ETV Bharat / opinion

కొత్త లెక్కలు... కొన్ని చిక్కులు!

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి.  ప్రపంచీకరణ, జాతీయవాదాల మధ్య దేన్ని ఎంపిక చేసుకోవాలన్నది మున్ముందు పెద్దయెత్తున చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. వైరస్‌ పుట్టుకకు కారణమై, ప్రపంచాన్ని కల్లోలంలో ముంచిందన్న ఆరోపణలను చైనా దీర్ఘకాలంపాటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చైనా నుంచి కంపెనీలు తరలిపోయేందుకు సిద్ధమవుతున్నాయి. చైనా బలహీనతలను భారత్‌ బలంగా మార్చుకోవాలి.

global economy
కొత్త లెక్కలు... కొన్ని చిక్కులు!
author img

By

Published : May 4, 2020, 7:24 AM IST

కొవిడ్‌ మహమ్మారి యావత్‌ ప్రపంచాన్నీ మాంద్యంలోకి నెట్టేసింది. అమెరికా వంటి దేశాలను కరోనా వైరస్‌ ముట్టడి ఆర్థికంగా అతలాకుతలం చేసింది. ప్రపంచ ఆర్థికం కుదేలవుతున్న దశలో కరోనా విరుచుకుపడింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు గాడితప్పి, సామాజిక అశాంతి ప్రబలి, రాజకీయ పార్టీల పట్ల అసంతృప్తి విస్తరిస్తున్న సంధి కాలంలో కరోనా వైరస్‌ కమ్ముకొంది. ప్రపంచీకరణతో దూరాలు కరిగిపోయాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ విరుచుకుపడి ప్రపంచీకరణ నడ్డివిరిచింది. మరోవంక అంతకంతకూ విస్తరిస్తున్న చైనా సైనిక, ఆర్థిక ప్రాబల్యం అమెరికాను అభద్రతలోకి నెట్టింది. తమ ఉన్నతశ్రేణి సాంకేతిక పరిజ్ఞానం, మేధా సంపత్తి చైనా చేతికి చిక్కకుండా అమెరికా ఇప్పటికే అన్ని కట్టుదిట్టాలూ చేసుకొంది. చైనాపట్ల తన మిత్ర దేశాలూ అదే పద్ధతిని అనుసరించాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది.

మారుతున్న సమీకరణలు

ప్రపంచీకరణ, జాతీయవాదాల మధ్య దేన్ని ఎంపిక చేసుకోవాలన్నది మున్ముందు పెద్దయెత్తున చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ను చైనా సృష్టించిందా లేక అది సహజంగానే ఉద్భవించిందా అనే విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. వైరస్‌ పుట్టుకకు కారణమై, ప్రపంచాన్ని కల్లోలంలో ముంచిందన్న ఆరోపణలను మాత్రం చైనా దీర్ఘకాలంపాటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 14 లక్షల కోట్ల డాలర్ల విలువైన చైనా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఉత్పత్తి రంగంపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. ఫ్యాక్టరీలను పునరుజ్జీవింపజేసి, మౌలిక సౌకర్యాలను విస్తరించుకోవడమన్నది అప్పుల్లో కూరుకుపోయిన చైనా ముందు ఇప్పుడున్న అతిపెద్ద సవాలు. ‘ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌’, ఆఫ్రికాలో ఖనిజ వనరుల అన్వేషణ పేరిట చైనా ఇప్పటికే వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టేసింది. ఆ వ్యయం ప్రస్తుతం చైనాకు అతిపెద్ద భారంగా మారింది. స్థూల దేశీయోత్పత్తితో పోలిస్తే అత్యధిక అప్పుల్లో కూరుకుపోయిన దేశం చైనా! ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు భారత్‌కు కొత్త అవకాశాలుగా అక్కరకొస్తాయా అన్నదే ఇప్పుడు చర్చ. కొవిడ్‌ అనంతర నూతన ప్రపంచ ఆర్థిక నిర్మాణంలో చైనా పాత్ర చెప్పుకోదగినదిగా ఉండకపోవచ్చునన్న వాదనలు ఇటీవల ఊపందుకుంటున్నాయి. చైనా నెత్తిన ఉరుముతున్న అప్పులు, కరోనా విషయంలో ఆ దేశ అనుమానాస్పద వైఖరిపట్ల ప్రపంచ దేశాల అసహనం కారణంగా భవిష్యత్తులో ‘బీజింగ్‌’ పాత్ర కుంచించుకుపోవచ్చు అన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటికే అనేక దేశాలు చైనానుంచి తమ కంపెనీలను ఉపసంహరించుకుంటున్నాయి. చైనాలోని కంపెనీలు తక్షణం ఆ దేశాన్ని వదిలి వెళితే ప్రత్యేక రాయితీలు అందజేస్తామని జపాన్‌ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. తమ దేశానికి చెందిన కీలక కంపెనీలను చైనానుంచి ఇండియాకో మరో చోటికే తరలించాలని అమెరికా అధ్యక్షుడు పట్టుదలగా ఉన్నారు. కరోనా వైరస్‌ వ్యవహారంలో చైనా తమకు 20 లక్షల కోట్ల డాలర్లమేర నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అమెరికా కేసు వేసింది. అమెరికా ట్రెజరీ బాండ్లలో చైనా పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టింది. కరోనా నష్టపరిహారంలో భాగంగా ఆ పెట్టుబడులన్నింటినీ అమెరికా స్తంభింపజేసే అవకాశాలు కొట్టిపారేయలేనివి. మరోవంక మౌలిక సౌకర్యాల విస్తరణ కోసం 70 దేశాలను కలుపుతూ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పేరిట ఏడేళ్ల క్రితం చైనా ప్రారంభించిన కార్యక్రమం ఇప్పట్లో ఫలితాలను ఇచ్చే అవకాశాలే లేవు. చైనానుంచి గతంలో పెద్దయెత్తున అప్పులు తీసుకున్న దేశాలు కొవిడ్‌ అనంతరం ఆర్థికంగా మరింత బలహీనపడి, ఆ రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లోకి జారుకోవచ్చు.

అందివచ్చిన అవకాశం

చైనా బలహీనతలను భారత్‌ బలంగా మార్చుకోవాలి. కరోనా కాలంలో ప్రపంచ దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరాతోపాటు, ‘సార్క్‌’ దేశాలకు 50 లక్షల డాలర్ల నిధులు సమకూర్చడం వంటివి అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠను పెంచాయి. ఉత్పత్తి రంగంలో భారత్‌ తనను తాను ఆవిష్కరించుకోవడానికి, ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి కొత్త ఊపిరులూదడానికి ఇదే తగిన తరుణం. నిర్దిష్ట ప్రణాళికలతో ప్రపంచ శ్రేణి కంపెనీలను దేశంలోకి ఆహ్వానించాలి. ఉత్పత్తి రంగంలో భారత్‌ బలహీనతలనూ ఈ సంక్షోభం బయటపెట్టింది. బల్క్‌ డ్రగ్‌ తయారీకి అవసరమైన ముడి వనరుల్లో 60 శాతం ఇప్పటికీ చైనానుంచే దిగుమతి చేసుకోవడం భారత్‌ బలహీనతకు చిహ్నం. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్త వ్యూహంతో; కీలక రంగాలకు అవసరమైన రాయితీలు ప్రకటించడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలి. కనీవినీ ఎరుగని స్థాయికి పడిపోయిన ముడి చమురు ధరలు భారత్‌కు అందివచ్చిన వరంగా మారాయి! దీనితో రష్యా, అమెరికా, ‘ఒపెక్‌’ వంటి చమురు ఉత్పత్తి దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. మరోవంక చమురుకోసం అంగలార్చే భారత్‌, చైనాల ఆర్థిక వ్యవస్థలకూ కొత్త ఊపునిచ్చే పరిణామమిది. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు కనిష్ఠానికి చేరడంతో- భారత్‌ చమురు బిల్లు అనూహ్యంగా తగ్గిపోయింది. వందల కోట్ల డాలర్ల డబ్బు దేశానికి ఆదా అవుతోంది. ఈ ధనాన్ని ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేయబోతోందన్నది 130 కోట్ల భారతీయుల తలరాతను నిర్దేశించనుంది!

- డాక్టర్‌ రాధా రఘురామపాత్రుని (రచయిత్రి- అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.