ETV Bharat / opinion

క్రీడాసంఘాలకు రాజకీయ చీడ..వీడేదెలా? - భారత క్రీడా సమాఖ్యల ఎన్నికల్లో రాజకీయ నీడ

భారతదేశంలో క్రీడా సమాఖ్యలు రాజకీయ నీడల్లో మూలుగుతున్నాయి. పారదర్శకంగా జరగాల్సిన సమాఖ్య సభ్యుల ఎన్నికల్లో అయోగ్యులు చోటు దక్కించుకుంటున్నారు. ఫలితంగా సహజ మేలి క్రీడారత్నాలను వెలికితీయాల్సిన విధానమే సజావుగా సాగడం లేదు. చిన్న చితకా దేశాలు ఒలంపిక్స్​లో రాణిస్తుంటే దశాబ్దాలుగా భారత్‌ బిక్కమొగమేస్తోంది. నిబద్ధులకే పగ్గాలు దఖలుపరచి, పారదర్శకంగా పనిచేసేట్లు సమాఖ్యల్ని సాకల్యంగా ప్రక్షాళిస్తేనే- క్రీడలకు పట్టిన చిరకాల పీడ విరగడవుతుంది!

Political harm to indian sports  associations.
క్రీడాసంఘాలకు రాజకీయ చీడ..వీడేదెలా?
author img

By

Published : Jan 8, 2021, 8:29 AM IST

అడ్డగోలు రాజకీయాలతో అయోగ్యులకు అనుచిత లబ్ధి చేకూర్చే భ్రష్ట నిర్వాకాలకు నెలవులుగా దేశంలోని పలు క్రీడాసమాఖ్యలు, సంఘాలు ఏళ్లతరబడి అప్రతిష్ఠ మూటగట్టుకుంటున్నాయి. నిబంధనల్ని గాలికొదిలేస్తున్నాయంటూ నిరుడు జూన్‌లో 54 సంఘాల గుర్తింపు రద్దు చేసిన కేంద్రం, ఆపై వెనక్కి తగ్గింది. గత డిసెంబరు నెలాఖరులోగా 14 సంఘాలకు విధిగా ఎన్నికలు జరగాలని కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ నిర్దేశించిన దరిమిలా పరిస్థితి ఏమైనా కుదుటపడిందా? గడువు తీరిపోయినా- అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యకు ఎందుకని ఎన్నికలు నిర్వహించడం లేదన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే సూటిప్రశ్నకు సరైన సమాధానం రాలేదు. బాక్సింగ్‌ ఫెడరేషన్‌ డిసెంబరు మూడోవారంలో వార్షిక సర్వసభ్య సమావేశానికి ముహూర్తం నిర్ణయించీ, కొవిడ్‌ కారణంగానంటూ వాయిదావైపు మొగ్గింది. చెస్‌ సమాఖ్యలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న రెండు వర్గాల్లో ఒకటైన చౌహాన్‌ శిబిరం వైరిపక్ష అభ్యర్థి నామినేషన్‌నే సవాలు చేసింది. ఆన్‌లైన్‌ ఓటింగ్‌ భద్రతపైనా శంకలు లేవనెత్తింది. కడకు చదరంగం క్రీడకు పెద్దగా ఆదరణ లేని యూపీ, అరుణాచల్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిమ్‌లకు చెందినవారికి కీలక పదవులు దఖలు పడ్డాయి. ఒక రాష్ట్రంలో నివసిస్తూ ఇతర రాష్ట్రాల విభాగాల తరఫున పోటీకి ఆఖరి క్షణాల్లో దిగిన గోల్ఫ్‌ యూనియన్‌ సభ్యుల తీరు- ఎక్కడా ఏదీ సవ్యంగా లేదని, వీలైనన్ని గోల్‌మాల్‌ ఎత్తుగడలు యథేచ్ఛగా అమలు జరిగాయనేందుకు రుజువన్న విశ్లేషణలు వెలుగుచూస్తున్నాయి. క్రీడా సంఘాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఎంపికకు సంబంధించి తాజాగా నిబంధనల్ని మార్చడంపట్ల భారత ఒలింపిక్‌ సంఘం, జాతీయ క్రీడా సమాఖ్యలు గుర్రుగా ఉన్నాయి. నాలుగున్నర దశాబ్దాలక్రితం నెలకొన్న తనను కాదని ఎన్‌వైఎస్‌ఎఫ్‌ (జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య)కు కేంద్రం అధికారిక హోదా కట్టబెట్టడంపై వైఎఫ్‌ఐ(భారత యోగా సమాఖ్య) దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దేశంలో క్రీడా సముద్ధరణ కృషి నిలువునా నీరోడుతున్నదనడానికి సజీవ దృష్టాంతాలివి!

సురీనాం, బురుండీ లాంటి చిన్నాచితకా దేశాలూ ఒలింపిక్స్‌లో రాణిస్తుంటే- దశాబ్దాలుగా భారత్‌ బిక్కమొగమేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో మైదానాలకు, వ్యాయామ ఉపాధ్యాయులకు కొరత- క్రీడాసక్తి కలిగినవారినీ తీవ్రంగా నిరాశపరుస్తున్నదన్నది ఎవరూ తోసిపుచ్చలేని యథార్థం. తల్లిదండ్రుల ప్రోత్సాహం, వదాన్యుల తోడ్పాటుతో తమ ప్రతిభకు పదును పెట్టుకోదలచినవారికీ సరైన మార్గనిర్దేశకత్వం, అవసరమైన శిక్షణ ఏర్పాట్లు, మౌలిక వసతులు కొరవడుతుండటం దురదృష్టకరం. జూనియర్‌ స్థాయిలో భేషనిపించుకున్నవారు సైతం ముందుకు వెళ్ళే దారి కానరాక క్రీడాసంఘాలు, సమాఖ్యల సంకుచిత రాజకీయాల బారినపడి నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతున్న ఉదంతాలు ఎన్నో! పదేళ్ల వయసులోపే ప్రపంచ చెస్‌ స్వర్ణం కొల్లగొట్టిన నిహాల్‌ సరీన్‌, తాము ఎంచుకున్న క్రీడాంశానికే వన్నెతెస్తున్న సైనా, సింధు, సానియా ప్రభృత జాతిరత్నాలు- అద్భుత ప్రతిభకు ఇక్కడ కొదవ లేదని రుజువు చేస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో చురుకైన వ్యవహారశైలి, పారదర్శక విధివిధానాలతో ముడి కోహినూర్లను వెలికితీసే యజ్ఞమే సజావుగా సాగడంలేదు. చైనా, ఆస్ట్రేలియా, యూకేల నుంచి కెన్యా, జమైకాల వరకు దేశాలెన్నో సహజసిద్ధ ప్రతిభావ్యుత్పన్నతల్ని గుర్తించి వెలికితీసి సమధికంగా ప్రోత్సహించి ప్రతిష్ఠాత్మక క్రీడావేదికలపై సగర్వంగా వెలుగులీనుతున్నాయి. అందుకు విరుద్ధంగా ఇక్కడ లెక్కకు మిక్కిలి సంఘాలు, సమాఖ్యలున్నా ప్రణాళికాబద్ధ క్రీడావికాస సాధన లక్ష్యానికి అడుగడుగునా తూట్లు పడుతున్నాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత, పట్టుదల, పోరాట పటిమల్ని పెంపొందించే ఆటలకు విద్యాలయాలన్నింటా సకల సదుపాయాల పరికల్పన, మెరికల్ని ఎంపికచేసి దేశానికి ప్రాతినిధ్యం వహించేలా శిక్షణ అందించే బాధ్యతల్ని వివిధ క్రీడాసంఘాలు, సమాఖ్యలకే కట్టబెట్టాలి. విధ్యుక్తధర్మాన్ని సమర్థంగా నిర్వహించేలా నిబద్ధులకే పగ్గాలు దఖలుపరచి, పారదర్శకంగా పనిచేసేట్లు సమాఖ్యల్ని సాకల్యంగా ప్రక్షాళిస్తేనే- క్రీడలకు పట్టిన చిరకాల పీడ విరగడవుతుంది!

ఇదీ చదవండి:ఆసీస్​ బోర్డుకు బీసీసీఐ లేఖ.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.