కరోనా సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకుల బాల్యంపై దుష్ప్రభావం చూపుతోంది. దానివల్ల కొన్ని నెలలుగా పిల్లల ప్రవర్తనలో తీవ్రమైన మార్పులొస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. బిడ్డల భవిష్యత్తుపై ఆందోళన చెందడంకంటే- తల్లిదండ్రులే గురువులుగా మారి వారిలో శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆటపాటలు అటకెక్కడం, సరదాలు లేకపోవడం, తాతయ్య-తాతమ్మల కబుర్లు మాయంకావడం, స్నేహితులు, ఉపాధ్యాయులు, బంధువుల బంధాలు పలచబడటం.. చిన్నారుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.
స్మార్ట్‌ఫోన్లే కాలక్షేపంగా..
పాఠశాలలో సహజంగా అలవడాల్సిన శారీరక, మానసిక వికాసం కుంటువడుతున్నాయి. ఆడిపాడాల్సిన వయసులో చిన్నారులు ఇంటికే పరిమితం కావడంతో జీవనశైలిలో ఒక్కసారిగా స్తబ్ధత చోటుచేసుకుంది. తిండి, నిద్రవేళల్లో మునుపెన్నడూ లేని మార్పులొచ్చాయి. స్నేహితులు దూరం కావడంతో- స్మార్ట్‌ఫోన్లే కాలక్షేపంగా మారాయి. బద్దకం పెరిగింది. ఇలాంటి సున్నితమైన సమస్యలను ఎవరితో పంచుకోవాలో తెలియక, పరిష్కారం కనిపించక తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు.
అండగా నిలిస్తే ఆత్మవిశ్వాసం
కొవిడ్ నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతినిమిషం నలుగురికన్నా ఎక్కువమంది పిల్లల ప్రాణాలకు హాని పొంచి ఉందని యునిసెఫ్ పరిశోధన తేల్చి చెప్పింది. అయిదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతిరోజూ ఆరువేల మంది మరణం అంచులదాకా వెళ్ళే ప్రమాదం ఉందనీ హెచ్చరించింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడిన నేపథ్యంలో ఇంట్లో పిల్లలతో పెద్దలు వ్యవహరించాల్సిన తీరుపై కేంద్ర పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. వాటి ప్రకారం పిల్లలకు సరళమైన, స్థిరమైన రోజువారీ షెడ్యూల్‌ను ఖరారు చేసి, ఏ సమయంలో చదువుకోవాలో నిర్ణయించుకొనే అవకాశాన్ని వారికే వదిలిపెట్టడం మంచి ఫలితాన్నిస్తుంది. వారికి ఇంట్లో సౌకర్యమైన ప్రత్యేక స్థలం కేటాయించాలి.
ఇంట్లోనే వ్యాయామం..
ఆన్‌లైన్ తరగతులు పూర్తయ్యాక వారి ఉపాధ్యాయులు, నచ్చిన పాఠ్యాంశాలు, అభిరుచులు, స్నేహితుల గురించి అడుగుతూ వారిలో ఉత్సాహం రేకెత్తించాలి. స్నేహితులు, బంధువులతో వీడియోకాల్స్ మాట్లాడించాలి. ఊబకాయం వంటి సమస్యలు తలెత్తకుండా ఇంట్లోనే వ్యాయామం, నృత్యం, యోగాసనాలను సాధన చేయించవచ్చు. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలున్న ఆహారం, పండ్లు, ఇంట్లో వండిన పదార్థాలు- వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోజూ నిర్ణీత సమయంలో నిద్ర, ఆహారం, చదువు, ఆటపాటలు, టీవీ చూడటాన్ని అలవాటుగా మార్చాలి. తల్లిదండ్రులు చిన్నారులకోసం సమయం కేటాయించినప్పుడే వారిలో భరోసా, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
యుక్త వయసుకు చేరుతున్న పిల్లలకు స్వేచ్ఛనిస్తూనే వారి కదలికలపై ఓ కన్నేయాలి. మంచి చెడుల విచక్షణ, లాభనష్టాలు వివరించాలి. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు వాడే సమయంలో కొన్నిసార్లు అవాంఛిత చిత్రాలు, వీడియోలు కూడా చూసే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడం వల్ల తలెత్తే సమస్యలివి. 'మాకు రాదు.. తెలియదు' అనే మాటలు పక్కనపెట్టి సాంకేతిక అంశాలపై తల్లిదండ్రులూ పట్టు పెంచుకోవాలి. సానుకూలమైన భాష పిల్లల విషయంలో బాగా పనిచేస్తుంది. చేసే పనులను మెచ్చుకుంటే మరింత బాగా ప్రవర్తిస్తారు. చిన్నారుల ప్రవర్తనలో వచ్చే మార్పులను తొలినాళ్లలోనే గుర్తించడానికి ప్రయత్నించాలి. దానికి కారణాలేమిటో గమనించి, ఆ విషయం వారితోనే చర్చించాలి. అవసరమైతే కౌన్సెలింగ్ ఇప్పించాలి.
సమగ్ర ప్రణాళిక అవసరం
తల్లిదండ్రులను కలవరపెడుతున్న మరో అంశం- కరోనా మూడోదశ వ్యాప్తి. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంవల్ల వారిలో బ్యాక్టీరియా, వైరస్ ఎక్కువకాలం నిలిచి ఉండవు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలున్న మెలటోనిన్ హార్మోన్ పిల్లల్లో అధిక స్థాయిలో ఉంటుంది. అయిదేళ్ల వరకు పోలియో చుక్కలు వేయడంవల్ల కావలసినన్ని ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) పెంపొందుతాయి. ఈ కారణాల వల్ల వారికి వైరస్ సోకే ప్రమాదం తక్కువేనని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
పిల్లలకూ అవే..
పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, పిల్లలకూ వాటినే పాటిస్తే మూడోదశ వచ్చినా, రాకున్నా పిల్లలు క్షేమంగా ఉంటారు. ప్రభుత్వాలు, ముందువరస కొవిడ్ యోధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలకోసం ప్రత్యేకంగా పడకలు, వైద్య సదుపాయాలు సిద్ధంచేయాలి. నిపుణుల సలహాలతో సమగ్ర ప్రణాళికను వెంటనే తయారు చేయాలి. చివరి నిమిషం వరకు ఆగకుండా పిల్లల చికిత్సకు అవసరమైన ఔషధాలు సిద్ధంగా ఉంచాలి. వెంటనే స్పందించే కాల్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రతి ఒక్కరు సమష్టిగా సహకరిస్తే మహమ్మారి వైరస్ ఎవరినీ ఏమీ చేయలేదు. కరోనా ప్రభావం పిల్లలపై లేకుండా, వారు విద్యకు దూరం కాకుండా, కుటుంబాల ఆదాయానికి సమస్య రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం పిల్లల హక్కులను కాలరాసే సంక్షోభానికి కారణమవుతుంది.
- డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
(వ్యక్తిత్వ వికాస నిపుణులు)