రాజులేని రాజ్యం.. దళపతి లేని సైన్యం.. చుక్కాని లేని నావ.. ఎలా ఉంటాయి? వెంటనే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తే కారణం పరిస్థితులే తప్ప వేరే కాదని విజ్ఞులు వివేకంతో గమనించాలి. రాజులేని రాజ్యం లేదా శక్తి సన్నగిల్లిన చక్రవర్తి పాలన అస్తవ్యస్తంగా ఉంటుంది. సరైన శాసనాలు ఉండవు. అమలు అసలే ఉండదు. దళపతి లేని సైన్యం వ్యూహం లేని యుద్ధంతో ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. అలిగి అస్త్రసన్యాసం చేసి ఆ సైన్యాన్ని అయోమయంలో పడేసే దళపతితో మరీ ప్రమాదం. చుక్కాని లేని నావ గాలి ఎటు వీస్తే అటు పోతూ ఉంటుంది. ఏ తీరానికి ఎలా చేరుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఎప్పటికైనా అధికారమనే ఒడ్డుకు చేరుతుందో మధ్యలో మునుగుతుందో అర్థం కాదు కాబట్టి- భయంతో, భవిష్యత్తు జ్ఞానంతోనో కొందరు పక్క పడవల్లోకి దూకేస్తుంటారు. ఎన్నిసార్లు ఓడిపోయినా, ఏం జరిగినా సడలని, కదలని పాషాణ స్థితప్రజ్ఞతో పార్టీ నాయకత్వం నడుస్తూ ఉంటుంది. ఆత్మపరిశీలన గురించి అసలు ఆలోచించదు.
స్పష్టత కరవు
పాత తరమే పార్టీ పదవులు పట్టుకు వేలాడుతుంది. తొందరపాటు యువ నాయకత్వం తిరుగుబాట్లతో తిప్పలు పెడుతుంది. వంద సంవత్సరాల వయసు దాటిన పార్టీ స్పష్టమైన వైఖరి లేమితో విలవిలలాడటం విడ్డూరమే. అప్పుడెప్పుడో ఓటమికి బాధ్యత వహిస్తూ నాయకత్వం నుంచి వైదొలగిన యువరాజు నెల వ్యవధిలో నేతను ఎన్నుకోవాలని చేసిన సూచన కార్యరూపం దాల్చకపోవడం సామాన్య కార్యకర్తలకు ఇప్పటికీ అంతుపట్టని విషయం. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న అధ్యక్షురాలికి తాత్కాలికమే అంటూ తగిలించిన బాధ్యతల భారం ఇప్పట్లో తగ్గేట్లు లేదు. అంత పెద్ద పార్టీలో ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడం అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది. వందిమాగధులను వదిలించుకోనంత కాలం ఇదే పరిస్థితి కొనసాగడం ఖాయం. పార్టీ ప్రయోజనాలు పట్టకుండా ప్రతిదానికీ తానతందానాలు పలికే భజనపరులను కట్టడి చేయకపోతే మార్పు మేడిపండుగానే మిగిలిపోతుంది.
ట్విట్టర్లో వీరంగం..
అధికారంలో ఉన్నా లేకపోయినా అంతర్గత కుమ్ములాటలతో అంటకాగడం శతాధిక వత్సరాల వయసుగల పార్టీకి వారసత్వంగా వస్తున్నట్లు ఉంది. ప్రత్యర్థులు సహా ప్రాంతీయ పార్టీల్లో రెండోతరం నాయకత్వం బాధ్యతలు చేపడుతున్నప్పటికీ కాంగ్రెస్‌లో అలాంటి కదలికలు మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారం ఇప్పట్లో అందుతుందనే ఆశలు సన్నగిల్లుతుండటంతో సభ్యుల పక్కచూపులు పెరుగుతున్నాయి. ప్రయోజనాల ప్రాతిపదికన ప్రశ్నించేవారే తప్ప పార్టీ బలోపేతానికి కట్టుబడే వారే కరవవుతున్నారు. ప్రత్యర్థులపై దాడికి ఆయుధాలు ఎన్నో ఉన్నా పోరాడేవారు లేరు.
నిలదీసేవారేరి..?
కరోనా మహమ్మారి విలయం, దేశ ఆర్థిక వ్యవస్థ పతనం, డ్రాగన్ దురాక్రమణలు, పేదరికం, నిరుద్యోగం, పీఎం కేర్స్, సోషల్ మీడియా వివాదాలు, రైతుల ఉద్యమం ఇలా ఎన్నో సమస్యలపై అధికార పార్టీని బలంగా నిలదీయడానికి ఎవరూ నడుం బిగించడం లేదు. వాటిపై జరిగే వర్కింగ్ కమిటీ సమావేశాలను మొక్కుబడి తీర్మానాలతో ముగిస్తున్నారు. ట్విటర్‌లో మాత్రం వీరంగం వేస్తున్నారు. ఆన్‌లైన్ అభిప్రాయ సేకరణలతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజల్లోకి దూసుకెళ్లే నిర్మాణాత్మక క్షేత్రస్థాయి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఇందులో అధిష్ఠానం తప్పు కూడా ఉంది. పతనావస్థపై సహనం నశించి ప్రశ్నించిన సీనియర్లను ఉపేక్షించే ఔదార్యాన్ని పార్టీ ప్రదర్శించడం లేదు. నిలదీసిన వారిపై కక్షగట్టి సామర్థ్యం, సంప్రదాయాలతో సంబంధం లేకుండా వీర విధేయులకే సభా నాయకత్వ వీరతాళ్లు వేసే సంస్కృతిని కొనసాగిస్తోంది.
యువశక్తిని జోడిస్తేనే..
వరసగా ఎదురవుతున్న పరాజయాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ను ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓడిపోయిన ప్రతిసారీ ఒక్కో నివేదిక తెప్పించుకొని పద్ధతిగా పేర్చి పెట్టుకుంటే ఫలితమేముంటుంది? ఒక్కసారైనా పట్టుపట్టి పరిశీలించి ప్రక్షాళన చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించి ఉండేదా? ఆత్మపరిశీలనకు ఆస్కారం కనిపించడం లేదు. వర్కింగ్ కమిటీ కార్యాచరణ ఏమిటో ఎవరికీ అర్థంకాదు. ఇటీవల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలిచే అవకాశం ఉన్నా చేతులారా చేజార్చుకోవడం చేతిగుర్తు పార్టీకే సాధ్యమయ్యే విషయమని చెప్పకనే ఎవరికైనా తెలిసిపోతుంది. అధికారంలో ఉన్నా పుదుచ్చేరిని కాపాడుకోలేకపోయారు. ఆనవాయితీగా అధికారం చేతులు మారాల్సిన కేరళలో నిరుత్సాహమే మిగిలింది.
ప్రతిచోటా పరాభవమే..
అసోంలో బలమైన రాజకీయ కూటమి కట్టలేని అసమర్థత అధికారాన్ని దూరం చేసింది. పశ్చిమ్ బంగలో ప్రతిపక్ష స్థానమూ పోయింది. తమిళనాడులో ప్రాంతీయ పార్టీకి తోకగా తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఇక వచ్చే ఏడాది జరగబోయే ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా ఎలాంటి పరిణామాలను పార్టీ ఎదుర్కొంటుందో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి. ఇవే పరిస్థితులు మళ్లీ తలెత్తితే 2024లో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ముక్త భారత్ ప్రత్యర్థుల ప్రమేయం లేకుండానే సంక్రమిస్తుంది. అనుభవసారాన్ని, యువశక్తిని జోడించి ముందుకు సాగితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. పూర్వవైభవాన్ని అందుకోవడానికి సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు ఇప్పటికికీ ఇంకా అవకాశాలు సజీవంగానే ఉన్నాయి.
-ఎమ్మెస్