ఉదారులూ ఉత్తములైన ఉత్తరప్రదేశ్ పోలీసులకు సవినయ విజ్ఞప్తి..
అయ్యా! దేశంలో రోజుకు వందకు పైగా గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమవుతున్నాయట. పాపం వాటికి అంత్యక్రియలు చేసేవారే లేరు. మానవత మూర్తీభవించిన మీలాంటి మహాత్ములే ఈ బాధ్యతను స్వీకరించాలి. హాథ్రస్ హత్యాచార బాధితురాలి దేహాన్ని దగ్గరుండి దహనం చేయించడం ద్వారా మీరు ఎలాగూ అంత్యక్రియల నిర్వహణలో నైపుణ్యం సాధించారు. కావున ఈ బృహత్కార్యాన్ని తలకెత్తుకోవడానికి మీరే అర్హులని మా ప్రగాఢ విశ్వాసం.
మన అభ్యర్థన మీద ఉత్తరప్రదేశ్ రక్షకభటవర్గం ఆలోచించి ఓ నిర్ణయం తీసుకునేలోపు వారి గొప్పదనాన్ని ఓమారు జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఊహకందని ఉపజ్ఞతో వారు ఉద్యోగాలను ఎలా ఉద్ధరిస్తున్నారో తలచుకుని తన్మయులమవుదాం. ఖాకీ గుండెలు కరుకైనవని అందరూ అనుకుంటారు కానీ, యూపీ పోలీసులు మాత్రం కరుణామయులు. కరోనా కాలంలో అయినవాళ్ల అంత్యక్రియలను సైతం వీడియో కాల్స్‌లో చూసుకోవాల్సి వస్తోంది కదా. ఈ దుర్దినాల్లో ఆ రక్షకభటులు స్వయంగా బాధితురాలి దేహాన్ని దహనం చేయడం ఎంతటి సాహసం! శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తమ ప్రాణాలనే పణంగా పెట్టిన ఈ అసహాయ శూరులకు, త్యాగమూర్తులకు మరి సేవా పతాకాలు అందించాలో.. పౌర సన్మానాలే చేయాలో!
అనే వాళ్లు ఎప్పుడూ అంటార్లేండి.. ఇప్పుడూ అంటున్నారు, గుట్టుచప్పుడు కాకుండా చట్టానికి చితి పేర్చారని ఆడిపోసుకుంటున్నారు. ఇలా ఊరికే నోరుపారేసుకునే వాళ్లు యూపీ పోలీసుల ముందుచూపులోని లోతును గుర్తించారాండీ? బాధితురాలి దేహాన్ని అయినవాళ్లకి అప్పగిస్తే జరిగిన దురాగతానికి సాక్ష్యాలు దొరికిపోవూ! అప్పుడు ‘అత్యాచారం జరగలేదు’ అని ప్రకటించడం ఎంత కష్టం అయిపోతుంది! అసలు నేరమే జరగలేదని చెబితే దాన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉండదు.. ఎంచక్కా ఠాణాల్లో కూర్చుని టీ తాగొచ్చు ప్రశాంతంగా!! పైగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకైనా మంచిదని దేహాన్ని ఖననం చేస్తే రేపొద్దున ఏ న్యాయస్థానమో దాన్ని తవ్వి తీసి తిరిగి పరీక్షలకు పంపమంటే ఎంత ఇబ్బంది? అదే దహనం చేసేస్తే అడిగే వారుండరు.. అబ్బబ్బా ఏం తెలివి! శిక్షణా సంస్థల్లో దీన్నో పాఠ్యాంశం చేసి, వీళ్లతోనే తరగతులు చెప్పిస్తే కొత్త పోలీసులు కూడా ఈ కళలో నిష్ణాతులవుతారు కదా. ఇంతటి గొప్ప మార్గాన్ని కనిపెట్టిన వాళ్లకు పదోన్నతులు ఇవ్వకుండా న్యాయానికి నిలువుపాతరేశారని నిందించడమేంటి అన్యాయం కాకపోతే!
అర్థరాత్రి పూట కటిక చీకట్లో అంత్యక్రియలు నిర్వహించడం అంటే మాటలా? అత్యంత సమర్థులు కాబట్టి యూపీ పోలీసులు ఈ పని చేయగలిగారు కానీ, అన్యులకు అసాధ్యమిది.. అసంభవం! అయినా వీరి సమర్థతకు ఇదేమీ కొత్త కొలమానం కాదు. అప్పుడెప్పుడో ఓ నాయకుడి గేదెలు కనపడటం లేదని తెలియగానే ఆగమేఘాల మీద పరిగెత్తి పట్టుకొచ్చినప్పుడే వారి ఘనత ఈ లోకానికి వెల్లడైంది. ఆలా ఆ ‘ఆపరేషన్ బర్రె’ను విజయవంతంగా పూర్తిచేసిన ఆనందంలో తప్పిపోయిన ఓ పోలీసు అధికారి కుక్క కోసమూ తమ అమూల్య సమయాన్ని వెచ్చించారుృ ఇలాంటి మనసున్న మారాజులను, ‘జంతు ప్రేమికులను’ దేశం అనవసరంగా అపార్థం చేసుకుంటోంది కదండీ! వృత్తిపరంగా జంతువులను ప్రేమించడం, రక్షించడం అలవాటయ్యింది కాబట్టి మనుషుల్లోని పశు ప్రవృత్తినీ ప్రేమిస్తున్నారు, దానికి అండగా నిలబడుతున్నారు.. తప్పేముంది! వీళ్ల గురించి ఇప్పుడు ఎవరేమనుకున్నా ఏం పర్లేదు.. ఒకానొక కాలంలో పోతపోసిన మంచితనం ఖాకీ బట్టలేసుకుని ఉత్తరప్రదేశంలో రేయింబగళ్లు శ్రమించిందని చరిత్ర కచ్చితంగా గుర్తిస్తుంది. వీరి అపూర్వ ప్రజ్ఞా పాటవాల పాఠాలను భావితరాలు తప్పకుండా చదువుకుంటాయి.
పనిలో పనిగా యూపీ పోలీసుల బాధలనూ అందరూ అర్థం చేసుకోవాలి. హాథ్రస్‌లో ఘోరానికి కాస్త అటూ ఇటుగా బలరాంపూర్‌నూ ఇలాంటి దారుణమే జరిగింది. వీటికంటే ముందే ఆగస్టులో ఒకే జిల్లాలో 20 రోజుల్లో ముగ్గురు మైనర్ అమ్మాయిలు హత్యాచారాలకు గురయ్యారు. అంతకు ముందూ రాష్ట్రంలో వందల కొద్దీ అత్యాచారాలు జరిగాయి. వీటన్నింటినీ విచారించి నేరస్థులను పట్టుకుని శిక్షలు వేయించాలంటే ఎంతగా చెమట చిందాల్సి వస్తుంది! అందుకే నేరాల సంఖ్యను ‘తగ్గించడానికి’ అర్థరాత్రి అంత్యక్రియల్లాంటి కొత్త విధానాలను ఆవిష్కరించక తప్పట్లేదు పాపం! అసలు ఇన్నేసి అత్యాచారాలు జరుగుతుంటే వీళ్లేం చేస్తున్నారని అడగబోతున్నారా? ఆపేయండి.. ఆ ప్రశ్నను అక్కడే గొంతులోనే మింగేయండి. ఊహాజనిత ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం యంత్రాంగానికి లేదు. అంతే!
కాదూ.. కూడదూ.. అడిగి తీరతాం అంటారా? మీ ఇష్టం.. సమాధానం చెప్పడానికి లాఠీలు సదా సిద్ధంగానే ఉంటాయి.
- శైలేష్ నిమ్మగడ్డ