ETV Bharat / opinion

ఆకుపచ్చని భవిత కోసం.. సుస్థిర అటవీ విధానాలే శరణ్యం - harithahaam news

అడవుల నరికివేత పర్యావరణానికి పెనుశాపంలా మారింది. స్వార్థం కోసం కొందరు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్న చందంగా వ్యవహరిస్తుండటం వల్ల భవిష్యత్‌ తరాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో 15 శాతం అడవుల నరికివేతవల్లే జరుగుతున్నాయి. అడవిని నరికి కలప సేకరించి రాజభవనం కట్టుకోవాలన్న రాజుకు వ్యతిరేకంగా పోరాడి సఫలీకృతులైన బిష్ణోయ్‌ తెగకు చెందిన రాజస్థాన్‌లోని అమృతాదేవి చేసిన హరితోద్యమం ఈ సందర్భంగా అందరికీ ఆదర్శం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

greener-future
ఆకుపచ్చని భవిత కోసం
author img

By

Published : Sep 3, 2020, 9:51 AM IST

పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేవి హరితవనాలే. అడవుల వల్ల స్వచ్ఛమైన గాలి, కాలానుగుణ వర్షాలు, నేల క్రమక్షయం తగ్గుదల, ఇంధన వనరులు, కలప లభ్యమవుతున్నాయి. అటవీ చట్టాలను ఉల్లంఘిస్తూ అడవుల నరికివేత పర్యావరణానికి పెనుశాపంలా మారింది. ప్రపంచీకరణ, సరళీకరణల్లో భాగంగా అభివృద్ధి సాకుతో కొందరు స్వార్థపరుల విలాస జీవితం కోసం ప్రకృతి వనరుల విధ్వంసం పెరిగింది. తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్న చందంగా వ్యవహరిస్తున్నవారి పంథా మారకపోతే భవిష్యత్‌ తరాల మనుగడ ప్రశ్నార్థకమే. అందుకే పర్యావరణ సంరక్షణ చట్టాలకు అనుగుణంగా చెట్ల పెంపకం, అడవుల విస్తరణ అనేది నేడు మానవాళికి విజ్ఞతతో కూడిన ప్రాధాన్య అంశంగా మారింది.

స్వార్థ ప్రయోజనాల కోసం దుండగులు అడవులు నరకడం వల్ల ప్రతి ఏటా భూమిపై మూడు కోట్ల అరవై లక్షల ఎకరాల మేర అడవులు తరిగిపోతున్నాయి. దీనివల్ల వన్యప్రాణుల ఆవాసాలకు ముప్పు నెలకొనడం, నేలకోత పెరగడం వంటి సమస్యలతోపాటు, గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలతో భూతాపం జోరెత్తుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో 15 శాతం అడవుల నరికివేతవల్లే చోటుచేసుకుంటున్నాయి. అడవిని నరికి కలప సేకరించి రాజభవనం కట్టుకోవాలన్న రాజుకు వ్యతిరేకంగా పోరాడి సఫలీకృతులైన బిష్ణోయ్‌ తెగకు చెందిన రాజస్థాన్‌లోని అమృతాదేవి హరితోద్యమం మనకు ఆదర్శం కావాలి. ‘లేడీ టార్జాన్‌ ఆఫ్‌ ఝార్ఖండ్‌’గా పేరొందిన పర్యావరణ ఉద్యమకర్త జమున తుడు పోరాడిన తీరుకు మెచ్చిన ప్రభుత్వం 2019 లో పద్మశ్రీ ప్రకటించింది. మనవద్దా చెంచులు, గోండులువంటి ఆదివాసులు అటవీ సంపదను కాపాడుకుంటున్న తీరు ప్రశంసనీయం.

లక్షా 85 వేల ఎకరాల్లో పచ్చదనం

తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణ కోసం 2015 నుంచి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో అటవీ విస్తరణ 33 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ఆరు విడతలుగా సాగిన హరితోద్యమం సత్ఫలితాలనిస్తోంది. గత ఆరేళ్లలో జనావాసాలలో, అడవుల్లో సుమారు 200 కోట్ల మొక్కలను నాటారు. ఫలితాలు సానుకూలంగా ఉండటంతో అందరిలోనూ పర్యావరణ స్పృహ మరింత పెరిగింది. చాలామంది మేము సైతం అంటూ మొక్కలు నాటేందుకు ముందుకొస్తున్నారు. తన జీవితాన్ని మొక్కలకే అంకితం చేసిన వనజీవి రామయ్య జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. ఎంతోమంది వన ప్రేమికులు ‘గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌’ లాంటి వినూత్న కార్యక్రమాలకు పూనుకోవడం సంతోషకరం. కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్న తరుణంలో ముఖ్యంగా ఔషధ మొక్కలను నాటుకోవడం అలవాటుగా మారాలి. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పచ్చదనం, పరిశుభ్రతపై శ్రద్ధ పెడుతున్నాయి. పచ్చదనం పెంపు, అడవుల రక్షణ, అర్బన్‌ ఫారెస్ట్‌ ఉద్యానాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ దేశవ్యాప్త కార్యక్రమాలకు ఆదర్శంగా నిలిచింది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2015-19 మధ్య లక్షా 85 వేల ఎకరాల్లో పచ్చదనం పెరిగింది. 18 శాతం ఉన్న అటవీ విస్తీర్ణం 24 శాతం పెరిగింది. క్షీణించిన అడవుల పునరుద్ధరణలో మెరుగైన ప్రగతి సాధించింది. హైదరాబాదులో అర్బన్‌ ఫారెస్ట్‌ పేరుతో తక్కువ విస్తీర్ణంలో అటవీ జాతుల మొక్కలతో చిట్టడవులను పెంచుతున్నారు. కరోనా ప్రభావంతో హరితహారంలో ప్రజల భాగస్వామ్యం తగ్గడంతో డ్రోన్ల సాయంతో విత్తన బంతులను (సీడ్‌ బాల్స్‌) చల్లుతున్నారు.

33 శాతానికి పెంచాలని..

జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం 23 శాతం మాత్రమే ఉన్న అడవుల్ని 33 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘జగమంతా వనం... ఆరోగ్యంతో మనం’ అన్న నినాదంతో 71వ వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటాలని, అప్పుడే ‘ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్‌’ సాధ్యమవుతుందని ప్రభుత్వం పిలుపునిచ్చింది. రూ.340 కోట్ల వ్యయంతో అటవీ సంరక్షణ కార్యకలాపాలు, ప్లాంటేషన్‌పై ప్రణాళికలు సిద్ధం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు మానవ మనుగడకు పెనుసవాళ్లు విసరుతున్న తరుణంలో అప్రమత్తంగా మెలగుతూ ఆచరణాత్మకంగా భూతాపాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వాడటం వల్ల కరోనా వంటి ఉపద్రవాలు ఏర్పడిన సందర్భంలోనైనా పరిమితి పాటించటం అలవాటు కావాలి. భవిష్యత్‌ తరాలకు అటవీ వనరులు అందజేయాలంటే సుస్థిర అటవీ విధానాలు అవసరం. నాటిన మొక్కల సంరక్షణలో చిత్తశుద్ధి ప్రదర్శించాలి. పర్యావరణ కార్యక్రమాలను దేశంలోని అన్ని రాష్ట్రాలూ అనుసరిస్తే మన దేశం సుభిక్ష హరిత దేశంగా విలసిల్లగలుగుతుంది.

- గుమ్మడి లక్ష్మీనారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.