ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతోంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితి నుంచి బయటపడేందుకు మనం తీవ్రంగా యత్నిస్తున్నాం. దక్షిణాసియాలోని ఒక ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల మోత మోగుతూనే ఉంది. మార్చి నెలలో కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించిన ఘటనలు 411 దాకా చోటుచేసుకున్నట్లు అంచనా. ఇవి గత ఏడాది ఇదే సమయంలో జరిగిన ఘటనలకన్నా ఎక్కువ. 2018లో జరిగిన ఉదంతాలకు రెట్టింపు.
ఉల్లంఘనలు సర్వసాధారణం
ఏప్రిల్ అయిదోతేదీన అయిదుగురు ఉగ్రవాదులు కేరన్ సెక్టార్‌లో చొరబడేందుకు యత్నిస్తూ భారత జవాన్ల కాల్పుల్లో హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో అయిదుగురు సైనికులు సైతం వీరమరణం పొందారు. అయిదు రోజుల తరవాత పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లపై శతఘ్ని దాడులు చేపట్టినట్లు భారత సైన్యం ఒక వీడియోను విడుదల చేసింది. రెండు రోజుల దరమిలా పాక్ సైన్యం అదే సెక్టార్‌లో జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మరణించగా, ఏడుగురు క్షతగాత్రులయ్యారు. చనిపోయిన వారిలో ఎనిమిదేళ్ల చిన్నారి ఉండటం గమనార్హం. ఇలాంటి సమయాల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. భారత్, పాకిస్థాన్ రెండూ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, సరిహద్దుల్లో కొంతకాలంపాటైనా శాంతిని పాటించలేమా? ఇరుదేశాలు పరస్పర పోరాటం సాగించేకన్నా, మన శక్తిసామర్థ్యాల్ని ఉమ్మడి శత్రువుపైకి మరల్చలేమా? దురదృష్టవశాత్తు వాస్తవం ఏమిటంటే నైతిక కోణాలెప్పుడూ జాతీయ నిర్ణయాల్ని శాసించలేవు.
చొరబాట్లను నియంత్రించాలి..
నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల ఘటనలకు సంబంధించిన విషయాన్ని ఇరుపక్షాల సైనికుల తరఫు అధికార ప్రతినిధులూ చాలా మామూలుగా చెప్పేస్తుంటారు. ఇరు సైన్యాలు సాధారణంగా 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని 2012 దాకా పరస్పరం గౌరవించాయి. 2013 ప్రారంభంలో నియంత్రణ రేఖ వెంబడి భారత గస్తీ బృందంపై దాడి జరిగింది. మందుపాతరలు, మెరుగు పరిచిన పేలుడు పదార్థాలు అమర్చడం వంటి ఘటనలు పెరిగాయి. ఆగస్టులో పూంచ్ సెక్టార్‌లో అయిదుగురు సైనికులు పాక్ దళాల చేతిలో హతమయ్యారు. మొత్తంగా భద్రత పరిస్థితి క్షీణించడంతో ఉద్రిక్తతలు ఎక్కువ య్యాయి. సరిహద్దుల వెంబడి కాల్పుల తీవ్రత పెరిగింది. చాలా ఏళ్ల తరవాత మొదటిసారి ‘డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్’ ఇద్దరూ ముఖాముఖి సమావేశానికి అంగీకరించారు. పరిస్థితుల్ని చల్లార్చేందుకు ఒక ఒప్పందం కూడా కుదిరింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం కనిపించలేదు. 2014లో కాల్పుల విరమణ ఉల్లంఘనలు మరింతగా పెరిగాయి. ఏదైనా నిజమైన పురోగతి సాధించాలంటే, పాకిస్థాన్ తన వైపు నుంచి చొరబాట్లను నియంత్రించాలి. చొరబాట్లు కొనసాగితే, భారతీయ సైనికులు నియంత్రణ రేఖ వెంబడి అమరులవుతూనే ఉంటారు. శాంతిస్థాపన సాధ్యం కాదు. ఇందుకోసం పాకిస్థాన్‌లో కీలకంగా వ్యవహరించే సైన్యానికి కశ్మీర్‌పై ఆలోచనా ధోరణి మారాలి.
ఆర్టికల్ 370 రద్దుతో..
జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భారత్, పాకిస్థాన్, కశ్మీర్ పరిస్థితులను మార్చేయడంతోపాటు, ఈ సమీకరణాల నుంచి పాకిస్థాన్‌ను పక్కకు తప్పించాయి. 370 అధికరణ అనేది భారత రాజ్యాంగంలోని ఒక నిబంధనే తప్పించి, అది ద్వైపాక్షిక సమస్య కాదు. దీనిపై అంతర్జాతీయ వేదికలపై చేసిన ఫిర్యాదులకు వచ్చిన మద్దతు నామమాత్రమే. ప్రపంచంలో ఎక్కువ భాగం ఇప్పటికే భారత వైఖరిని అంగీకరించింది. కశ్మీర్ అంశంలో ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు లేవనెత్తవచ్చు. కానీ, అది మన సొంత వ్యవహారం. పాకిస్థాన్‌కు ఎలాంటి పాత్రా లేదు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలు, అస్తిత్వం క్షీణిస్తుందేమోననే భయం, ఆర్థికాభివృద్ధి, యువత ఆకాంక్షల్ని నెరవేర్చడం వంటి సమస్యలు భారత ప్రభుత్వం మాత్రమే నెరవేర్చాల్సిన కార్యాలు. కార్గిల్ ఘర్షణ తరవాత పాకిస్థాన్‌లో కొంత ఆత్మపరిశీలన జరిగింది.
సానూకూలంగా..
సరిహద్దుల్లో భారత సైన్యం దూకుడు మనస్తత్వంతో ఉంది. చొరబాట్లను నిరోధించడం ప్రాథమిక కర్తవ్యం. నియంత్రణ రేఖ వద్ద వేడెక్కిన పరిస్థితులకు సంబంధించి బంతి పాకిస్థాన్ కోర్టులోనే ఉంది. చర్చలకు తావులేదనే తన విధానంపై భారత్ పునరాలోచించుకోవాలి. ఒకవేళ పాకిస్థాన్ వైపు నుంచి ఏవైనా హృదయపూర్వక ప్రకటనలు వస్తే సానుకూల ప్రతిస్పందన కనబరచాలి. కొవిడ్‌కు వ్యతిరేకంగా సార్క్ చర్చల విషయంలో చూపిన రాజనీతిజ్ఞతను ప్రధాని మోదీ ఇప్పుడూ చూపించాల్సిన అవసరం ఉంది. జమ్మూకశ్మీర్ ప్రజల విషయంలో ఇరుదేశాలు సానుభూతి కనబరుస్తున్నాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న కాల్పులతో సరిహద్దులకు రెండువైపులా ఉన్న ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారు. మానవ సంక్షోభం తలెత్తిన ప్రస్తుత పరిస్థితులకు ఇరుపక్షాలు ఎలాంటి సమస్యల్నీ జతచేయకపోవడం మంచిది. పరస్పర విశ్వాసం పాదుకొలిపే చర్యలు విజయవంతం కావాలంటే, ఇరుపక్షాల మధ్య ఎంతోకొంత నమ్మకాన్ని పెంపొందించే చర్యలు ప్రారంభం కావాలి. అలాంటి వారధిని నిర్మించేందుకు పాత భావనలను వదిలేయాల్సి ఉంటుంది.
- రచయిత: డి.ఎస్.హూడా, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్
ఇదీ చూడండి: ఔరా.. ఈ పెద్దాయన బైబిల్నే అచ్చుదింపేశారు!