ETV Bharat / opinion

'రష్యా భల్లూకం పట్టులో ఉక్రెయిన్​.. ఇండియాకు ఇబ్బందికరమే!' - సోవియెట్​ యూనియన్​

Russia- Ukraine War: అగ్రరాజ్యాల దృష్టిలో చిన్న దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్య్రాలు అనేవి కేవలం మిథ్య! అణ్వస్త్ర దేశాలు ఐక్యరాజ్యసమితి నిబంధనలను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం పరిపాటి అయిపోయింది. తన పెరట్లో సోవియట్‌ అణు క్షిపణులను సహించలేకపోయిన అమెరికాకు, ఇప్పుడు రష్యా పెరడు వంటి ఉక్రెయిన్‌ నాటో ఒడిలో చేరతానంటే పుతిన్‌ చూస్తూ ఊరుకోరని తెలియదా? అయితే, ఉక్రెయిన్‌పై దాని దండయాత్రను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేం. ప్రాబల్య విస్తరణకే ఈ యుద్ధోన్మాదం.

Russia ukraine war
ప్రాబల్య విస్తరణకే యుద్ధోన్మాదం
author img

By

Published : Mar 2, 2022, 7:46 AM IST

Russia- Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో 1962 నాటి క్యూబా క్షిపణి సంక్షోభాన్ని గుర్తుచేసుకోవాలి. అప్పట్లో క్యూబాలో సోవియట్‌ యూనియన్‌ (యూఎస్‌ఎస్‌ఆర్‌) అణు క్షిపణులను మోహరించింది. వాటిని తొలగించకపోతే అణ్వస్త్ర యుద్ధం తప్పదని నాటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌.కెనడీ రష్యన్లను హెచ్చరించారు. ఆ తరువాత కొద్ది రోజులకే సోవియట్‌ అధ్యక్షుడు నికితా కృశ్చెవ్‌ వెనకడుగు వేశారు. అది లొంగుబాటు తప్ప మరేమీ కాదని నాటి క్యూబా అధినేత ఫిడెల్‌ కాస్ట్రో రుసరుసలాడారు. క్యూబాకు, అమెరికా తీరానికి మధ్య దూరం కేవలం 90 మైళ్లే. అక్కడ సోవియట్‌ అణు క్షిపణులను మోహరిస్తే అమెరికా తూర్పు భాగం అంతటికీ ముప్పు పొంచి ఉంటుందని కెనడీ వాదించారు. ప్రచ్ఛన్న యుద్ధం జోరుగా సాగుతున్న ఆ రోజుల్లో ఆయన తెగువను ప్రపంచమంతా మెచ్చుకుంది. తమ ప్రాబల్య ప్రాంతం అమెరికా వెలుపలి వరకు విస్తరించిందని కెనడీ చెప్పుకోవడంతో క్యూబా సార్వభౌమత్వం ఊసే లేకుండా పోయింది. అమెరికా సంరక్షణకు ఆయన చేయాల్సిందంతా చేస్తున్నారని నాడు పలు దేశాలు ప్రశంసించాయి. ప్రస్తుతం అవే దేశాలు తన ప్రాబల్య సంరక్షణకు రష్యా తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. ఆనాడు అమెరికా చేరువలోకి సోవియట్‌ చొచ్చుకురావడాన్ని కెనడీ నిరసించినట్లే- అమెరికా, నాటోలు నేడు రష్యా ముంగిట్లోకి వచ్చి ఘర్షణ రాజకీయాలు చేస్తున్నాయని పుతిన్‌ మండిపడుతున్నారు. అలా అని రష్యాను వెనకేసుకుని వస్తున్నట్లు కాదు. ఉక్రెయిన్‌పై దాని దండయాత్రను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేం.

జాతీయవాదమే ఆయుధంగా..

కృశ్చెవ్‌ క్యూబా సాహసానికి ఒడిగట్టకముందు హంగేరీలోకి టాంకులు పంపారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం తపించిన అక్కడి ప్రధాని స్థానంలో తమ కీలుబొమ్మను ప్రతిష్ఠించాకే సోవియట్‌ సేనలు వెనుదిరిగాయి. చెకొస్లొవేకియా స్వేచ్ఛా పిపాసను అణచివేయడానికీ సోవియట్‌ సైనిక జోక్యం చేసుకుంది. ఆ తరవాతా 2008లో జార్జియాపై పుతిన్‌ దాడి చేశారు. నాటో వైపు మొగ్గు చూపడమే ఆ దేశం చేసిన నేరమైంది. ఏతావతా అగ్రరాజ్యాల దృష్టిలో చిన్న దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్య్రాలు అనేవి కేవలం మిథ్య! అణ్వస్త్ర దేశాలు ఐక్యరాజ్యసమితి నిబంధనలను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం పరిపాటి అయిపోయింది. తన పెరట్లో సోవియట్‌ అణు క్షిపణులను సహించలేకపోయిన అమెరికాకు, ఇప్పుడు రష్యా పెరడు వంటి ఉక్రెయిన్‌ నాటో ఒడిలో చేరతానంటే పుతిన్‌ చూస్తూ ఊరుకోరని తెలియదా? కమ్యూనిస్టు యూఎస్‌ఎస్‌ఆర్‌ బారి నుంచి పశ్చిమ ఐరోపా దేశాల సంరక్షణకు 1949లో అమెరికా నేతృత్వంలో ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) ఏర్పడింది. దాని సభ్యదేశాల్లో ఏ ఒక్కదానిపై ఇతర రాజ్యాలు దాడిచేసినా- మిగిలినవన్నీ కలిసి ఎదుర్కోవాలనే మౌలిక సూత్రం ఆధారంగా అది రూపుదిద్దుకొంది. నాటోకు పోటీగా సోవియట్‌ యూనియన్‌ తూర్పు ఐరోపా దేశాలతో వార్సా సైనిక కూటమిని ఏర్పరచింది. 1991లో యూఎస్‌ఎస్‌ఆర్‌ విచ్ఛిన్నమై 15 స్వతంత్ర దేశాలుగా విడిపోయాక వార్సా కూటమి చెల్లాచెదురైంది. దాని సభ్య దేశాల్లో అమెరికా, నాటోలు క్రమంగా తమ ప్రాబల్యాన్ని విస్తరించసాగాయి. ఆ ప్రయత్నాలనే పుతిన్‌ ప్రస్తుతం గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సోవియట్‌ గూఢచారి సంస్థ కేజీబీలో ఏజెంటుగా పనిచేసిన పుతిన్‌ పూర్వ సోవియట్‌ రిపబ్లిక్‌లను మళ్ళీ రష్యన్‌ సమాఖ్యలో కలపాలని ఆశిస్తున్నారు. అమెరికాలో అంతర్గత రాజకీయ విభేదాలు తీవ్రమైన స్థితిలో తన వ్యూహాన్ని అమలు చేయడం ఆరంభించారు.

పూర్వ వార్సా కూటమి దేశాలైన పోలాండ్‌, రొమేనియా, హంగేరీ, చెక్‌ రిపబ్లిక్‌, స్లొవేకియా, బల్గేరియాలు నేడు నాటో కూటమిలో చేరిపోయాయి. ఉక్రెయిన్‌ సైతం అందులో చేరడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇదంతా రష్యా ప్రాబల్యాన్ని దెబ్బతీసే పన్నాగమని పుతిన్‌ కన్నెర్రచేస్తున్నారు. మరోవైపు, స్వదేశంలో ఆయన నిరంకుశుడిగా ప్రవర్తిస్తున్న మాట నిజం. ఉక్రెయిన్‌ ప్రజాస్వామ్య అనురక్తిని కాలరాస్తున్నారన్నదీ వాస్తవమే. రష్యా ప్రజాతంత్రంతో పోలిస్తే ఉక్రెయిన్‌ జనస్వామ్యం ఎన్నో రెట్లు మిన్న. పద్నాలుగు కోట్లకు పైబడిన రష్యన్ల కన్నా నాలుగు కోట్ల పైచిలుకు ఉక్రెయిన్‌ ప్రజలే మెరుగైన జీవితాలు గడుపుతున్నారు. రష్యాలో పుతిన్‌ మిత్రులైన కోటీశ్వరులు అపార ధనరాశులు పోగేసుకున్నారు. విదేశాల్లో విలాసవంతమైన ఆస్తులతో వారు దర్జాగా జీవిస్తుంటే, సగటు రష్యన్‌ స్థితిగతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రష్యాను రెండు దశాబ్దాల నుంచి పాలిస్తున్నా సామాన్యుల జీవితాలను పుతిన్‌ సుసంపన్నం చేయలేకపోయారు. జాతీయవాదమంటూ ఊదరగొట్టడం తప్ప వారి జీవన ప్రమాణాలను ఆయన మెరుగు పరచలేదు. క్రిమియాను ఆక్రమించి, జార్జియాను లొంగదీసి, బెలారస్‌ను కీలుబొమ్మగా మార్చి, ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్‌పై దండెత్తడం- పుతిన్‌ జాతీయవాద అజెండాలో భాగమే.

కొడిగడుతున్న అమెరికా ప్రభ

చివరి క్షణంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం తప్ప అమెరికా, నాటోలు ఆ దేశాన్ని రష్యా బారి నుంచి కాపాడలేకపోయాయి. ఉక్రెయిన్‌ ప్రజలు, అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అపార సానుభూతి మాత్రం కురిపిస్తున్నాయి. రష్యా కుబేరులు, బ్యాంకులపై అమెరికా, ఈయూలు ఆర్థిక ఆంక్షలు విధించినా- పుతిన్‌ ఖాతరు చేయడం లేదు. తాను అనుకున్నది సాధించుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేస్తూనే శాంతి చర్చల మంత్రం పఠిస్తున్న పుతిన్‌- తాను చెప్పినట్లు ఆడే వ్యక్తికి ఆ దేశాధికారం కట్టబెట్టి కానీ వెనుదిరగరు. ఆ తరవాత ఉక్రెయిన్‌, బెలారస్‌లతోపాటు పలు పూర్వ సోవియట్‌ రిపబ్లిక్‌ల దేశీయ, విదేశాంగ విధానాలను తానే శాసించబోతున్నారు. ఇటీవలే అఫ్గానిస్థాన్‌ నుంచి హఠాత్తుగా సేనలను విరమించి అభాసుపాలైన అమెరికా, నాటోలకు పుతిన్‌ మూలంగా మళ్ళీ శృంగభంగమయ్యేలా ఉంది. ఒకవైపు రష్యా, మరోవైపు చైనా కమ్ముకొస్తున్న దృష్ట్యా ప్రపంచంలో అమెరికా పలుకుబడి క్షీణదశకు చేరుకొంటున్నట్లు కనిపిస్తోంది.

ఇండియాకు ఇబ్బందికరమే

తనకు ఇష్టమున్నా లేకున్నా అమెరికా, రష్యాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అగత్యం ఇండియాకు తోసుకొస్తోంది. ఆ ఇబ్బందికర పరిస్థితిలో ఉక్రెయిన్‌పై భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌లకు భారత్‌ గైర్హాజరైంది. రష్యన్‌ ఆయుధ దిగుమతులపై భారత్‌ నేటికీ ఆధారపడుతోంది. దాంతో పుతిన్‌ను దూరం చేసుకోవడానికి న్యూదిల్లీ సిద్ధంగా లేదు. క్వాడ్‌ పేరిట అమెరికాతో జతకట్టినా మాస్కోతో మైత్రి కొనసాగించాలనుకొంటోంది. రష్యా చైనాకు దగ్గరవడం, పాకిస్థాన్‌ అమెరికా పంచ వదలి బీజింగ్‌ నీడన చేరడం అమెరికాకు దౌత్యపరంగా విఘాతాలే. ఉక్రెయిన్‌లోకి రష్యన్‌ యుద్ధ టాంకులు దూసుకెళ్తున్న సమయంలోనే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, పుతిన్‌తో భేటీ వేయడం- పాక్‌ దివాలాకోరుతనానికి పరాకాష్ఠ!

- వీరేంద్ర కపూర్​ (రచయిత- సామాజిక, రాజకీయ రంగ విశ్లేషకులు)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.