చమురు సంస్థల రోజువారీ సమీక్షలో రెండు వారాలుగా పెట్రోలు డీజిల్ ధరలకు రెక్కలు మొలుస్తుండటం జనసామాన్యాన్ని దిమ్మెరపరుస్తోంది. ఇరవై నెలలక్రితం 2018 అక్టోబరులో పీపా ముడిచమురు 80 డాలర్ల రేటు పలికిన దశలో, లీటరు పెట్రోలు ధర సుమారు 80 రూపాయలైంది. అప్పట్లో లీటరు డీజిల్ రూ.75లోపు. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ముడి చమురు 40 డాలర్లకు చేరువలో ఉన్నా, దేశీయంగా పెట్రో ఉత్పత్తులు లీటరుకు రూ.80 స్థాయికి మించిపోవడం వినియోగదారుల్ని హతాశుల్ని చేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో తమకు వాటిల్లిన నష్టాలు పూడిపోయేదాకా ‘ధరల సవరణ’ కొనసాగుతుందన్న చమురు సంస్థల వివరణ విస్మయపరుస్తోంది! కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో గిరాకీ కుంగి, ముడిచమురు ఉత్పత్తి నియంత్రణపై రష్యా-సౌదీఅరేబియాల మధ్య సమశ్రుతి కుదరక, రెండు దశాబ్దాల కనిష్ఠానికి ధరలు పతనమయ్యాయి.
అంతర్జాతీయ విపణిలో ధరవరలు పడిపోయినప్పుడు దేశంలో పెట్రో రేట్ల సవరణ ఊసెత్తని చమురు సంస్థలు- 82 రోజుల విరామానంతరం జూన్ ఏడో తేదీనుంచి సమీక్ష ముసుగులో రోజుకింతని పెంచేస్తున్నాయి. తనవంతుగా ఇటీవల రెండంచెల్లో లీటరు పెట్రోలుపై రూ.13, డీజిలుపై రూ.16 వంతున అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం వడ్డించింది. కర్ణాటక, తమిళనాడు, దిల్లీ, ఝార్ఖండ్ ప్రభృత రాష్ట్రాలూ వ్యాట్‌పోటుకు సిద్ధపడేసరికి- చమురు ధరల కుంపట్లు రాజుకున్నాయి. కరోనా సంక్షోభం ముమ్మరించి వ్యాపారాలు సవ్యంగా సాగక, ఉపాధి అవకాశాలు కుంగి, శ్రామికులకు పనులు దొరక్క, వేతనజీవులకు ఆదాయాలు తగ్గి విలవిల్లాడుతున్న స్థితిలో ఈ పెట్రోమంటల ప్రజ్వలనానికి జనజీవనం దుర్భర దుఃఖభాజనమవుతోంది!
ఈ సంవత్సరం మొదట్లో 70 డాలర్లు పలికిన పీపా ముడిచమురు ధర మూడు నెలల్లోనే సగానికిపైగా తెగ్గోసుకుపోయింది. అంతటి కీలక పరిణామం తాలూకు ప్రయోజనాన్ని మచ్చుకైనా చవిచూడలేకపోయిన కోట్లాది సాధారణ వినియోగదారుల్ని నిశ్చేష్టపరచే లోగుట్టు మరొకటుంది. మొత్తం దక్షిణాసియాలో అత్యధికంగా చమురు ధరలు ఇండియాలోనే గూబలదరగొట్టడానికి, పన్నుల పేరిట ప్రభుత్వాల అడ్డగోలు దోపిడీయే ప్రధాన కారణం. దేశీయంగా పెట్రోలుపై 56శాతం, డీజిలుపై 36శాతం మేర పన్నులు దండుకుంటున్నారని లోగడ రంగరాజన్ కమిటీ లెక్కకట్టింది. పెట్రోలు, డీజిలు రిటైల్ ధరల్లో 52శాతందాకా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల చేతివాటమేనన్నది రెండేళ్లనాటి నిపుణుల విశ్లేషణ. ఒకానొక దశలో 140 డాలర్లకుపైగా ఎగబాకిన పీపా ముడిచమురు నాలుగోవంతు రేటుకు పడిపోయి, సుంకాల పోటు ఇంతలంతలైన కారణంగా- ఇప్పుడు దేశరాజధానిలో లీటరు పెట్రో ఉత్పత్తుల ధరల్లో పన్నువాటా 70శాతానికి మించిపోయింది.
గత అయిదేళ్లలో పెట్రోసుంకాల రూపేణా కేంద్ర రాష్ట్రప్రభుత్వాల రాబడి మొత్తం రూ.3.32లక్షల కోట్లనుంచి రూ.5.55లక్షల కోట్లకు విస్తరించింది. ఇటీవలి ధరల మోతతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వ ఖజానాకు రూ.1.7లక్షల కోట్లదాకా అదనపు ఆదాయం జమపడుతుందని అంచనా. ప్రభుత్వాలు ఇలా భారీ మొత్తాలు కూడగట్టుకుంటుండగా- అంతర్జాతీయ ధరవరలు పతనమైనప్పుడైనా ఆ ప్రయోజనాన్ని జనానికి బదిలీ కానివ్వని వ్యవస్థాగత ఏర్పాటు సామాన్యుడి నడ్డి విరుస్తోంది. కరోనా ప్రజ్వలనానికి చమురు ధరాఘాతాలు జతపడి జనజీవితాలు మరింత కుంగిపోకుండా కాచుకోవాల్సిన ప్రభుత్వాలు మిన్నకుంటున్నాయి. పెట్రో ఉత్పాదనల్నీ జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చి, అహేతుక పన్నుల బాదుడును అరికడితేనే- వినియోగదారులు ఎప్పటికైనా తెప్పరిల్లేది!