ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా అంతర్జాతీయ ధరవరలకు అనుగుణంగా రోజువారీ మార్పులు జరగాల్సిన పెట్రో రేట్లకూ- దేశవాళీ రాజకీయం ఒంటపట్టింది. అయిదు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినన్నాళ్లూ కిమ్మిన్నాస్తిగా ఉండి, ఫలితాలు వెలువడ్డాక రోజు విడిచి రోజు పెట్రో రేట్లకు రెక్కలు తొడగడం- జనం జేబులకు మంట పెట్టింది. ఈ నెలలో ఇప్పటికే పదిసార్లు పెట్రోలు, డీజిల్ ధరల సవరణ దరిమిలా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లోని పలు నగరాల్లో లీటర్ పెట్రోలు వంద రూపాయలు దాటిపోయింది. హైదరాబాద్‌లో ప్రీమియం పెట్రోలు ధర వంద మార్కు దాటి మిర్రి మిర్రి చూస్తోంది. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ముడి చమురు ధర 69 డాలర్లకు చేరడంతో నష్ట నివారణకు చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రో రేట్లు పెంచక తప్పదన్నది ఎప్పుడూ చెప్పే వివరణే!
జీఎస్టీ పరిధిలోకి తెస్తే..
2014లో ఎన్‌డీఏ సర్కారు కొలువు తీరినప్పుడు ముడి చమురు ధర 110 డాలర్లున్నా, దేశీయంగా లీటరు పెట్రోలు రూ.71, డీజిలు రూ.57కు లభ్యమైనప్పుడు ఇప్పుడేమిటీ వైపరీత్యమన్న సామాన్యుడి సందేహమూ సహేతుకమే! దిగుమతులపై ఆధారపడే దుస్థితిని గత ప్రభుత్వాలు తప్పించకపోవడమే ప్రస్తుత దురవస్థకు కారణమన్న ప్రధాని వ్యాఖ్యలు కేవలం అర్ధసత్యం. కొవిడ్ రాకముందు లీటరు పెట్రోలుపై రూ.19.98గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని దరిమిలా రూ.32.98కి; అదే డీజిల్‌పై రూ.15.83గా ఉన్న మొత్తాన్ని రూ.31.83కు కేంద్రం పెంచేస్తే, 'వ్యాట్' పేరిట తమ వంతు బాదుడుకు రాష్ట్రాలూ ఉపక్రమించాయి. సామాన్య జనజీవనాన్ని గుల్లబారుస్తూ విక్రమిస్తున్న పెట్రో రేట్లలో మూడింట రెండొంతులు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దండుకొంటున్న పన్నులూ సుంకాల చలవే. ఈ కీలక ఇంధన వనరుల్ని జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే పెట్రోలు రూ.75, డీజిల్ రూ.68కి దిగివస్తాయన్న ఆర్థిక వేత్తల సూచన అవశ్యం శిరోధార్యమే!
అయిదు రెట్లు పెరిగిన రాబడి..
కేంద్రంలో ఎన్‌డీఏ ఏడేళ్ల జమానాలో దేశ బడ్జెట్ పరిమాణం రెట్టింపు అయితే, పెట్రో ఉత్పాదనలపై రాబడి మాత్రం అయిదు రెట్లు పెరిగింది. 2014-15లో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ వసూళ్లు రూ.74,158 కోట్లు కాగా, 2020-21 తొలి పది నెలల్లోనే అవి రూ.2.95 లక్షల కోట్లకు చేరాయని కేంద్రమే పార్లమెంటుకు నివేదించింది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమైనప్పుడూ తొమ్మిదిసార్లు సుంకాలు పెంచడం ద్వారా రాబడికి లోటు లేకుండా చూసుకొన్న కేంద్రం- వేరే ఏ దేశంలోనూ లేనంత పన్నుపోటుతో దేశ జనావళిని పిండేస్తోంది. రాష్ట్రాలు సైతం త్యాగాలకు సిద్ధపడనిదే తాము చొరవ చూపే ఆస్కారమే లేదని నర్మగర్భంగా మొన్న మార్చిలో సెలవిచ్చిన కేంద్ర విత్తమంత్రి- పెట్రో ధరలపై తాము ధర్మ సంకటాన్ని ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. పెట్రో పన్నుల రూపేణా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా దండుకొంటున్నది అయిదు లక్షల కోట్ల రూపాయల పైమాటే.
అప్పుడే దేశ ప్రజలకు విముక్తి..
పెట్రో ఉత్పాదనల్ని జీఎస్‌టీ పరిధిలోకి ఇప్పటికిప్పుడు తీసుకొచ్చే ప్రతిపాదనేదీ లేదంటున్న కేంద్రం- రాష్ట్రాలు కోరితే చర్చించి నిర్ణయం తీసుకొంటామనడం నయవంచకపు నవ్యచాలనే! ఏడు నెలల విరామం తరవాత వచ్చే వారం జీఎస్‌టీ మండలి సమావేశం జరగనుంది. మలివిడత కొవిడ్ మహోగ్రంగా విరుచుకుపడిన తరుణంలో- ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆరోగ్య సేవలపై పన్నుల మినహాయింపు అంశం చర్చకు రానుంది. ఉపాధి కోల్పోయి, ద్రవ్యోల్బణం కట్లు తెంచుకొని, వైద్య ఖర్చులు తడిసిమోపెడై తల్లడిల్లుతున్న జనావళిపట్ల ప్రజా ప్రభుత్వాలు స్వీయ బాధ్యత గుర్తించి ప్రవర్తించాల్సిన తరుణమిది. డీజిలు, పెట్రోలును జీఎస్‌టీ పరిధిలోకి తెస్తేనే నిరంతర పెట్రో ఘాతాలనుంచి దేశ ప్రజలకు విముక్తి!
ఇదీ చదవండి: ఈనెల 26న ట్రేడ్ యూనియన్ల నిరసన