కనీవినీ ఎరుగని విధంగా ఒక్కపెట్టున బహుముఖ సంక్షోభాల ముట్టడిలో యావత్ దేశమూ దుఃఖ విచలితమవుతున్న దుర్దినాలివి. కర్కశంగా కోరసాచిన కరోనా సమస్త జీవన రంగాల్నీ కసిగా కాటేస్తున్న నేపథ్యంలో పార్లమెంటు వానకాల భేటీ రెండు నెలలు ఆలస్యంగా మొదలైంది. రెండు సమావేశాల నడుమ ఆర్నెల్లకు మించి వ్యవధి ఉండరాదన్న రాజ్యాంగ నియమాన్ని మన్నించి- మాన్య సభ్యుల భద్రతరీత్యా పలు సంప్రదాయాల్ని తోసిపుచ్చి జరుగుతున్న సమావేశాలివి. అంతకుమించి కన్నీటిసంద్రంలో కొట్టుకుపోతూ ‘కావవే వరదా’ అని వేడుకొంటున్న కోట్లాది బడుగు జీవుల వేదనను పరిమార్చే వ్యూహరచనా వేదికగా పార్లమెంటు గురుతర బాధ్యత నిర్వర్తించాల్సిన సమయమిది. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉభయ సభలూ చెరో నాలుగ్గంటల వంతున ఏకధాటిగా పద్దెనిమిది రోజులు సమావేశమయ్యే వర్షకాల భేటీలో- రెండు ఆర్థికాంశాలు సహా 45 బిల్లుల్ని ఎన్‌డీఏ ప్రభుత్వం సిద్ధం చేసింది.
మాన్య సభ్యుల నడుమ భౌతికదూరం ఉండేలా లోక్‌సభ సభ్యులకు రాజ్యసభలోనూ సీటింగ్, ప్లాస్టిక్ తెరల రక్షణలు ఏర్పాటు చేసినా- ముందస్తు పరీక్షల్లో పాతికమందికి పైగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతకే దర్పణం పడుతోంది. వివాదాస్పదమైన ప్రశ్నోత్తరాల రద్దు నిర్ణయానికే కట్టుబడి లోక్‌సభలో తీర్మానం నెగ్గించిన మోదీ ప్రభుత్వం- ప్రజాస్వామ్య మౌలిక లక్ష్యమైన జవాబుదారీ పాలన విషయంలో పక్కకు జరిగింది. పదకొండు ఆర్డినెన్సుల స్థానే బిల్లులు ప్రవేశపెట్టి, మరిన్ని కొత్త శాసనాలకు చోటుపెట్టేలా సర్కారీ అజెండా భారీగానే పోగుపడినా- జనం కడగండ్లపై గళమెత్తి సరైన పరిష్కారాలు రాబట్టే విపక్షాల డిమాండ్ల చిట్టా సైతం సమధికంగానే ఉంది. యావత్ జాతీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ రాజకీయ రాద్ధాంతాల్ని పక్కనపెట్టి విశాల జనహితమే ఉమ్మడి అజెండాగా పాలక ప్రతిపక్షాలు పరిమిత సమావేశ కాలాన్ని గరిష్ఠ ప్రయోజనదాయకంగా ఎలా నిభాయించనున్నాయో చూడాలి!
కట్టుదిట్టం కావాలి
జబ్‌తక్ దవా నహీ, తబ్ తక్ ధిలా నహీ! (సరైన మందు రానంతవరకు దిలాసా పనికిరాదు) అన్న ప్రధాని మోదీ హెచ్చరిక పూర్తిగా అర్థవంతం. నాలుగు నెలల లాక్‌డౌన్‌తో 14-29 లక్షల కేసుల్ని, 37-78 వేల మరణాల్ని నిలువరించగలిగామని చెబుతున్న కేంద్రం- ఆ ముందుజాగ్రత్తవల్లే ప్రతి పదిలక్షలకు కేసులూ మరణాల నిష్పత్తిలో కనిష్ఠ స్థాయిలో ఇండియా నిలవగలిగిందంటోంది.
అమెరికా బ్రెజిల్ కేసుల్ని కలిపినా ఏ రోజూ ఇండియాలో అంతకన్నా ఎక్కువగా కరోనా విజృంభిస్తున్న దశలో- మహమ్మారి కట్టడి వ్యూహం మరింత కట్టుదిట్టం కావాలి. కొవిడ్ కారణంగా దేశార్థికానికి ఊతమిచ్చే పలు కీలక రంగాలు పడకేసి, నిరుద్యోగిత జడలు విరబోసుకొంటున్న స్థితిలో- కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ వ్యూహంతో దక్కింది పరిమిత సాంత్వనే. కోట్లమంది జీవికకు ఆధారశిలగా ఉన్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల విషాదయోగం గుండెల్ని మెలిపెట్టేదే!
దాదాపు 12 కోట్లమంది అసంఘటిత రంగ కార్మికులు ఉపాధికి దూరమయ్యారంటున్న అధ్యయనాలు, నిరుద్యోగితతో పాటే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకొంటున్న వైనాలు, డిమాండ్ లేక పారిశ్రామికోత్పత్తి పడక, పర్యవసానంగా జీడీపీ కుంగుదల- మంచి రోజులు ఎప్పటికి రహిస్తాయో తెలియని అయోమయంలోకి జనజీవితాల్ని నెట్టేశాయి. సరిహద్దుల్లో చైనా దురాక్రమణ యత్నాలు, 20మంది భారత యోధుల బలిదానాలు బీజింగ్ వికృత విస్తరణకాంక్షకే అద్దం పడుతున్నాయి. ఏ విధంగా చూసినా స్వతంత్ర భారతావని చర్రితలోనే ఇది అసాధారణ పరిస్థితి. పరస్పరం రాజకీయంగా పైచేయి చాటుకొనే కాలదహన వ్యూహాల సమయం కాదిది. మానవాళిలో ఆరోవంతు జనావళి భవిష్యత్తు నిర్ణయించే పార్లమెంటు- వర్తమాన సంక్షోభ పరిష్కారానికి ఏ విధంగా దిక్సూచి కానుందో దేశం యావత్తూ గమనిస్తోంది!
ఇదీ చదవండి: భాగ్యనగరానికి బుల్లెట్ రైలు- కేంద్రం ప్రణాళిక