మొక్కవోని సంకల్ప దీక్షకు అవిరళ త్యాగాలు జతపడి తెలుగువాడి హక్కుగా విశాఖ ఉక్కుకు శంకుస్థాపన జరిగి అయిదు దశాబ్దాలైంది. అనేక అవరోధాల్ని అధిగమించి ఉత్పత్తి ప్రారంభించిన ఉక్కు కర్మాగారాన్ని 1992లో ప్రధానిగా పీవీ జాతికి అంకితం చేయగా- దాన్ని నేడు నూరుశాతం ప్రైవేటీకరించాలన్న నిర్ణయమే ఏమాత్రం మింగుడు పడనిది. 'నవరత్న' సంస్థగా రాజిల్లుతూ 2002-15 నడుమ లాభాల బాటలో నడిచి ఇప్పటిదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రూపాల్లో రూ.42 వేల కోట్లు సముపార్జించి పెట్టిన ఘనత విశాఖ ఉక్కుది.
రెండు మూడేళ్లుగా వస్తున్న నష్టాలకు కారణాలేమిటన్నది ముంజేతి కంకణమే అయినా, ఆ వంకన సాగించే ప్రైవేటీకరణ విశాల జాతి హితానికే శరాఘాతమవుతుంది. ఆనాడు 'ప్రజాప్రయోజనం' పేరిట భూసేకరణ చట్టం కింద వివిధ దశల్లో రైతులకు తృణమో పణమో చెల్లించి (చివరి దశలో గరిష్ఠ చెల్లింపు ఎకరా రూ.20 వేలు) సేకరించిన మొత్తం 22 వేల ఎకరా పైచిలుకు. నేడు ఏకరా రూ. 5 కోట్లు దాటిన నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం విలువ దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందంటున్నారు! ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికిపైగా ఉపాధి కల్పిస్తున్న మహా సంస్థ- మూడు తరాలు దాటినా తొలినాటి నిర్వాసితులకు ఇచ్చిన హామీల్ని నేటికీ పూర్తిగా నెరవేర్చనే లేదు! ఏ ఉక్కు పరిశ్రమ అయినా స్వయంసమృద్ధం కావాలంటే ఖనిజ క్షేత్రాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. ఖమ్మం జిల్లా బయ్యారం గనుల్ని విశాఖ కర్మాగారానికి ఇచ్చేందుకు సుముఖమంటూ 2013లోనే ఉక్కుశాఖ సంసిద్ధత వ్యక్తం చేసినా- ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.
టన్నుకు రూ.5200పైగా వెచ్చించి ఇనుప ఖనిజాన్ని మార్కెట్ ధరకు కొనడం వల్ల వస్తున్న నష్టాలకు కేంద్ర ప్రభుత్వమే జవాబుదారీ! రాయితీలతో ఖనిజ క్షేత్రాలను రాసివ్వకపోతే రేపు వచ్చే ఏ ప్రైవేటు సంస్థదైనా ఇదే నష్టజాతకం. 2017 నాటి జాతీయ ఉక్కు విధాన లక్ష్యాలు సాధించాలంటే, ప్రైవేటీకరణ కట్టిపెట్టి విశాఖ ఉక్కుకు వెన్నుదన్నుగా నిలవడమే శ్రేయస్కరం!
'అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుదలకు ఊతమిచ్చేలా, అంతర్జాతీయ నాణ్యత, భద్రత ప్రమాణాలతో సమర్థంగా పర్యావరణ హితంగా 30 కోట్ల టన్నుల సరఫరా సామర్థ్యాన్ని ఉక్కు పరిశ్రమ సంతరించుకోవాలి' అని నేషనల్ స్టీల్ పాలసీ నిర్దేశిస్తోంది. భారత్‌మాల, సాగర్‌మాల, జల్‌జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు ఉక్కు అవసరాన్ని ఏకరువు పెడుతూ కర్మాగారాలు కొత్త సత్తువ కూడగట్టుకోవాలనడంలో మరోమాట లేకపోయినా- అందుకు సరైన దారి ప్రైవేటీకరణా? నీతిఆయోగ్ సిఫార్సు మేరకే ప్రైవేటీకరణ అంటున్న కేంద్రం- అదే నీతిఆయోగ్ సభ్యుడిగా పద్మభూషణ్ సారస్వత్ ఇచ్చిన నివేదిక చదవలేదా? ఒక టన్ను ఉక్కు ఉత్పాదనకు ఇండియాలో వ్యయం 320-340 డాలర్లు ఉంటే- సుంకాలు, సెస్సులు, ప్రపంచంలోనే అత్యధికమైన రాయల్టీ, కళ్లుతిరిగే స్థాయి రవాణా వ్యయాలు, వడ్డీరేట్లు కలగలిసి ఒక్కో టన్ను తయారీ వ్యయాన్ని 420 డాలర్లకు పెంచేస్తున్నాయని వెల్లడించింది. సొంతంగా ఖనిజ క్షేత్రాలున్న పరిశ్రమల పరిస్థితే అలా ఉంటే విశాఖ ఉక్కు అక్షరాలా ఏటికి ఎదురీదుతోంది.
సర్కారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వ కర్మాగారాల నుంచే ఉక్కును సేకరించాలని 2017 మే నెలలో మోదీ ప్రభుత్వమే నిర్ణయించింది. అదే ఇప్పుడు నవరత్నను ప్రైవేటీకరించడం ఏమిటి? సొంతంగా ఇనుప ఖనిజ క్షేత్రాలున్న ఉక్కు పరిశ్రమలు కుమ్మక్కై దారుణంగా రేట్లు పెంచేస్తున్నాయన్న ఆరోపణపై కాంపిటీషన్ కమిషన్ నేడు దర్యాప్తు జరుపుతోంది. నమ్ముకోవాల్సిన కామధేనువును తెగనమ్ముకొంటే జాతి ప్రయోజనాలే తెగటారి పోతాయి. ప్రైవేటీకరించిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఏం ఉద్ధరించిందో తెలిశాక కూడా- ఉద్యమాలతో సాధించుకొన్న కొంగుబంగారాన్ని కోల్పోవడానికి తెలుగువాడు సిద్ధంగా లేడు!
ఇదీ చూడండి: 'కాంగ్రెస్ వల్ల సొంత పార్టీకే కాదు.. దేశానికే కీడు!'