ETV Bharat / opinion

కరోనాతో సహజీవనం అంటే ఇదేనా! - corona virus health tips

కలలోనూ కరోనా కలవరం ఆగట్లేదు. ఎంత నిర్లక్ష్యం వహిస్తే అంత ప్రమాదం తప్పదు. కరోనాతో సహజీవనం తప్పదని శాస్త్రవేత్తలు, నేతలు చెబుతున్నారు. అంటే జాగ్రత్తలు పాటించనవసరం లేదని కాదు. కరోనా సోకకుండా మన జీవన విధానాలు మార్చుకోవాలని దాని అర్థం.

CORONA PANDEMIC
కరోనాతో సహజీవనం
author img

By

Published : May 14, 2020, 7:51 AM IST

'ఆ... ఏంటి కరోనా జన్యువుల్లో ఊసరవెల్లి జన్యువులు వచ్చాయా ఏంటి? ఇలా రంగు మారింది. టీవీలో మొన్నటి వరకు ఆకుపచ్చరంగులోనే కదా కనిపించింది! దీని జిమ్మడ! ఇదేం విచిత్రం! ఈ రోజు ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎరుపు రంగులోకి మారిపోయింది. నా కళ్లకు కళ్లద్దాలూ ఉన్నాయి. టీవీ బాగానే పనిచేస్తోంది. మరి ఎందుకిలా...!'

'హ్హి...హ్హి...హ్హి...' నవ్వుతున్న ఓ గుండ్రటి ముళ్లబంతిలాంటి ఆకారం తాను పట్టుకున్న సెల్‌ఫోన్‌లోంచి ఠీవీగా బయటకు వచ్చింది. తీరా చూస్తే ఇంకేముంది అది కరోనా వైరస్‌! 'అయ్య బాబోయ్‌! దీని దుంపతెగ! ఇది చరవాణుల్లోంచి బయటకు వచ్చి మరీ వ్యాపిస్తోందా?!'

'హ్హి...హ్హి...హ్హి... భయపడకు మానవా... అబ్బే నాకు ఇంకా అంతటి శక్తియుక్తులు అబ్బలేదు. అయినా.. అలా వ్యాపించడానికి నేను 'వదంతి'నా ఏంటి?'

ఈ కరోనాకు మన నీళ్లు బాగా ఒంటబట్టినట్టున్నాయ్‌. పైగా మంచి రంగుతేలింది. మాటలూ కోటలు దాటుతున్నాయి. అయినా నేను భయపడుతున్నట్లు దీనికి తెలియకూడదు. ఏదో ఒకటి మాట్లాడుతూ దీన్ని బోల్తా కొట్టించాలి. లేకపోతే నాశాల్తీ గల్లంతే!

'ఓయ్‌ మానవా... ఏంటి అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌.'

'మరేం లేదు కరోనా... నువ్వు ఇంతకు ముందు ఆకుపచ్చరంగులో ఉండేదానివి కదా! మరేంటి ఈ మధ్య నీ బుగ్గలు ఉన్నట్లుండి కార్ల మీది ఎర్రబుగ్గల్లా ఎరుపెక్కాయి. నీ రంగూ మారింది. పైగా నువ్వేంటి అప్పట్నుంచి తలొంచుకుని నీ బొటనవేలుతో నేలపై అదే పనిగా అర్ధసున్నాలు చుడుతున్నావ్‌'

'ఓ అదా... ఇదంతా సిగ్గు వల్ల వచ్చిన ఎరుపు! నీతో సహజీవనం చేయాలి కదా! ఇకపై నువ్వూ నేనూ ఒక్కటే! తనువులు వేరైనా మనువులు జరగకున్నా... మనిద్దరం ఒక్కటే! ఎంతైనా కలిసిమెలిసి ఉండాలి కదా!'

ఓసి... దీని బండబడ. దీని సిగ్గు సిమడ! దీనికి ఇలా అర్థమైందా?! ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. దీంతో తాడోపేడో తేల్చుకోవాల్సిందే!

'కలిసి ఉండటం అంటే... కలగలసి పోవడం కాదు కరోనా! కలివిడిగా కాకుండా విడిగా ఉండటం అని అర్థం! నువ్వు నా పక్కనే ఉన్నా... నువ్వు నన్ను తాకలేకుండా నన్ను నేను కాపాడుకుంటూ ఉండటం. నువ్వు నా చుట్టూనే తచ్చాడుతున్నా... నన్ను చుట్టేసుకోకుండా చూసుకోవడం... అల్లంత దూరాన నువ్వు అలా...అలా... చక్కర్లు కొడుతున్నా నన్ను ముల్లులా గిల్లి అల్లుకుపోకుండా అప్రమత్తంగా ఉండటం... ఇంకా...'

'అంటే... నువ్వు నాతో కలిసి జీవించవా... మానవా?'

'నేను నీకు ఆరడుగుల దూరంలో ఉన్నంత వరకు ఊహూఁ నీ పప్పులేమీ నా దగ్గర ఉడకవు. నా మూతికి మాస్కు ఉన్నంత సేపు నీతో నాకు పెద్దగా రిస్కు ఉండదు! కరశుభ్రకర కారకం (హ్యాండ్‌ శానిటైజర్‌) నా దగ్గర ఉన్నంత కాలం నువ్వు నా చిటికెన వేలిని కూడా తాకలేవు. లక్ష్మణుడు... శూర్పణఖ ముక్కు కోసి చేతిలో పెట్టినట్లు నేనూ చేయగలను జాగ్రత్త! నువ్వు నాకు దూరంగా జరుగు... ముందు...'

'ఆగు మానవా... నా మీద ఎందుకంత కస్సుబుస్సులాడతావు. మరీ నువ్వు ఇలా త్రి'కరోనా'శుద్ధిగా ఉంటే... నేను బతికేది ఎట్టా చెప్పు?! అప్పటికీ పాపం బా'నిషా'లైన మందుబాబులు ప్రేతం లాంటి నాకు ఊతం ఇస్తున్నారు! అంత మందు... కడుపులో పడగానే వ్యాధినిరోధక శక్తి కాస్తా తుస్సుమంటుందని తెలిసినా..! తెగ తాగుతున్న త్యాగశీలురు వారు. ఈ విశాల ప్రపంచంలో నువ్వొక్కడివే ఉన్నావా ఏంటి? గంతకు తగ్గబొంతలా నా రక్తదాహాన్ని తీర్చేవారు ఎవరో ఒకరు నాకు దోరదోరగా దొరుకుతారులే!'

'దొరికితే వెళ్లు... ఇక్కడికెందుకొచ్చావ్‌! అక్కడికే వెళ్లు. అయినా నీకు ఆత్మాభిమానం... స్వాభిమానం ఎక్కువని, పిలిస్తే కానీ రావని విన్నాను. మరి నువ్వేంటి గొరిల్లాలా మారి... మాతో గెరిల్లాయుద్ధం చేస్తున్నావు.'

'ఏం చేయమంటావ్‌ మానవా... పిలిచేవాళ్లు... తలిచేవాళ్లు... వలిచేవాళ్లు తగ్గిపోతున్నారు. అందుకే ఆత్మాభిమానం చంపుకొని మరీ ఎవరు పిలిచినా పిలవకున్నా... నేనే వారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ వరించి వాటేసుకోవాలని చూస్తున్నా! నీకు మరో విషయం చెప్పాలి. కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ నేనొచ్చా... కల్యాణాలు ఆగిపోయాయి!'

'ఆ చేశావులే పే..ద్ద ఘనకార్యం. అయినా పిలవని పేరంటంలా వచ్చావ్‌. అసలు నీకు ఆత్మాభిమానం ఎక్కడుంది? నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారసలు. మాయలు నేర్చావ్‌. మమ్మల్ని ఏమార్చావ్‌.'

'హి...హి...హి... నా లక్ష్యం అదే కదా మరి. మీ ఒంటిని, ఇంటిని పీ(చీ)ల్చిపిప్పి చేయడమేగా నా పని! ఎన్ని రోజులు లాక్‌డౌన్‌ పాటిస్తారో నేనూ చూస్తా. తెరిస్తే... కరుస్తా...'

'కరుస్తే... చరుస్తా... దెబ్బకు చచ్చి ఊరుకుంటావ్‌. అయినా ఇంకా ఎన్ని రోజులు ఉంటావ్‌. గుప్తంగా స్తుప్తంగా నీకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే... నీ ఒంటి మీద మొలిచినవి నిజంగా కొమ్ములే అయితే... పో... వెళ్లిపో... పో... వెళ్లిపో... కరోనా... పో... పో కరోనా... పో...'

'ఏంటండీ... ఏంటా? అరుపులు. మరీ పట్టపగలు... మిట్ట మధ్యాహ్నం ఆ కలవరింతలేంటండి! పొద్దస్తమానమూ ఆ సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు చూడొద్దు... చదవొద్దు... అంటే విన్నారు కాదు!'

(రచయిత- ఎం.డి.దస్తగిర్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.