కొవిడ్ వ్యాధి విజృంభణ వల్ల జరిగిన తీవ్ర ప్రాణ, ఆర్థిక నష్టాలకు చైనా నుంచి భారీ నష్టపరిహారాన్ని వసూలు చేయాలంటూ అమెరికా కోర్టుల్లో కనీసం ఆరు దావాలు దాఖలయ్యాయి. అమెరికా కోర్టు వ్యాజ్యాల నుంచి చైనాకు దౌత్యపరమైన రక్షణను తొలగించాలనే బిల్లును అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు దిగువ సభ)లో కొందరు సభ్యులు ప్రవేశపెట్టారు. ఇలాంటి చర్యలతో తమ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే తాము కూడా అమెరికా మీద ప్రతిచర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. చివరకు అమెరికా బిల్లు వల్ల కాని, కోర్టు దావాల వల్ల కాని ఒరిగేదిమీ ఉండదని న్యాయకోవిదులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా కోర్టుల్లో చైనా మీద దావాలు వేసినా, దేశాల మధ్య వివాదాలను పరిశీలించి, పరిష్కరించే అధికారం అక్కడి న్యాయ స్థానాలకు లేదు. దీనికి అంతర్జాతీయ చట్టాలు సమ్మతించవు కూడా. జాతీయ న్యాయస్థానాలు అంతర్జాతీయ వివాదాలపై తీర్పరులు కాలేవు. ఏదైనా ఒక దేశం అంతర్జాతీయ ఒప్పందాల కింద తన బాధ్యతలను నెరవేర్చకపోయినా లేక మరో దేశ భూభాగాన్ని ఆక్రమించినా అంతర్జాతీయ న్యాయసూత్రాలు రంగప్రవేశం చేస్తాయి. అతిక్రమణదారీ దేశాన్ని జవాబుదారీ చేస్తాయి. కొవిడ్ వ్యవహారంలో చైనా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు నిరూపించే పరిస్థితి లేదు. అసలు తాను అమెరికా న్యాయస్థానాల తీర్పులకు కట్టుబడాల్సిన పని కూడా లేదని చైనా స్పష్టీకరిస్తోంది. సార్వభౌమ దేశాలకు ఇలాంటి న్యాయపరమైన రక్షణ ఉంటుందని అంతర్జాతీయ న్యాయ సూత్రాలూ సమర్థిస్తున్నాయి.
నిబంధనలే అడ్డు
దేశాల మధ్య వివాదాలను విచారించాల్సింది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ న్యాయస్థానమే (ఐసీజేయే) తప్ప, జాతీయ కోర్టులు కావని కెనడా న్యాయ నిపుణుడు డాక్టర్ అబ్బాస్ పోర్ హషీమీ వివరించారు. అయితే కక్షిదారీ దేశాల అనుమతి లేకుండా ఐసీజే తనంతటతాను విచారణ చేపట్టజాలదు. అమెరికా, చైనాలు ఐసీజే విచారణాధికారాన్ని ఆమోదించడం లేదు కనుక, ఐసీజే చేయగలిగిందేమీ లేదు. పోనీ, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) వల్ల ఏమైనా అవుతుందా అంటే అదీ లేదు. సామూహిక హత్యాకాండ, మానవాళి పట్ల ఘోరాలు, యుద్ధనేరాలు, దురాక్రమణలకు పాల్పడిన వ్యక్తులపై విచారణ జరిపి శిక్షించే అధికారం ఐసీసీకి ఉంది. కానీ సదరు అధికారాన్ని ఐసీసీకి కట్టబెడుతున్న రోమ్ శాసనంపై అమెరికా, చైనాలు సంతకం చేయలేదు. కనుక ఈ కోర్టు కూడా చైనా విషయంలో ఎటువంటి చర్యా తీసుకోలేదు. చివరగా భద్రతా మండలి చేయగలిగింది ఏమైనా ఉందా అని పరిశీలించాలి. అంతర్జాతీయ శాంతి సుస్థిరతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాననే హామీ మీద చైనా ఐరాస భద్రతా మండలి సభ్యురాలైంది. ఈ హామీని చైనా నిలబెట్టుకోలేదని భద్రతా మండలి తీర్మానించవచ్చు లేదా మండలి రోమ్ శాసనం మీద సంతకం చేసింది కానుక చైనా కేసును ఐసీసీకి అప్పగించవచ్చు. అదే జరిగితే భద్రతా మండలి శాశ్వత సభ్యురాలి హోదాలో సదరు తీర్మానాన్ని వీటో చేసే అధికారం చైనాకు ఉంది. ఏతావతా ఏ దేశం కాని, ఏ వ్యక్తి కాని చైనాపై ఎన్ని దావాలు వేసినా వచ్చే ప్రయోజనం సున్న. దీన్ని గమనించబట్టి కొందరు అమెరికా కాంగ్రెస్ సభ్యులు 1976నాటి విదేశీ సార్వభౌమత్వ రక్షణ చట్టం సవరణకు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిందని, దీనివల్ల నష్టపోయిన బిల్లు ప్రతిపాదకులు వాదించారు. 1976 చట్టం అమెరికాలో నేరపూరిత చర్యలకు, వ్యాపారాలకు పాల్పడే విదేశీ ప్రభుత్వాలకు సార్వభౌమత్వ రక్షణ లభించదని స్పష్టం చేస్తోంది. చైనాపై అమెరికాలో వివిధ కోర్టుల్లో దాఖలైన దావాలు పై చట్టాన్ని ప్రాతిపదికగా తీసుకొంటున్నాయి. కానీ, చైనా ఉద్దేశపూరితంగా అమెరికాలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడిందని కాని, అమెరికా గడ్డపై చైనా వాణిజ్య కార్యకలాపాల వల్ల కొవిడ్ వ్యాధి ఉత్పన్నమైందని కాని నిరూపించే అవకాశం లేదు కనుక సంబంధిత దావాలు నిలబడలేవు. అయినా, అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి కోర్టు దావాలతో సంచలనం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది.
డ్రాగన్ ఎదురుదాడి
చైనా ఈ దావాలకు చట్టపరమైన ప్రాతిపదిక లేదని, వాస్తవాలకు అవి దూరంగా ఉన్నాయని ఉద్ఘాటించింది. కొవిడ్ వ్యాధి తమ భూభాగంపై దండెత్తనుందని ముందే తెలిసినా అమెరికా ప్రభుత్వం మేల్కోలేదని, అమెరికాలో వ్యాధి చెలరేగిపోవడానికి అక్కడి ప్రభుత్వ అసమర్థత, అజాగ్రత్తలే కారణం తప్ప తాము కాదని చైనా కుండ బద్దలుకొట్టింది. అయినా సరే అమెరికన్లు దావాలతో ముందుకెళ్లి చైనా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పులు సాధించుకున్నా, అందుకు బీజింగ్ ఒప్పదు గాక ఒప్పదు. అలాంటి పరిస్థితిలో అమెరికాలో ఉన్న చైనా ఆస్తులను జప్తు చేసుకోవలసి రావచ్ఛు దీనికి ప్రతిగా చైనాలోని అమెరికా ఆస్తులూ జప్తుకావచ్ఛు ఇది రెండు దేశాల మధ్య తీవ్ర వైమనస్యాలను సృష్టిస్తుంది. దీనికి బదులు రెండు దేశాలూ పరస్పర సహకారంతో సమస్యా పరిష్కారానికి ప్రయత్నించడం మేలు. కొవిడ్ పుట్టుక, వ్యాప్తి గురించి మరింత సమగ్ర సమాచారం ఇవ్వాలని అమెరికా, అంతర్జాతీయ సమాజం చైనాపై ఒత్తిడి తీసుకురావాలి. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రపంచ దేశాలు ఒక అంగీకారానికి రావాలి. అందుకు అన్ని దేశాలూ కట్టుబడి ఉండాలి. ఎన్నికల అనివార్యతలతో కాకుండా ముందుచూపుతో సమర్థ దౌత్య పరిష్కారం కనుగొనాలి.
- ఆర్య (రచయిత)
ఇదీ చూడండి: అమెరికాలో 'ఫ్లాయిడ్' సెగ- దశాబ్దంలో చూడని ఆందోళనలు