అరెరె.. వెయ్యి రూపాయలు! ఏం చేసుకోవాలబ్బా అంత డబ్బు! ఎక్కడ దాయాలి.. ఎలా ఖర్చు పెట్టాలి? భలే చిక్కొచ్చిపడిందే! అసలు ఆ ఒక్క మాచర్ల - నల్లగొండ రైల్వే లైనుకే ఇన్ని నిధులు ఇచ్చేస్తే మిగిలినవి ఏమైపోవాలి? ఏలినవారికి తెలుగువారి మీద ఎంత ఇష్టముంటే మాత్రం ఒకేసారి ఇంత భారీ మొత్తాన్ని కేటాయించేస్తారా? పక్క రాష్ట్రాలవారు ఏమనుకుంటున్నారో ఏమిటో.. కళ్లలో ఎన్ని నిప్పులు పోసుకుంటున్నారో ఏం పాడో! వెంటనే మన రెండు రాష్ట్రాలకూ దిష్టి తీయించేయాలి. ‘మీ ఏడుపే మా ఎదుగుదల’ అన్న బోర్డులను అటు మాచర్ల నుంచి ఇటు నల్లగొండ దాకా పెట్టించి కానీ, ఆ లైను పనులను పట్టాలెక్కించకూడదు.
కేంద్రం విదిలింపులు..
బడ్జెట్ బంతి భోజనంలో ఈసారెందుకో తెలుగువారికి మరీ ప్రేమగా కొసరి కొసరి వడ్డించారు. భద్రాచలం-కొవ్వూరు, కంభం- ప్రొద్దుటూరు, గూడూరు- దుగరాజపట్నం, కాకినాడ-పిఠాపురం, విజయనగరం-కొత్తవలస రైల్వేలైన్లకు కూడా వెయ్యి రూపాయల వంతున పంచిపెట్టారు. ఆహా.. ఏమి భాగ్యం! ఇది తెలుగు ప్రజల పూర్వజన్మ పుణ్యఫలం!! బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నట్టు ‘కేటాయింపులు’ కావివి.. ‘విదిలింపులు’- హస్తినాపుర పెద్దలు ఆశీర్వదించి, అపార అభిమానాన్ని రంగరించి, వాత్సల్యాన్ని చిలకరిస్తూ చేసిన ‘చదివింపులు’. సరే, వారెంత పెద్దమనసుతో ఇంతింత చదివించినా- చెప్పుకోవడానికి మరీ నామోషీగా ఉందనుకుంటే ఒక్కో లైనుకు రూ.0.0001 కోట్లు ఇచ్చారని చెప్పుకొందాం.. ఘనంగా ఉంటుంది!!!
కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే నిధులంటే ఇవే కాబోలు.. పలాస-విశాఖ మధ్య 134 చోట్ల ట్రాక్ మరమత్తులకు కూడా వెయ్యి రూపాయలు మంజూరయ్యాయి. అంతేనా- వాల్తేరు డివిజన్ మొత్తానికీ ‘వెయ్యి’ వరాలు ప్రసాదించారు ఉదారంగా! లైన్ డబ్లింగ్ పనుల నుంచి మానవ రహిత లెవెల్ క్రాసింగుల వరకు.. రైల్వేస్టేషన్లో మౌలిక సదుపాయాల నుంచి రైల్వేయార్డు రీమోడలింగ్ వరకు దేనికైనా సరే వెయ్యే! అంతకు మించి రూపాయిస్తే ఒట్టు. చూసేవారికి ఇదంతా పొమ్మనలేక పొగపెట్టినట్టు అనిపిస్తుంది కానీ, తప్పు తప్పు అన్యథా భావించవలదు. అభివృద్ధిని అందలం ఎక్కించాలన్న ఆకాంక్ష బలీయంగా ఉంది కాబట్టే ఆ మాత్రమన్నా ఇచ్చారు. డబ్బులెవరికీ ఊరికే రావు అన్న వాస్తవాన్ని గుర్తించి, దక్కిందే మహా ప్రసాదం అనుకుని కళ్లకద్దుకుందాం. ఎక్కడికక్కడ ఆగమేఘాల మీద పనులు ప్రారంభించేద్దాం. లేకపోతే వచ్చిన ఆ వెయ్యి రూపాయలు కూడా వెనక్కిపోయే ప్రమాదముంది. చూస్తూ చూస్తూ అన్నేసి వేలను ఎలా వదులుకుంటాం చెప్పండి!
దక్కిందేమీ లేదు..
అసలు వెయ్యి రూపాయలంటే మాటలా? గుడికో బడికో వెయ్యినూట పదహార్ల చందా ఇచ్చిన దాతలందరి పేర్లన్నింటినీ కలిపి ‘రాజపోషకుల’ కేటగిరీ కింద శిలఫలాకాల మీద చెక్కించడం మనం చూస్తున్నదే కదా. ఆ ఆచారాన్ని గౌరవించి అభివృద్ధి పనులకూ అంతే దానం చేసేశారు.. తప్పేముంది? ఆ మిగిలిన నూటపదహార్లనూ మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రపంచబ్యాంకు లాంటి పుణ్యాత్ముల దగ్గరో అప్పు తెచ్చి అయినా సరే, కేంద్రం పేరును శిలాఫలకాల మీద చెక్కిస్తే వారి ఘనత చరిత్రలో నిలిచిపోతుంది. అయినా ‘సున్నాలో ఉంది సూక్ష్మం.. సూక్ష్మంలో ఉంది మోక్షం’ అని కదా పెద్దల మాట. ఈ వేదాంత సారాన్ని అనుసరించి అవలోకిస్తే వెయ్యిలోని మూడు సున్నాలు మూడు మోక్షమార్గాలకు- గొయ్యి, నుయ్యి, పొయ్యిలకు ప్రతీకలన్న మాట. వహ్వా! బడ్జెట్ పంపకాల్లో ఇంతకుమించి మీకు దక్కేదేమీ ఉండదని ఒకే ఒక్క సంఖ్యతో ఎంత చక్కగా సెలవిచ్చారో చూశారా?
ఆదాయంలో ఆకాశమంత ఎత్తులో ఉండే దక్షిణమధ్య రైల్వేకు ఏటా కేటాయింపులు మాత్రం సున్నకు సున్న హళ్లికి హళ్లి. ఆ ఆనవాయితీని కొనసాగించడం ఎప్పటికప్పుడు ఒక చారిత్రక అవసరం. లేకపోతే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ‘చుక్ చుక్ బండి’ పోలేదు. ఈసారి అది అలా పశ్చిమ్ బంగ వైపు పరిగెత్తింది. దాని గురించి మంత్రి పీయూష్ గోయెల్ గొప్పగా చెప్పగానే తృణముల్ ఎంపీ డెరిక్ ఓబ్రయిన్ తాడెత్తున లేచారు. ఇన్నాళ్ల నుంచి పట్టించుకోకుండా ఇప్పుడీ హఠాత్తుప్రేమేమిటనిపటపటాపళ్లుకొరికారు. విషయం ఏమిటంటే- మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు సొంత రాష్ట్రానికి ప్రకటించుకున్న 20 ప్రాజెక్టులకు నిరుడు బడ్జెట్లో వెయ్యి రూపాయల చొప్పునే దక్కాయి. 2019లోనూ కొన్నింటికి అంతే ముట్టాయట. అదీ వాళ్ల కోపం. అవును మరి.. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆవిడకు కావాల్సినవి ఆవిడ వడ్డించుకుంది. పగ్గాలు పగవారి చేతుల్లోకి వెళ్లాక కూడా తమ విస్తరి అలాగే నిండాలంటే ఎలా కుదురుతుంది? పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోమన్నా.. పంచభక్ష్య పరమాన్నాలతో పండగ చేసుకోమన్నా- అంతా అధికారపక్షం దయే కదా!
పాలనాసూత్రం
రాష్ట్రం ఏదైనా సరే, వెయ్యి రూపాయల వడ్డన జరిగిందంటే- ఇక ఆ ప్రాజెక్టుకు గొయ్యి తవ్వినట్టే. ఒకేసారి మొండిచెయ్యి చూపిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఇలా వెయ్యితో వెన్నుపోటు పొడవడం ఓ పాలనాసూత్రం! పేరుచెప్పని రైల్వే అధికారి ఒకరు ఈ బహిరంగ రహస్యాన్ని చాలా గుట్టుగా బయటపెట్టేశారు! శెభాష్.. ఈ తెలివితేటలకైనా సరే, రైల్వేశాఖను వెయ్యినూట పదహార్లతో సత్కరించాల్సిందే! ఏమంటారు.. చేద్దామా ఏర్పాట్లు?
- శైలేష్ నిమ్మగడ్డ
ఇదీ చదవండి : ఉత్తరాఖండ్ వరదలు: ఆ పరికరంపైనే 'అణు'మానాలు