సహకార బ్యాంకుల్లో ముమ్మరిస్తున్న స్వాహాకారాన్ని తుదముట్టించేలా పాలన సంస్కరణలకు రిజర్వ్ బ్యాంకు చొరవ చూపాలంటూ ఆర్ గాంధీ కమిటీ కొన్నేళ్ల క్రితమే సూచించినా సత్వర చర్యల విషయంలో కేంద్రం మల్లగుల్లాలు పడింది. ఏడు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది లక్షలమంది ఖాతాదారులు, రూ.11,614 కోట్ల డిపాజిట్లుగల పంజాబ్ మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ)లో నిరుడు వెలుగు చూసిన కుంభకోణం యావద్దేశాన్నీ దిగ్భ్రాంతపరచింది. సహకార బ్యాంకింగ్ రంగంపై జన విశ్వాసం సడలిపోకుండా కాచుకునేందుకంటూ రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ (సవరణ) బిల్లును ఇటీవల పార్లమెంటులో నెగ్గించింది. దేశవ్యాప్తంగా 1482 పట్టణ, మరో 58 బహుళ రాష్ట్ర సహకార బ్యాంకుల డిపాజిటర్ల సంఖ్య 8.6 కోట్లు! సహకార బ్యాంకుల్లో మదుపు చేసిన మొత్తం దాదాపు అయిదు లక్షల కోట్ల రూపాయలు! 277 పట్టణ సహకార బ్యాంకుల ఆర్థిక స్థితి బలహీనంగా ఉందని, నిబంధనల మేరకు కనీస పెట్టుబడి లక్ష్యాన్ని 105 బ్యాంకులు చేరలేకపోతున్నాయని, 328 బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 15శాతానికి మించి పోగుపడ్డాయని విత్తమంత్రి చెబుతున్నారు. సహకార బ్యాంకుల వ్యవహారాల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంచి, మూలధనానికి కొత్త గవాక్షాలు తెరిచి, నిర్వహణ మెరుగుపరచి డిపాజిటర్ల ప్రయోజనాల్ని కాచుకొంటామన్న ప్రభుత్వం- వాటిపై రిజర్వ్ బ్యాంకు పర్యవేక్షణకు బాటలుపరచింది. సహకార స్వయం ప్రతిపత్తిని, ఒక సభ్యుడికి ఒక ఓటు అన్న సమాన ఓటింగ్ హక్కుల్ని కేంద్రం మన్నించడంతో సంతృప్తి చెందామని మహారాష్ట్ర సమాఖ్య వంటివి ప్రకటిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు పర్యవేక్షణతోనే బండి గాడిన పడుతుందన్న ఆశాభావమే గురికి బారెడు దూరంగా ఉంది!
పెను కుంభకోణంతో పీఎంసీ బ్యాంకు చితికిపోయి రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలోకి వచ్చిన ఏడాది తరవాత- డిపాజిటర్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందమైంది. ఆర్‌బీఐ ఉద్యోగుల సహకార సంఘం సొమ్ములే దాదాపు రూ.200 కోట్లు పీఎంసీలో చిక్కుకుపోగా- సహకార బ్యాంకును ఎలా ఒడ్డున పడేయాలో తెలియని అయోమయావస్థ రాజ్యమేలుతోంది. 1935లో ఆర్‌బీఐ ప్రాదుర్భవించగా 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికే వందల బ్యాంకులు చేతులెత్తేశాయి. 1947-’69 నడుమ 665, దరిమిలా 2019 దాకా 37 బ్యాంకులు విఫలమయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. పూర్తిస్థాయి పర్యవేక్షణ, క్రమబద్ధీకరణ అధికారాలున్నా బ్యాంకుల వైఫల్యాల్ని ఆర్‌బీఐ ఆపలేకపోతోందనకి ఎన్నో రుజువులు పోగుపడ్డాయి. సంక్షోభంలో చిక్కుకొన్న వాటిని ఆర్థిక సౌష్ఠవంగల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేసి చేతులు దులుపుకొంటున్న ఆర్‌బీఐ- జాతీయ బ్యాంకుల్లో ఏటికేడు మోసాలు పెచ్చరిల్లుతున్నా ఏం చేయగలుగుతోంది? 2018 మార్చి చివరినాటికి బ్యాంకింగ్ రంగ నిరర్థక ఆస్తులు రూ.9.61 లక్షల కోట్లకు చేరిన వైనాన్ని ప్రస్తావిస్తూ- 'ఈ సంక్షోభానికి ఆర్‌బీఐ జవాబుదారీ అవునా, కాదా?' అన్న నాటి 'కాగ్' రాజీవ్ మహర్షి ప్రశ్న సంచలనం సృష్టించింది. బ్యాంకింగ్ రంగంలో పెను మోసాలు కట్లు తెంచుకోవడాన్ని ప్రస్తావిస్తూ అంతకు రెండేళ్ల క్రితమే ఆర్‌బీఐనీ 'కాగ్' ఆడిట్ చేయాల్సి ఉందని ఆడిటర్ జనరల్‌గా శశికాంత్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా దురవస్థల పాలవుతున్న బ్యాంకుల్ని ఆదుకోవడానికి గత అయిదేళ్లలో కేంద్రం సమకూర్చింది అక్షరాలా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు! అసలు, జరిగిన దారుణ మోసాల్ని పసిగట్టడానికే బ్యాంకులకు అయిదేళ్లు పడుతున్న తీరు- ఆర్‌బీఐ 'వృత్తిపర నైపుణ్య పర్యవేక్షణా పటిమ'కు గీటురాయిగా నిలుస్తోంది. పదునైన సంస్కరణలు ఆర్‌బీఐనుంచే మొదలు కావాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది!