయిల్’లోగానీ, 'ఎన్‌ఎండీసీ'తోగానీ విలీనం చేస్తే ఇనుప ఖనిజానికి వేలకోట్ల రూపాయలు వెచ్చించే బాధ తప్పుతుంది. సంస్థకు ఉన్న రుణంలో సగం మొత్తాన్ని 'ఈక్విటీ'గా మార్చినా సంస్థపై అప్పులభారం గణనీయంగా తగ్గుతుంది. సాధ్యమైనంత వేగంగా గనులు కేటాయించపోతే సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోక తప్పదు. కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఉక్కు కర్మాగారాల్లో ఒక్క విశాఖ ఉక్కు కర్మాగారానికే గనులు లేకపోవడం సంస్థ భవితవ్యానికి పెనుశాపంలా మారింది.
మనోభావాలను గాయపరచొద్దు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కు కర్మాగారాన్ని ఒక పారిశ్రామిక సంస్థగా మాత్రమే చూడకూడదు. ఉక్కుశాఖ మంత్రి, సాక్షాత్తూ భారత ప్రధానమంత్రి కూడా విశాఖలో ఉక్కు కర్మాగారం వస్తుందని 1963లో ప్రకటించారు. ఆ ప్రకటన తరవాత కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేటలో కర్మాగారాన్ని ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నించింది. మరోవంక తమిళనాడు నేతలు సేలం, ఒడిశా నాయకులు పారాదీప్‌కు ఈ కర్మాగారాన్ని తరలించుకుపోయేందుకు ప్రయత్నించడం తెలుగువారిలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చింది. విశాఖతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ తదితర చోట్ల పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాల్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉక్కు ఉద్యమ ఆందోళకారులపై విశృంఖలంగా లాఠీఛార్జీలు చేశారు. ఒక దశలో కాల్పులకూ బరితెగించారు. నాటి పోలీసు కాల్పులు, లాఠీఛార్జీల్లో 32 మంది మరణించారంటే ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ఉక్కు మహిళే దిగొచ్చారు
లాఠీలకు, కాల్పులకు బెదిరిపోయి ప్రజలు ఉద్యమాన్ని మధ్యలోనే వదిలివేస్తారని భావించిన పాలకుల ఆశలు అడియాసలయ్యాయి. భారతీయ ఉక్కు మహిళగా పలువురి ప్రశంసలందుకున్న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా చివరకు దిగిరాక తప్పలేదు. 1970 జనవరి 21న విశాఖ వచ్చి ఇందిరాగాంధీ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. దాంతో విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగువారి ఆత్మగౌరవ పోరాటానికి నిలువెత్తు ప్రతీకగా మారింది. విశాఖ ఉక్కు ఉద్యమ చరిత్ర తెలుసుకోకుండా; ఉద్యోగుల, స్థానికుల మనోభావాలతో నిమిత్తం లేకుండా; ఆర్థిక కష్టనష్టాలను లెక్కపెట్టకుండా ప్రభుత్వాలు తీసుకునే ప్రతి చర్య ప్రతిఘటనను ఎదుర్కొంటుందనడంలో సందేహం లేదు.
- బి.ఎస్.రామకృష్ణ
ఇదీ చూడండి: 'కశ్మీర్లో 2019 ఆగస్టు ముందు పరిస్థితులు కావాలి'