భారత ప్రభుత్వానికి, మైక్రోబ్లాగింగ్ మాధ్యమం ట్విటర్‌కు మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం తాలూకు పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకుతోడు భారత సార్వభౌమత్వం, ప్రజాస్వామ్య సంప్రదాయాలపైనా ప్రభావం ప్రసరించనుంది. భారత్‌లో వ్యాపారం చేసే కంపెనీలన్నీ మన రాజ్యాంగ పరిధిలో, మన పార్లమెంటు చేసిన చట్టాల పరిధిలో కార్యకలాపాలు సాగించాలన్న సరళమైన సత్యాన్ని ట్విటర్ విధానకర్తలు విస్మరించినట్లు కనిపిస్తోంది. కంపెనీ నియమ నిబంధనలు ఏమైనా కావచ్చు. అవన్నీ ఈ దేశ చట్టాలకు లోబడి ఉండాలి. ట్విటర్ ఈ వాస్తవాన్ని గమనించకుండా భావ ప్రకటన స్వేచ్ఛకు తానిచ్చే భాష్యాన్ని భారత రాజ్యాంగంపై రుద్దాలని చూస్తోంది. అవాంఛనీయ శక్తులతో సంబంధాలున్న 1,178 ఖాతాలను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు స్పష్టం చేశాకే ఈ గందరగోళం ఆరంభమైంది. ప్రభుత్వ ఆదేశాలపై వెంటనే స్పందించకుండా తరవాత నామమాత్రంగా అమలు చేపట్టింది.
ట్విట్టర్‌పై విమర్శలు
రైతు ఉద్యమం విషయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ట్విటర్‌లో ‘టూల్‌కిట్’ పేరిట ఉంచిన పత్రంపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అలజడిని సృష్టించేందుకు విద్రోహులు సామాజిక వేదికను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం హెచ్చరించింది. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ దేశంలో అస్థిరత సృష్టించడానికి దుష్టయత్నాలు చేస్తున్నవారి కొమ్ముకాస్తున్నారంటూ ట్విటర్ ఉన్నతాధికారులను కేంద్ర ఎలెక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఇటీవల హెచ్చరించారు. అమెరికా పార్లమెంటు భవనం క్యాపిటల్ హిల్ మీద జనవరి ఆరో తేదీన జరిగిన దాడిని, జనవరి 26న దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన హింసను ట్విటర్ వేర్వేరు రీతుల్లో చూసిందనే విమర్శలున్నాయి.
19(2) అధికరణ ప్రకారం..
భారత రాజ్యాంగంలోని 19(1)ఎ అధికరణ పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించినా, దేశ సమగ్రత సార్వభౌమత్వాల రక్షణ కోసం ఈ హక్కుపై ప్రభుత్వం సమంజసమైన రీతిలో కొన్ని ఆంక్షలు విధించవచ్చని 19(2) అధికరణ పేర్కొంటోంది. దేశ భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలకు, శాంతిభద్రతలు, సభ్యతాసంస్కారాలకు భంగం కలగని రీతిలో భావప్రకటన స్వేచ్ఛను వినియోగించుకునేలా ప్రభుత్వం జాగత్త పడవచ్చని స్పష్టం చేస్తోంది. అలాగే ఈ హక్కు కోర్టు ధిక్కారానికి దారితీయకూడదని, పరువు నష్టానికి, నేర ప్రేరేపణకు కారణం కారాదని 19(2) అధికరణ నిర్దేశిస్తోంది. దీనికోసం ప్రభుత్వం భావప్రకటన హక్కుపై తగిన పరిమితులు విధించవచ్చు.
అసలు ఈ పరిమితులు లేదా ఆంక్షలను ప్రవేశపెట్టినది- తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూయే. 19(1)ఎ అధికరణ మరీ నిర్నిబంధ భావప్రకటన స్వేచ్ఛను ఇవ్వడం ప్రజా జీవితంలో అలజడికి, నేర ప్రేరేపణకు, పరువు నష్టాలకు దారితీస్తుందని నెహ్రూ భావించారు. అందుకే భావ ప్రకటన హక్కుకు హద్దులు నిర్ణయిస్తూ 1951లో రాజ్యాంగానికి మొదటి సవరణ చేశారు. సమస్యను అన్ని కోణాల నుంచి పరిశీలించిన మీదటే పార్లమెంటు భావప్రకటన హక్కుపై కొన్ని పరిమితులు విధించడానికి సమ్మతించింది. అదే సమయంలో ఈ పరిమితులు లేదా ఆంక్షలు సమంజసమైనవో కాదో నిర్ణయించే అవకాశాన్ని కోర్టులకు వదిలింది.
ఇదీ చదవండి : అందరికీ టీకాలు అందేలా..