ETV Bharat / opinion

పేదరికంలోకి జారుతున్న మధ్యతరగతి!

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​లతో (Impact of Lockdown on Middle Class) పేదరికం మరింతగా విస్తరించడం ప్రారంభించింది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేవలం సంస్కరణలు చేపట్టినంత మాత్రాన వృద్ధిరేటును పరుగులెత్తించడం, పేదరిక నిర్మూలన సాధ్యంకాదు. సంస్కరణలతోపాటు భారీస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు సమకూరితేనే అవన్నీ సుసాధ్యమవుతాయి.

poverty
Covid-19
author img

By

Published : Oct 27, 2021, 7:00 AM IST

కొవిడ్‌ రెండు దశల్లో సృష్టించిన ఆర్థిక సంక్షోభం- పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను (Middle Class Poverty) అతలాకుతలం చేసింది. దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి, ప్రజల జీవన ప్రమాణాలను ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను (Impact of Covid-19 on Middle Class Family), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసింది. కరోనా విజృంభించడానికన్నా ముందునుంచే అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్ల ప్రభావం గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. ఫలితంగా దేశవ్యాప్తంగా నెలల తరబడి ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి వృద్ధిరేటు తిరోగమనంలో పయనించింది. దీంతో దేశంలో పేదరికం విస్తరించడం ప్రారంభించింది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేవలం సంస్కరణలు చేపట్టినంత మాత్రాన వృద్ధిరేటును పరుగులెత్తించడం, పేదరిక నిర్మూలన సాధ్యంకాదు. సంస్కరణలతోపాటు భారీస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు సమకూరితేనే అవన్నీ సుసాధ్యమవుతాయి.

ఆర్థిక వ్యవస్థలో కీలకం

దేశ ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి పాత్ర ఎంతో కీలకం. వస్తు సేవల కొనుగోళ్లు, వినియోగంలో వీరి వాటాయే అత్యధికం. దేశంలో కొత్తగా వచ్చే నవకల్పనలను, వస్తువులను, సేవలను విస్తృతంగా వ్యాప్తిచెందించేది మధ్యతరగతి ప్రజలే. వీరు శక్తిమంతమైన ప్రచారకులు. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త వస్తుసేవలను వినియోగించుకోవడంలో అతి తక్కువ జనాభాగల ధనిక కుటుంబాలు ముందుంటే, ఆ తరవాతి వరసలో వీరే ఉంటారు. విద్య ద్వారా మానవ వనరుల సంపద పెరుగుదలకు, వస్తు సేవల ఉత్పత్తికి ఉపకరించే పెట్టుబడులకు కారణమయ్యే పొదుపులకు వీరి సేవలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. మధ్యతరగతి వర్గం కారణంగానే దేశంలో ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఎదగడానికి గట్టి పునాది పడింది. 1991 ఆర్థిక సంస్కరణల అమలుతో వారిసంఖ్య గణనీయంగా పెరిగింది. జనాభాలో వారి వాటా 25శాతమే అయినా ప్రభుత్వానికి పలురకాల పన్నుల చెల్లింపుల ద్వారా గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. వస్తుసేవల కొనుగోళ్లలో నాలుగింట మూడొంతుల వాటా వారిదే. దీనివల్ల వస్తుసేవలు, దీర్ఘకాలం మన్నే వస్తువులకు గిరాకీ పెరిగి ఉత్పత్తి, ఉపాధి పెరుగుదలకు దోహదపడి దేశ ఆర్థిక రథచక్రాలు దౌడు తీస్తాయి. కరోనా మొదటి విడత ఉద్ధృతి మూలంగా దేశంలో 3.2 కోట్లకు పైగా మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి జారుకున్నారు. రెండో విడతతో వీరి సంఖ్య మరింత పెరిగింది. గత ఏడాది ఆగస్టు 30 నాటికి దేశంలో నిరుద్యోగిత అత్యధికంగా 8.13శాతంగా నమోదైంది. రెండో ఉద్ధృతి కొనసాగుతూ, మూడోవిడత పొంచి ఉన్నందున ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా మరిన్ని మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలోకి జారుకుంటాయనడంలో సందేహం లేదు. 2021 జనవరి నాటికి ఉపాధి కోల్పోయిన వ్యవసాయేతర శ్రామికుల్లో 1.37 కోట్ల మంది వేతన జీవులు, చిన్న, మధ్యస్థాయి వ్యాపారులే ఉన్నారు. ప్రజలు పేదరికంలోకి జారుకోవడానికి కరోనాతోపాటు, పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు కూడా ముఖ్య కారణంగా నిలుస్తున్నాయి. పెరిగే ధరలు పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇతర వస్తువుల కొనుగోలుకు ఉపకరించే ఆదాయాన్ని హరిస్తూ పొదుపునకు దూరం చేస్తున్నాయి. పెట్రోలు, డీజిలుపై కేంద్ర పన్నులు భారీగా పెంచడంతో వాటి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు ఆసుపత్రి బిల్లులు, పిల్లల బడి రుసుములు భారంగా మారాయి. వీటన్నింటి ప్రభావంతో వస్తు సేవలకు గిరాకీ మరింత తగ్గింది.

సర్కారు అండ అవసరం

పారిశ్రామికవేత్తలకు భారీస్థాయిలో మొండి బకాయిలు రద్దు చేస్తూ, కార్పొరేట్‌ పన్నును తగ్గించిన ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలు ఎంతగా సతమతమైనా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాల్నీ ప్రకటించలేదు. కరోనా కష్టకాలంలో ఆదాయపు పన్ను నుంచీ ఉపమశమనం కల్పించలేదు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ప్రకటించిన పలు పథకాల్లోనూ వీరికెలాంటి చోటూ దక్కకపోవడం గమనార్హం. దేశంలో లాక్‌డౌన్లు, ఆంక్షలతో పేదరికంలోకి జారుకున్న మధ్యతరగతి ప్రజలు మరో అయిదారేళ్లదాకా పూర్వ స్థితికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దేశ జనాభాలో 50శాతం దిగువ స్థాయి ప్రజల వద్ద ఉన్నంత సంపద, కేవలం ఒక శాతం అగ్రస్థాయి ధనికుల వద్దే పోగైంది. అయినా, శ్రీమంతులు ఉత్పాదక కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టకుండా, స్టాక్‌ మార్కెట్లలో పెట్టి, తమ సంపదను కేవలం ఏడాది వ్యవధిలోనే 35శాతానికి పెంచుకున్నారు. మధ్యతరగతి ప్రజానీకం మాత్రం పెట్టుబడి నష్టభయాలతో తమ మిగులు ఆదాయాన్ని బ్యాంకుల్లోనే దాచుకున్నారు. వడ్డీరేట్లు తగ్గినా 2020-21లో బ్యాంకు డిపాజిట్లు 11.4శాతం పెరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచంలో ఏ దేశానికైనా మధ్య తరగతి జనాభా తగ్గిపోవడం క్షేమకరం కాదు. ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరాలంటే ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజల్ని తగిన రీతిలో ఆదుకోవడం మంచిది. దీనివల్ల వృద్ధి పరుగులు పెడుతూ వినియోగదారుల్లో విశ్వాసం ఇనుమడిస్తుంది.

- ప్రొఫెసర్‌ బి.రామకృష్ణారావు (విశ్రాంత ఆచార్యులు, ఆంధ్రా యూనివర్సిటీ)

ఇదీ చూడండి: మహమ్మారి ప్రభావంతో హెచ్చరిల్లుతున్న పేదరికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.