ETV Bharat / opinion

సాగర భద్రతకు అనుసరణీయ సూత్రాలతో భారత్​

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష హోదాలో భారత్‌ తిరుగులేని విజయాన్ని సాధించింది. సముద్ర భద్రతకు ప్రధాని మోదీ సమర్పించిన అయిదు ప్రతిపాదనలను భద్రతా మండలి సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ వర్చువల్‌ సమావేశంలో చెప్పుకోవలసిన అంశం- 1982 డిసెంబరు 10న కుదిరిన ఐక్యరాజ్యసమితి సముద్ర చట్ట ఒప్పందం (యున్‌క్లోస్‌)ను భద్రతా మండలి అధికారికంగా గుర్తించడం. చాలాకాలంగా యున్‌క్లోస్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా కూడా ఈసారి గుర్తింపు ఇవ్వడం విశేషం.

author img

By

Published : Aug 17, 2021, 6:03 AM IST

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష హోదాలో భారత్‌ గణనీయమైన విజయాన్ని సాధించింది. ఇండియాకు ఈ హోదా లభించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల తొమ్మిదో తేదీన 'సముద్ర భద్రత- అంతర్జాతీయ సహకారం' అనే అంశంపై మండలి జరిపిన చర్చలో వర్చువల్‌ ప్రసంగం చేశారు. భద్రతామండలిలో ప్రసంగించిన ప్రప్రథమ భారత ప్రధాని మోదీయే. సముద్ర భద్రతకు ప్రధాని సమర్పించిన అయిదు ప్రతిపాదనలను భద్రతా మండలి సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఆయన పంచసూత్ర అజెండాలోని అంశాలు ఇవీ..

అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి అడ్డంకులు తొలగించడం; సముద్ర వివాదాలను శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పరిష్కరించుకోవడం; సునామీలు, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడంతోపాటు సముద్ర దొంగలు, ఉగ్రవాదుల ఆగడాలను కట్టడి చేయడం; ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చమురు తెట్టు సముద్ర జలాలను కలుషితం చేయడాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకోవడం. ఈ చర్యల ద్వారా సముద్రాలను, వాటిలోని సహజ వనరులను కాపాడటం; సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించి అన్ని దేశాలూ గౌరవించడం. 15 సభ్య దేశాలుగల భద్రతామండలికి భారత్‌ నెల రోజులపాటు అధ్యక్షత వహిస్తుంది. రొటేషన్‌ పద్ధతిపై అధ్యక్ష హోదా ఇవ్వడం మండలి ఆనవాయితీ.

దక్షిణ చైనా సముద్రంపై రగడ

మండలి వర్చువల్‌ చర్చా సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, వియత్నాం ప్రధాని ఫామ్‌ మిన్‌ చిన్‌లతోపాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్‌లు పాల్గొనడాన్ని బట్టి సముద్ర భద్రతకు అగ్ర దేశాలు ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో అర్థమవుతోంది. ఐరాసలో చైనా శాశ్వత ప్రతినిధి ఝాంగ్‌జున్‌ బదులు ఉపశాశ్వత ప్రతినిధి పాల్గొన్నారు. ఈ వర్చువల్‌ సమావేశంలో చెప్పుకోవలసిన అంశం- 1982 డిసెంబరు 10న కుదిరిన ఐక్యరాజ్యసమితి సముద్ర చట్ట ఒప్పందం (యున్‌క్లోస్‌)ను భద్రతా మండలి అధికారికంగా గుర్తించడం. చాలాకాలంగా యున్‌క్లోస్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా కూడా ఈసారి గుర్తింపు ఇవ్వడం విశేషం. యున్‌క్లోస్‌ను అమెరికా సైతం ఆమోదించకపోయినా, దాన్ని అంతర్జాతీయ చట్టంగా మాత్రం గుర్తిస్తోంది.

బీజింగ్‌ యున్‌క్లోస్‌ను ఉల్లంఘిస్తూ దక్షిణ చైనా సముద్రంలో దురాక్రమణకు పాల్పడుతోందని మండలి చర్చలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ విమర్శించారు. అయితే, దక్షిణ చైనా వివాదం గురించి చర్చించడానికి భద్రతా మండలి సరైన వేదిక కాదని చైనా అభ్యంతర పెట్టింది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు హక్కులు లేవని పేర్కొంది. 13 లక్షల చదరపు మైళ్ల మేర విస్తరించిన ఈ సముద్రం తనదేనని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ పంచసూత్రలో సముద్ర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న ప్రతిపాదన చైనాపై ఎక్కుపెట్టినదనే అభిప్రాయం వ్యక్తమైంది. బ్లింకెన్‌ మండలి చర్చలో రష్యాపైనా విరుచుకుపడ్డారు. నల్ల సముద్రం, అజోవ్‌ సముద్రం, కెర్చ్‌ జలసంధిలో రష్యా దురాక్రమణకు పాల్పడుతూ ఉక్రెయిన్‌ను ఇబ్బందుల పాల్జేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆరోపించగా, రష్యా అధినేత పుతిన్‌ దాన్ని ఖండించారు.

ముందే అమలు చేసిన భారత్‌

భద్రతా మండలిలో సముద్ర భద్రత గురించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగానికి సభ్యుల నుంచి ఆమోదం వ్యక్తం కావడం విశేష పరిణామం. ఈ ప్రసంగ పాఠాన్ని మండలి సభ్యులకు మొదటే చూపించి అంగీకారం తీసుకున్నారు. తాను ప్రతిపాదిస్తున్న పంచ సూత్రాలను భారత్‌ ముందుగానే అమలుచేసి చూపిందని మోదీ మండలి ప్రసంగంలో ఉద్ఘాటించారు. వీటిలో మొదటి సూత్రం- సముద్ర భద్రతకు అడ్డంకులు తొలగించడం. దీనికోసం భారత్‌ 2015లోనే సాగర్‌ (ప్రాంతీయ భద్రత, సహకారం) పేరిట దార్శనిక పత్రం ప్రకటించింది. సాగర్‌ దక్షిణాసియాలో ప్రాంతీయ సముద్ర వ్యాపార భద్రతకు, సముద్ర వ్యాపార విస్తరణకు దోహదం చేస్తుందని మోదీ వివరించారు. సముద్ర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న రెండో సూత్రాన్ని కూడా భారత్‌ అమలు చేసి చూపిందన్నారు. బంగ్లాదేశ్‌తో సముద్ర సరిహద్దు వివాద పరిష్కారమే దీనికి ఉదాహరణ. దక్షిణ చైనా సముద్రంలో కూడా చైనా, తన పొరుగు దేశాలతో వివాదాలను ఇలాగే సామరస్యంగా పరిష్కరించుకోవాలని మోదీ అన్యాపదేశంగా సూచించినట్లయింది. ఆయన చేసిన మూడో ప్రతిపాదననూ భారత్‌ ఇప్పటికే అమలు చేస్తోంది. సోమాలియా సముద్ర దొంగల ఆట కట్టించడం, హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించినప్పుడు ఇతర దేశాలతో కలిసి సహాయ చర్యలు చేపట్టడం దీనికి తార్కాణం. నాలుగో ప్రతిపాదన ప్రకారం సముద్రాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చమురు కలవకుండా జాగ్రత్త పడాలి. దీనిపై శాస్త్ర సాంకేతిక పరిశోధనలు జరగాలి. భారత్‌ ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సముద్ర పరిశోధనల్లో పాలుపంచుకొంటున్న సంగతి తెలిసిందే. అయిదో ప్రతిపాదన కింద- సముద్ర వ్యాపార నిర్వహణకు అంతర్జాతీయ ప్రమాణాలను నిర్ణయించడానికి భారత్‌ మొదటి నుంచీ కృషి చేస్తూనే ఉంది.

రష్యా మద్దతు

మోదీ ప్రతిపాదనలను పుతిన్‌ గట్టిగా సమర్థించారు. సముద్రాల్లో ఉగ్రవాదులు, దొంగల కార్యకలాపాలను నిర్మూలించడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. సముద్ర మార్గాల భద్రత కోసం ఐరాసతో పాటు ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌), తూర్పు ఆసియా సభ (ఈఏఎస్‌)లతో కలిసి తాము పని చేస్తున్నట్లు పుతిన్‌ చెప్పారు. దీన్నిబట్టి దక్షిణ చైనా సముద్ర పరిణామాల పట్ల రష్యా కూడా శ్రద్ధ తీసుకొంటున్నట్లు అర్థమవుతోంది. మొత్తం మీద భద్రతా మండలి సముద్ర భద్రత గురించి చర్చించడం విశేషమని చెప్పాలి. గతంలో ఇలాంటి చర్చ కోసం వియత్నాం, ఈక్వెటోరియల్‌ గినియా ప్రయత్నించినా మండలిలో వీటో అధికారం గల శాశ్వత సభ్యదేశ హోదాలో చైనా ఆ యత్నాలను అడ్డుకొంది.

భారత్‌ మాత్రం తన అధ్యక్షతలో ఈ చర్చ జరిపి తీరాలని నిశ్చయించుకుని అన్ని దేశాల మద్దతు కూడగట్టడం ప్రారంభించింది. చైనాతో సహా అందరికీ ఆమోదనీయ ప్రసంగ పాఠాన్ని రూపొందించింది. ఉదాహరణకు ప్రాదేశిక సార్వభౌమత్వం, అక్రమ చేపల వేట గురించి ఈ పత్రంలో ప్రస్తావించలేదంటే కారణం- అవి చైనాకు రుచించనివి కావడమే. దక్షిణ చైనా సముద్రంపై వియత్నాం, ఫిలిప్పీన్స్‌ వంటి తీర దేశాలకు కాకుండా, తనకే సార్వభౌమత్వం ఉందని వాదించే చైనా, తన చేపల పడవలను ఆ సముద్ర జలాల్లోకి యథేచ్ఛగా పంపుతోంది. చైనాకు నచ్చని ఈ రెండు అంశాలనూ మోదీ ప్రసంగంలో ప్రస్తావించకపోయినా, యున్‌క్లోస్‌ ఒప్పందం గురించి మాత్రం నొక్కి చెప్పారు. ఈ ఒప్పందం చైనాకు నచ్చకపోయినా అమెరికా సహా అన్ని దేశాలకూ సమ్మతమే. మొత్తంమీద భారత్‌ తాను చెప్పదలచుకున్న అంశాలను నేర్పుగా ప్రకటించి, ప్రపంచ మన్ననలు పొందింది.

- ఏఏవీ ప్రసాద్‌

ఇదీ చూడండి: 'ఉగ్రవాద నిర్మూలన, శాంతి స్థాపనే ప్రధాన ఎజెండా'

ఇదీ చూడండి: 'అందుకు ఐరాస భద్రతా మండలి సరైన వేదిక కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.