ETV Bharat / opinion

పండుగ కాలంలో స్వీయ జాగ్రత్తలే రక్షా కవచాలు - కరోనా అప్​డేట్స్

పండుగల వేళ ప్రజానీకం అప్రమత్తం కాకపోతే ముప్పు మరింత ముమ్మరిస్తుందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల్నీ తాజాగా హెచ్చరించడం అకారణం కాదు. పర్వదినం అంటేనే సర్వులూ సరదాగా కలుసుకొని కబుర్లు కలబోసుకుని ఆనందంగా గడిపే మధుర ఘట్టం. దురదృష్టవశాత్తు, కరోనా మహాసంక్షోభం దాపురించాక సమూహ సంబరాలైన భారతీయ పండుగల పరమార్థం అనర్థహేతువుగా మారింది.

Self-protective measures
పండుగ కాలంలో స్వీయ జాగ్రత్తలే రక్షా కవచాలు
author img

By

Published : Oct 6, 2020, 8:50 AM IST

కనిపించని శత్రువుతో మానవాళి జీవన్మరణ సుదీర్ఘ పోరాటం కొనసాగిస్తోంది. విశ్వవ్యాప్తంగా మూడున్నర కోట్లకు పైబడిన కేసులు, పదిన్నర లక్షలకు చేరువవుతున్న మరణాలు- కొవిడ్‌ సంక్షోభ విస్తృతిని చాటుతున్నాయి. దేశంలోనే 66 లక్షలకు మించిన కేసులు, లక్ష మార్కు దాటేసిన మరణాలు- భీతావహ వాతావరణాన్ని కళ్లకు కడుతున్నాయి. పండుగల వేళ ప్రజానీకం అప్రమత్తం కాకపోతే ముప్పు మరింత ముమ్మరిస్తుందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల్నీ తాజాగా హెచ్చరించడం అకారణం కాదు. పర్వదినం అంటేనే సర్వులూ సరదాగా కలుసుకొని కబుర్లు కలబోసుకుని ఆనందంగా గడిపే మధుర ఘట్టం. దురదృష్టవశాత్తు, కరోనా మహాసంక్షోభం దాపురించాక సమూహ సంబరాలైన భారతీయ పండుగల పరమార్థం అనర్థహేతువుగా మారింది.

'ఓనం' సందర్భంగా దూరతీరాలనుంచి స్వస్థలానికి చేరిన కేరళ వాసులకు ఆ అంశం పరగడుపున పడిపోవడంతో వాటిల్లిన దుష్పరిణామాలు ఇప్పుడు అందర్నీ బెంబేలెత్తిస్తున్నాయి. కొవిడ్‌ కట్టడి చర్యల్ని విస్మరించి కనీస జాగ్రత్తల్నీ గాలికొదిలేసిన కారణంగా మలప్పురం, ఇడుక్కి, కొల్లాం, పత్తణంతిట్ట తదితర ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు ఒక్కుదుటున పెరిగిపోయాయి. అజాగ్రత్తే ఇంతటి విపత్తు తెచ్చిపెట్టిందని వాపోయిన ముఖ్యమంత్రి పినరై విజయన్‌ కేరళవ్యాప్తంగా సెక్షన్‌ 144 విధించడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తుంది. దుర్గాపూజ సందర్భంగా పశ్చిమ్‌ బంగలోనూ అదే తరహాలో కొవిడ్‌ ప్రకోపించే ప్రమాదం ఉందని అక్కడి వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈసారి దేవీ నవరాత్రులప్పుడు గర్బా నృత్యాలను, దాండియా కోలాటాలను అనుమతించేది లేదంటూ మహారాష్ట్ర ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. యూపీ, దిల్లీ, తెలంగాణ ప్రభృత రాష్ట్రాలూ అత్యవసరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారిస్తున్నాయి. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల వేళ తమవంతుగా కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్ని స్వచ్ఛందంగా పాటించాల్సిన కీలక బాధ్యతను ప్రజానీకం ఏ దశలోనూ ఉపేక్షించే వీల్లేదు!

గట్టిగా తుమ్మితే దగ్గితే వచ్చే పెద్ద తుంపర్లతోనే కరోనా వైరస్‌ ఇతరులకు సోకుతుందని తొలుత చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ- మాట్లాడినప్పుడు వెలువడే సూక్ష్మ తుంపర్లూ వ్యాధి వాహకాలేనని ధ్రువీకరించింది. అలా దగ్గు, తుమ్ముల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించే లక్ష్యంతోనే దేశంలో లాక్‌డౌన్లు మొదలయ్యాయి. అంచెలవారీగా లాక్‌డౌన్లు ఉపసంహరిస్తూ ప్రభుత్వాలెన్ని జాగ్రత్తలు చెబుతున్నా- జనసామాన్యంలో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన ఆందోళనకర స్థాయిలో నమోదవుతోంది. విధిగా మాస్కులు ధరించకపోయినా, బహిరంగంగా ఉమ్మినా, భౌతిక దూరం పాటించకపోయినా జరిమానా, జైలుశిక్ష తప్పవని తరతమ భేదాలతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కొరడా ఝళిపించినా- నిర్లక్ష్య ధోరణులు ప్రస్ఫుటమవుతూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసుల ప్రజ్వలనం, చలికాలంలో పొంచి ఉన్న అంటురోగాల పెనుముప్పు నేపథ్యంలో- పండుగలప్పుడు జనసామాన్యం జాగ్రత్తల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే... మహమ్మారి కట్టడిలో ఎంతటి ప్రభుత్వాలైనా చతికిలపడక తప్పదు. దేశీయంగా ప్రజారోగ్య వ్యవస్థకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శక్తి సామర్థ్యాలకు ఉన్న పరిమితుల్ని గుర్తెరిగి పౌర సమాజం ఆచితూచి మెలగాల్సిన సంక్లిష్ట పరీక్షా ఘట్టమిది. 'ఓనం' చేదు అనుభవాలనుంచి గుణపాఠాలు స్వీకరించి- ముఖానికి మాస్కు, చేతుల పరిశుభ్రత తదితర నిబంధనలు పాటిస్తూ దుకాణాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో, గృహ ప్రాంగణాల్లో గుమిగూడకుండా జనసామాన్యం మరికొన్నాళ్లు సంయమనం పాటించాలి. ఇది పౌరులందరి ఉమ్మడి సామాజిక బాధ్యత. వ్యాక్సిన్‌ రూపేణా రక్షాకవచం అందుబాటులోకి వచ్చేవరకు, స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.