సెప్టెంబరులో భారత్‌లో గరిష్ఠంగా రోజుకు 98 వేల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య రోజుకు సగటున 25 వేలకు తగ్గింది. గడచిన ఎనిమిది నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యశాఖ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య రంగం ఉమ్మడి కృషితోనే ప్రస్తుత ఫలితాలు కళ్లకు కడుతున్నాయి. కేవలం ఈ మహమ్మారిని ఎదుర్కొనే విషయం చర్చించేందుకే ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కనీసం పది పర్యాయాలు సమావేశాలు నిర్వహించారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి రాష్ట్రాల వారీగా నిరంతర పర్యవేక్షణ జరిపారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. టీకా తయారు చేస్తున్న ఔషధ కంపెనీలను నేరుగా సందర్శించారు. ఈ చర్యలు... వ్యాధి నియంత్రణలోనే కాకుండా- వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, అధికారులు, వైద్య పరిశోధకుల్లో నైతిక స్థెర్యాన్ని ఇనుమడింపజేశాయి.
పార్టీలన్నీ ఒకే తాటిపై...
ప్రధానితోపాటు పలువురు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో రాజకీయాలను పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి అలుపెరగకుండా శ్రమించారు. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో 40కి పైగా రాజకీయ పార్టీలు దేశాన్ని నడిపిస్తున్నాయి. ఇందులో కేంద్రంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే), ఒడిశాలో బిజూ జనతాదళ్, దిల్లీలోని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్), పశ్చిమ్ బంగలో తృణమూల్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా, తెలంగాణలో తెరాస వంటి భారీ మెజారిటీలతో ప్రభుత్వాలను నడిపిస్తున్న ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. సీపీఐ(ఎం) పాలనలోని కేరళ, జేడీయూ ఆధ్వర్యంలో సంకీర్ణ పాలనలో ఉన్న బిహార్ వంటి రాష్ట్రాలూ ఉన్నాయి.
ఇవేకాకుండా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ వంటి పెద్ద రాష్ట్రాలను నడిపిస్తున్న జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్‌లనూ విస్మరించలేం. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రాల మధ్య ఇటీవలి కాలంలో తీవ్రస్థాయి రాజకీయ పోరాటం సాగుతూనే ఉంది. అయినప్పటికీ, అన్ని పార్టీలూ రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి మహమ్మారిపై ఉమ్మడిగా పోరాడాయి. ఈ పోరులో పెద్ద సంఖ్యలో ఉన్న ఇతర రాజకీయ పార్టీల ప్రాధాన్యాన్నీ విస్మరించలేం. పెద్ద సంఖ్యలో ఉన్న ఉపప్రాంతీయ పార్టీలు జిల్లాపరిషత్, పురపాలక కార్పొరేషన్ల స్థాయుల్లో అధికారంలో ఉన్నాయి. వీరంతా కొవిడ్‌పై సమరంలో ఏకతాటిపైకి వచ్చారు. ఇదంతా ప్రధాని మోదీ తరచూ ప్రస్తావించే సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. సాధారణ రోజుల్లో రాజకీయ క్షేత్రంలో సాగే హోరాహోరీ పోరాటానికి విరుద్ధంగా, కొవిడ్‌పై పోరులో శ్రమించిన వారందరికీ ఈ ఘనత దక్కుతుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి, కొవిడ్‌పై పోరాటంలో భాగంగా దిల్లీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచే అంశాలపై కృషి చేయడం రాజకీయాలను పక్కనపెట్టి చేసిన ఉమ్మడి కృషికి మంచి ఉదాహరణగా నిలుస్తుంది. ఆయనకు తోడుగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సైతం గత పది నెలలుగా అలుపెరగకుండా శ్రమించారు. నవంబర్‌లో నిర్వహించిన ఈ సమావేశాల ఫలితంగా దిల్లీలో అదనంగా ఐసీయూ పడకలు, ఉపకరణాలు సమకూరాయి. ఈ సమావేశం తరవాత దిల్లీ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్‌పై పోరాటంలో కేంద్రంతోపాటు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ విభాగాలు జట్టుగా పోరాడతాయని హామీ ఇచ్చారు. వీటితోపాటు మోదీ, దేశ వ్యాక్సినేషన్ వ్యూహ ప్రణాళికను సమీక్షించారు. పరిశోధనల ప్రస్తుత స్థితిగతులు, అందుబాటులోకి వచ్చిన తరవాత పంపిణీ ప్రక్రియను సమీక్షించారు. ఇందుకోసమూ అన్ని రాష్ట్రాలతోనూ సంప్రతింపులు జరిపారు.
సమర్థమైన టీకా కోసం నిరీక్షణ
గత పది నెలలకుపైగా కాలం మనకెన్నో పాఠాలు నేర్పింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించి, తదనంతరం పొడిగించాలనీ నిర్ణయించింది. లాక్‌డౌన్‌వల్ల కలిగే ప్రయోజనంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ తరవాత చాలామంది ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం జారీ చేసే మార్గదర్శకాలను అనుసరించే విషయంలో పశ్చిమ్ బంగ వంటి రాష్ట్రాలు సరిగ్గా సహకరించకపోవడంపై బోలెడు ఫిర్యాదులూ వచ్చాయి. లాక్‌డౌన్, భౌతిక దూరం, మాస్కులు ధరించడం, వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయడం, వినోద పరిశ్రమ, విద్యాసంస్థలను మూసివేయడం వంటి నిర్ణయాలను తీసుకున్నారు.
జాతీయ అత్యవసర పరిస్థితులు, విపత్తులు సంభవించినప్పుడు నిర్ణయాలు తీసుకొనేందుకు దఖలుపడిన అధికారాల నుంచే ఈ నిబంధనలను రూపొందించారు. ఉమ్మడిగా కార్యాచరణకు దిగకపోతే మునిగిపోతామన్న సంగతిని తరవాత అన్ని రాష్ట్రాలూ గ్రహించాయి. ఎందుకంటే వైరస్‌వ్యాప్తిలో భౌగోళిక సరిహద్దులేమీ ఉండవు. ప్రతికూల భావనలనే పట్టిపట్టి చూసేవారు ఇలాంటి అంశాలను అర్థం చేసుకోలేరు. తీవ్ర వైరుధ్యాలతో సాగే దేశం పేకమేడలా కూలిపోతుందనేది వారి భావన. మనదేశంలో జాతీయ, రాష్ట్రస్థాయుల్లోని రాజకీయ నాయకత్వాలకు చిల్లర రాజకీయాలకు అతీతంగా ఎదిగే సామర్థ్యంతోపాటు, మహమ్మారిపై సమైక్యంగా పోరాడి సవాలును విసిరే శక్తి ఉన్నట్లు ఎన్నో పరిణామాలు రుజువు చేశాయి.
విశ్వసనీయమైన, సమర్థమైన టీకా అందుబాటులోకి రావడం వల్ల నూతన సంవత్సరంలో మన దేశంలో కొవిడ్ కేసులు బాగా తగ్గిపోతాయనే విశ్వసిద్దాం. ఆ రోజు కొవిడ్‌పై పోరు సాగించిన రాజకీయ నాయకత్వ సమైక్యతను, మన వైద్యులు, నర్సులు, ఆరోగ్య రంగంలోని ప్రతి ఒక్కరినీ మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. ఎందుకంటే, ఇటీవలి కాలంలో దేశం ఎదుర్కొన్న అత్యంత ప్రాణాంతక ఆరోగ్య సంక్షోభాన్ని అధిగమించడంలో కీలక తోడ్పాటు అందించింది వీరే!
వైద్య సిబ్బంది చొరవ ప్రశంసనీయం
మన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ప్రత్యేకించి కొవిడ్ రోగులకు చికిత్స అందించడంలో తీవ్రస్థాయిలో శ్రమించిన ప్రభుత్వ రంగ వైద్య సిబ్బంది కృషినీ గుర్తించాల్సిన తరుణమిది. పలువురు వైద్యులు, నర్సులు తమ విధి నిర్వహణ సందర్భంగా కొవిడ్ బారిన పడ్డారు. అయినా, కోలుకోగానే ధైర్యంగా విధులు నిర్వర్తించారు. ఇతర ఆస్పత్రుల నుంచీ ఈ తరహా వార్తలు ఎన్నో వినిపించాయి. ఈ మొత్తం క్రతువులో అక్కడక్కడా కొన్ని అపశ్రుతులూ వెలుగు చూశాయి. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ రోగులకు కేవలం గదులు కేటయించినందుకే భారీగా డబ్బులు గుంజినట్లు, చికిత్సల పేరిట అధికంగా వసూలు చేసినట్లు తెలిసింది. మహమ్మారి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వచ్చిన తరవాత ఇలాంటి సంస్థలను గుర్తించి, దర్యాప్తు చేసి, శిక్షలు విధించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
రచయిత-ఎ. సూర్యప్రకాశ్, ప్రసార భారతి మాజీ ఛైర్మన్.
ఇదీ చదవండి:డబుల్ ధమాకా: పెళ్లి రోజే ప్రమాణ స్వీకారం