వినియోగదారులకు తాను సూచించిన దానికన్నా ఎక్కువ తగ్గింపు ధర ఇవ్వకూడదంటూ డీలర్లపై ఆంక్షలు విధించిన మారుతి-సుజుకి(maruti suzuki CCI penalty) సంస్థకు భారత పోటీ ప్రోత్సాహక సంఘం (Competition commission of India) ఇటీవల రూ.200 కోట్ల భారీ జరిమానా విధించింది. ఇకనుంచి అలాంటి అక్రమ వ్యాపార కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించింది. కంపెనీ చర్య రిటైల్ వ్యాపారంలో పోటీని దెబ్బతీయడానికి ఉద్దేశించినదని సీసీఐ తప్పుపట్టింది. 2016 ఆగస్టులో సైతం సీసీఐ 11 సిమెంటు కంపెనీలకు మొత్తం రూ.6,300 కోట్ల జరిమానాలు విధించింది. సిమెంటుకు గిరాకీ లేని రోజుల్లో ఈ కంపెనీలు ఒక కూటమిగా ఏర్పడి అన్నీ ఒకే ధరకు సిమెంటు అమ్మాలని నిశ్చయించి- ధరలు తగ్గకుండా చూసుకున్నాయని సీసీఐ పేర్కొంది. మళ్ళీ అటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకూడదని ఆయా కంపెనీలను హెచ్చరించింది. బహిరంగ మార్కెట్లో ఆటో విడిభాగాలు దొరక్కుండా చేసి, వాటిని అధిక ధరకు తమ అధీకృత సర్వీసు కేంద్రాల నుంచి మాత్రమే కొనాల్సిన పరిస్థితిని వినియోగదారులకు కల్పించిన కొన్ని ఆటో కంపెనీలకూ సీసీఐ జరిమానాలు విధించింది. వినియోగదారుల నుంచి రకరకాల సాకులతో ఎక్కువ ధర పిండుకున్న కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకూ జరిమానాలు వేసింది. కొన్ని కంపెనీలు కూటమిగా ఏర్పడి ధరలు, అమ్మకాల విషయంలో గుత్తాధిపత్యం చలాయించకుండా జాగ్రత్తపడుతూ, పోటీని ప్రోత్సహించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి సీసీఐ చురుగ్గా వ్యవహరిస్తోంది.
కొరవడిన అవగాహన
భారత పార్లమెంటు 1969లో గుత్తస్వామ్యాలు, అక్రమ వ్యాపార కార్యకలాపాల నిరోధక చట్టం(ఎంఆర్‌టీపీ) రూపొందించింది. ఈ చట్టంవల్ల వ్యాపార కుమ్మక్కులు తగ్గి, పోటీతత్వం పెరిగిందా, వినియోగదారులు లాభపడ్డారా అని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన సమాధానాలు దొరకవు. ఎంఆర్‌టీపీ కింద కనీసం ఒక్క అంతర్జాతీయ వ్యాపార కూటమినీ కట్టడి చేయలేకపోయారు. పోనీ, ఇటువంటి కూటములు భారత్‌లో లేవా అంటే- ఉన్నాయి అనే జవాబు వస్తుంది. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ తెచ్చిపెట్టిన సవాళ్లను ఈ చట్టం సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. అందుకే కాలంచెల్లిన ఎంఆర్‌టీపీ స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని రాఘవన్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. తదనుగుణంగా ప్రభుత్వం 2002లో కొత్త పోటీ చట్టం చేసింది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు, సంయుక్త సంస్థలన్నింటికీ వర్తిస్తుంది. అణుశక్తి, కరెన్సీ, రక్షణకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం దీనికి మినహాయింపు.
కేంద్రప్రభుత్వం చేసిన కొత్త చట్టం కింద పోటీ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ చట్టం వివిధ కంపెనీలు సాధికారికంగా విలీనం కావడాన్ని నిషేధించదు. విలీనమైన కంపెనీలు మార్కెట్లో గుత్తాధిపత్యంతో వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీయకుండా చూస్తుంది. వినియోగదారులకు ఈ చట్టం గురించి బొత్తిగా తెలియదు. విపణిలో పోటీని ప్రోత్సహిస్తే, ధరలు తగ్గి, తమకు లాభదాయకమవుతుందనే చైతన్యం వారిలో కొరవడింది. పోటీ కమిషన్ ఇటీవల తీసుకున్న చర్యలు వినియోగదారుల్లో అవగాహన పెంచడానికి తోడ్పడతాయని ఆశిద్దాం.
ముందున్న మార్గం..
భారత్‌లో వ్యాపారపరమైన పోటీ దివ్యంగా ఉందని భావించడానికి వీల్లేదు. వివిధ కంపెనీలు విలీనమై బృహత్తర సంస్థలుగా అవతరిస్తున్నాయి. 2021 సంవత్సరం తొలి ఏడు నెలల్లోనే జరిగిన విలీనాల విలువ మూడు లక్షల కోట్ల రూపాయల పైమాటే. ఇంతటి భారీ గుత్త సంస్థల దెబ్బకు చిన్న, మధ్యతరహా సంస్థలు తట్టుకోలేక కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వ్యాపార సంస్థలు కుమ్మక్కై కూటములుగా ఏర్పడి ధరలను పెంచి వినియోగదారులకు తీవ్ర నష్టం కలిగించకమానవు. దీన్ని నివారించడానికి పోటీ కమిషన్ గట్టి చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో అన్ని కంపెనీలు సమానంగా పోటీపడే అవకాశాన్ని కల్పించాలి. ప్రస్తుతం పోటీ కమిషన్‌కు దిల్లీలో మాత్రమే కార్యాలయం ఉంది. ఇంతటి సువిశాల దేశానికి కేవలం ఒక్కచోటనే కేంద్రీకృత కార్యాలయం ఉంటే సరిపోదు.
వివిధ ప్రాంతాల్లోని మార్కెట్ పరిస్థితులను ప్రత్యక్షంగా అంచనా వేసే వెసులుబాటు కేంద్రీకృత కార్యాలయానికి ఉండదు. అందువల్ల ప్రతి రాష్ట్రంలో పోటీ కమిషన్ శాఖలను ఏర్పాటుచేయాలి. ఈ ప్రాంతీయ కార్యాలయాలు స్థానిక మార్కెట్ పరిస్థితులపై నిఘా వేయాలి. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలపై సమీక్షలు నిర్వహించాలి. పోటీ కమిషన్‌కు బడా వ్యాపార కూటముల కార్యకలాపాలపై నిఘా వేయడానికి సరైన యంత్రాంగం లేదు. ఈ కూటములు ప్రధానంగా తెరవెనక కార్యకలాపాలకే పాల్పడుతుంటాయి కాబట్టి వాటిని పసిగట్టడానికి పటిష్ఠ నిఘా అవసరం. అమెరికా, ఐరోపాలలో మాదిరిగా భారతీయ పోటీ కమిషన్‌కూ చట్టపరంగా విస్తృత నిఘా అధికారాలను కట్టబెట్టాలి. పోటీ చట్టం, కమిషన్ ఆదేశాల గురించి వ్యాపార సంస్థల్లో, ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. విస్తృతమైన ప్రచారం ద్వారానే వినియోగదారుల్లో చైతన్యం పెరుగుతుంది. తద్వారా గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట పడుతుంది.
పటిష్ఠ నిఘా
విపణిలో వ్యాపార సంస్థల గుత్తాధిపత్యాన్ని నిరోధిస్తూ, వినియోగదారులకు ప్రయోజనకరంగా పోటీని ప్రోత్సహించడానికి అమెరికా, ఐరోపాలలో 19వ శతాబ్దం నుంచే చట్టాలకు కాలానుగుణంగా సవరణలు చేస్తున్నారు. వీటికి యాంటీ ట్రస్ట్ చట్టాలని పేరు. ప్రపంచమంతటా వివిధ ప్రభుత్వాలు వ్యాపార కూటముల నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాయి. కూటములు కట్టే కంపెనీల మీద జరిమానాలు విధిస్తున్నాయి. చట్టపరమైన చర్యలు తీసుకొంటున్నాయి. ఫార్మా, నౌకా రవాణా, పారిశ్రామికోత్పత్తి రంగాల్లో వ్యాపార కూటములు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. వీటి ఆట కట్టించడానికి అమెరికా, ఐరోపాలలో సక్రమ వ్యాపార కార్యకలాపాల ప్రోత్సాహక సంఘాలను ఏర్పాటుచేశారు.
మార్కెట్లో పోటీని చిదిమేయడానికి మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి బడా టెక్ కంపెనీలు చేపట్టిన అక్రమ కార్యకలాపాలపై ఈ సంఘాలు విచారణ జరిపి భారీ జరిమానాలు విధించాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పరం అనుసంధానమైన ఈనాటి వాతావరణంలో మార్కెట్లో గుత్తాధిపత్యం చలాయించడం ఎక్కువవుతోంది. వ్యాపార సంస్థల కూటములు ఇదివరకటిలా ఏదో ఒక్కదేశానికే పరిమితమై లేవు. దేశదేశాల్లో కుమ్మక్కై పోటీని నులిమేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసి పోటీని ప్రోత్సహించడంలో అమెరికా, ఐరోపా దేశాల కమిషన్లు ఎంతో పురోగతి సాధించాయి. గుత్తస్వామ్యాలు తలెత్తకుండా అనుక్షణం నిఘావేసి ఉంచుతున్నాయి.
--డాక్టర్ చెన్నుపాటి దివాకర్ బాబు, శ్రీమతి వీడీ సిద్థార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపల్, విజయవాడ.
ఇదీ చదవండి: