కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలపై రైతులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం వల్ల అందరి దృష్టి వ్యవసాయ రంగంపైకి మరలింది. వ్యవసాయ ఉత్పత్తి, వ్యాపార వాణిజ్య ప్రోత్సాహ, సులభతర చట్టం-2020లో కాంట్రాక్టు వ్యవసాయం, కాలపరిమితి, వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ధారణ వంటివి పొందుపరిచారు. రెండో వ్యవసాయ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మండీల్లోనేగాక దేశంలో ఎక్కడైనా అంటే పొలం వద్ద, కంపెనీల వద్ద, శీతల గిడ్డంగుల దగ్గర విక్రయించుకునే స్వేచ్ఛతో పాటు అంతర్జాలం ద్వారా ఎటువంటి సుంకాలు లేకుండా ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అమ్మేందుకు వీలు కల్పిస్తోంది. 1955నాటి అత్యవసర సరకుల చట్టానికి కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తన అధీనంలోకి తీసుకోవడం, ప్రభుత్వమే గరిష్ఠ ధర నిర్ణయించేట్లు చేయడంపై రైతులోకంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలూ వీటిపట్ల విముఖత వ్యక్తం చేస్తున్నాయి.
అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి
భారత జనాభాలో 8.6 శాతంగా ఉన్న గిరిజన రైతులు, వారి సాగు సమస్యలపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. కాంట్రాక్టు వ్యవసాయం గిరిజనులలో అనధికారికంగా ఎప్పటినుంచో అమల్లో ఉంది. కోయ దొరలు దీన్ని గుత్తకు అని; గోండు, బైగా వారు ఆధియా అని రకరకాల పేర్లతో వ్యవహరిస్తుంటారు. ఈ తరహా పద్ధతిలో వ్యవసాయం చేయగా వచ్చిన ఫలసాయాన్ని ఎక్కువ శాతం భూస్వాములు తీసుకొని చాలా తక్కువ మాత్రమే సాగు రైతులకు ఇస్తున్నారు. కొంతమంది గిరిజనేతరులు అడవిబిడ్డలకు అప్పులు ఇచ్చి వడ్డీకి బదులుగా వారి భూమిని ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిని గహన్ ఖేతి అని గోండు, బైగా గిరిజనులు వ్యవహరిస్తుంటారు. ఈ ప్రక్రియ ద్వారా సారవంతమైన భూములను గిరిజనేతరులు ఏళ్ల తరబడి అనుభవిస్తూ వస్తున్నారు. చట్టం ప్రకారం అయిదో షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజనుల భూమిని గిరిజనులు తప్ప మరెవరూ కొనడంగానీ, అమ్మడంగానీ చేయరాదు. అయినప్పటికీ కొంతమంది అవినీతి అధికారులవల్ల గిరిజన ప్రాంతాల్లోని భూమిని ‘డీనోటిఫై’ చేసి ఇతరులకు పట్టాలు ఇస్తున్నారు. దానితో గిరిజనులు సాగుకు పనికిరాని బీడు భూముల్లో వ్యవసాయం చేయవలసి వస్తోంది.
గిరిజనులకు తప్పని భంగపాటు
భారత్‌లో గిరిజన రైతు సమస్యలు మైదాన ప్రాంత సమస్యలకంటే చాలా భిన్నమైనవి. దీనికి ప్రధాన కారణం వారు చిన్న చిన్న భూ కమతాలు కలిగి ఉండటం, కొండ కోనల్లో ‘స్థానంతరణ’ వ్యవసాయం కొనసాగించడమే. ఈ తరహా సేద్యాన్ని ఉత్తర పూర్వ రాష్ట్రాల్లో ఝుమ్ సేద్యం అని, సంతాల్ ప్రాంతంలో కల్లు అని, ఆంధ్ర తెలంగాణలో పోడు అని; మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలో బేవర్ అని రకరకాల పేర్లతో వ్యవహరిస్తుంటారు. ఈ సేద్యంలో అధిక శ్రమ ఇమిడి ఉంటుంది. ఇది పురాతన సేంద్రియ పద్ధతి కాబట్టి ఫలసాయమూ తక్కువే. కాబట్టి వారు పండించే పంట కుటుంబ పోషణకు మాత్రమే సరిపోతుంది. 2006నాటి అటవీ భూహక్కుల చట్టం కింద సాగు, పోడు భూములకు చట్టబద్ధత వస్తుంది అని ఆశపడ్డ గిరిజనులకు భంగపాటు తప్పలేదు. ఆ చట్టం అమల్లోకి వచ్చి పద్నాలుగేళ్లు అయినా ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో గిరిజనులకు భూహక్కులు లభించలేదు.
సంస్థలకు ధారాదత్తం
గిరిజనుల అటవీ భూముల్లో మైనింగ్, రహదారులు, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో వారి జీవనోపాధికి మూలమైన భూములను బలవంతంగా పెద్ద కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని వేదాంత మైనింగ్ సంస్థకు గిరిజనుల అటవీ భూములను గుత్తకు ఇచ్చారు. దాంతో విధిలేక దొంగరియా కొంధులు అత్యంత పవిత్రంగా భావించే నియమగిరి కొండను కాపాడుకునేందుకు ఆందోళన బాట పట్టారు. జార్ఖండ్‌లో బొగ్గు గనుల ద్వారా రవాణా చేస్తున్నప్పుడు వచ్చే ధూళివల్ల చుట్టుపక్కల పల్లె ప్రాంతాల్లోని సాగు భూములు సేద్యానికి పనికి రాకుండా పోతున్నాయి. గిరిజన అటవీ ఉత్పత్తుల సంగ్రహణకు ప్రభుత్వం నెలకొల్పిన గిరిజన కోఆపరేటివ్ సొసైటీలాగా వ్యవసాయ ఉత్పత్తులు సేకరించే సంస్థలు లేకపోయే సరికి దళారుల చేతిలో వీరు మోసపోవాల్సి వస్తోంది.
ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లోని గిరిజన విశ్వవిద్యాలయం చుట్టుపక్కల గ్రామాల్లో గల్లా పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులను వారాంతపు సంతలలో కొంటూ ఉంటారు. వీరు గిరిజనులు తెచ్చిన ఉత్పత్తులను ప్రథమంగా దేవుని పేరుతో కొంత భాగం తీసుకోవడం, తూనికలలో మోసం చేయడం, ధాన్యం అమ్మగా వచ్చిన సొమ్మును చిల్లర రూపంలో లేదా చిన్న చిన్న కరెన్సీ నోట్ల రూపంలో ఇస్తున్నారు. లెక్కలు సరిగా రాని గిరిజనులు చాలా డబ్బులు వచ్చాయన్న సంతోషంతో వాటిని నిత్యావసరాలు, మహువా సారా మీద ఖర్చు చేస్తున్నారు. భూమి అన్యాక్రాంతం అనేది గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రధాన సమస్య. దీని కట్టడికి చట్టాలు ఉన్నప్పటికీ అవినీతి, నిరక్షరాస్యతవల్ల గిరిజనులు సారవంతమైన భూములు కోల్పోయి ఆకలి పేదరికంలో మగ్గుతున్నారు. 1997లో సుప్రీంకోర్టు ‘సమత’ తీర్పు సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో ముందస్తు సమాచార సమ్మతిని తప్పనిసరి చేసిన షెడ్యూల్డ్ ప్రాంతాలలోనే ఈ అన్యాక్రాంతం యథేచ్ఛగా కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఈ సాగు, అటవీ చట్టాలు వారి ఉనికిని జీవనోపాధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే స్పందించి వీటిపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.
- డాక్టర్ దన్నారపు వెంకట ప్రసాద్
ఇదీ చదవండి : రైతు సంఘం ప్రతినిధులతో సుప్రీం ప్యానెల్ భేటీ