Opposition Party Meeting In Patna : ఒంటిచేత్తో చప్పట్లు కొట్టలేం. బలమైన, విశ్వసనీయమైన ప్రతిపక్షమంటూ ఏదీ లేని దేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగా భావించలేం. ప్రభుత్వ పోకడల్లో నిరంకుశత్వాన్ని నివారించాలంటే గట్టి విపక్షమొకటి ఉండితీరాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశిష్ట వ్యాఖ్యల అంతరార్థమదే. గడచిన రెండు సార్వత్రిక సమరాల్లో బీజేపీ ప్రభంజనం ధాటికి జాతీయస్థాయిలో ప్రతిపక్షాలు గుడ్లు తేలేశాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కమలదళాన్ని దీటుగా ఢీకొట్టాలంటే- విపక్షాలు ఏకం కావాల్సిందేనన్న విశ్లేషణలు కొంతకాలంగా వినవస్తున్నాయి. ఆ మేరకు వాటిని ఒకే వేదికపైకి తీసుకొచ్చే బాధ్యతను బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తన భుజాన వేసుకున్నారు. కొన్నాళ్లుగా ఆయన వివిధ పార్టీల అగ్రనేతలను కలుస్తూ కూటమి నిర్మాణంపై సమాలోచనలు చేస్తున్నారు. వాటికి ఫలశ్రుతిగా కీలక ప్రతిపక్షాలు రేపు పట్నాలో భేటీ కానున్నాయి.
విపక్ష ఐక్యతా రాగాలెంత వినసొంపుగా ఉన్నా- పలు రాష్ట్రాల్లో ఉప్పూ నిప్పుగా మసలుతున్నవారి నడుమ సయోధ్య సాధ్యమేనా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకు తగినట్లుగానే- బంగాల్‌లో సీపీఐ(ఎం)తో కాంగ్రెస్ జట్టుకడితే లోక్‌సభ సమరంలో ఆ పార్టీకి సాయంచేసేది లేదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పేశారు. రాజస్థాన్‌లో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్- అక్కడి అధికారపక్షం కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు.
బీజేపీని ఓడించాలనుకునే పార్టీలన్నీ తమ వెనక నిలబడాలని సమాజ్‌వాదీ అధినాయకుడు అఖిలేశ్ యాదవ్ పిలుపిస్తున్నారు. ఇలా ఎవరికి వారు స్వప్రయోజనాల మడికట్టుకుంటున్న తరుణంలో- కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి చేర్చాలన్న నీతీశ్ లక్ష్యం నెరవేరుతుందా? ఆయన ఆశయసిద్ధికి బాటలుపరుస్తూ పట్నా సమావేశం సఫలీకృతమవుతుందా?
తొమ్మిదేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో 31.34శాతం ఓట్లతో 282 సీట్లు సాధించిన బీజేపీ- 2019లో 37.7శాతం ఓట్లను, 303 సీట్లను ఒడిసిపట్టింది. ప్రతిపక్షాలన్నీ కలిసి ఓట్ల చీలికను అడ్డుకోగలిగితే కమలరథ జైత్రయాత్రను నిలువరించడం అసాధ్యమేమీ కాదన్న అంచనాలోంచే విపక్ష కూటమి ఆలోచన మొగ్గతొడిగింది. కన్నడనాట విజయంతో కొత్త ఉత్సాహాన్ని కొనితెచ్చుకున్న హస్తం పార్టీ- ప్రతిపక్ష శిబిరానికి తానే మూలాధారం కావాలని కోరుకుంటోంది.
కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో సొంత సర్కార్లను నడుపుతున్న కాంగ్రెస్- తమిళనాడు, బిహార్, ఝార్ఖండ్ అధికార కూటముల్లో భాగస్వామిగా ఉంది. కిందటి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 40శాతానికి పైగా ఓట్లు సాధించిన హస్తం పార్టీ- నిరుడు గుజరాత్ శాసనసభ బరిలో 27శాతం ఓటర్ల మెప్పు పొందింది. ఆ పార్టీ పునాదులు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇంకా పటిష్ఠంగానే ఉన్నాయి. స్వీయ తప్పిదాలతో కళ తప్పినప్పటికీ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.5శాతానికి పైగా ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో జమపడ్డాయి. అందువల్ల ప్రతిపక్షాల ఐక్యతను అభిలషిస్తున్న ప్రాంతీయ రాజకీయశక్తులు ఏవైనా సరే- హస్తం పార్టీతో సమన్వయం చేసుకోక తప్పదు. ప్రభుత్వ తప్పొప్పులను సకాలంలో ఎత్తిచూపించే సమర్థ ప్రతిపక్షం- భారతావనికిప్పుడు చారిత్రక అవసరం. అటువంటి విపక్ష కూటమికి ప్రాణంపోస్తూ భావసారూప్యత కలిగిన రాజకీయపక్షాలు చేతులు కలపడం- దేశ విశాలహితం దృష్ట్యా వాంఛనీయం.
అందుకుగాను కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ఉమ్మడి దృక్పథంతో వ్యవహరించాలి. అధికారంలోకి వస్తే- సామాన్యుల బతుకులను పట్టిపల్లారుస్తున్న పలు సమస్యలను తామెంత మెరుగ్గా పరిష్కరించగలమో కూటమి నేతలు ముందుగా వెల్లడించాలి. భారత సమాఖ్యను బలోపేతం చేయడం, మసిబారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రభను పునరుద్ధరించడం తదితరాలపై తమ ఆలోచనలను ప్రజలకు విస్పష్టంగా విడమరచాలి.
'కాబోయే ప్రధానిని నేనే' అనుకుంటూ ఎవరికి వారు పేరాశల పందిరి కట్టుకోకుండా- కూలంకష చర్చలతో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. భాగస్వామ్యపక్షాల సమష్టి సమ్మతితోనే కూటమి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. ఎన్నికల ముహూర్తం సమీపించే లోపు పార్లమెంటు వేదికగా భిన్న అంశాలపై ఒకే స్వరంతో స్పందిస్తూ తమ ఐకమత్యంలోని అంకితభావాన్ని ప్రజలకు చాటిచెప్పాలి. ఆ మేరకు ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రజావిశ్వాసాన్ని చూరగొనగలుగుతాయి!
ఇదీ చదవండి: 1977 ఫార్ములాతో విపక్ష కూటమి.. 17 పార్టీల మధ్య సీట్ల పంపకం ఇలా..