ETV Bharat / opinion

జోరుగా ఆన్‌లైన్‌ నియామకాలు- అభ్యర్థుల ఎంపికలో మారిన తీరు - software job placement

Online recruitment: ప్రస్తుతం అన్ని పనులు ఆన్​లైన్​లోనే జరుగుతున్నాయి. కరోనా వేళ ఆన్​లైన్​ సేవలను మరింత సమర్థంగా వినియోగించుకుంటుకున్నాయి సంస్థలు. ఒకప్పుడు భౌతికంగా ఇంటర్వ్యూలు నిర్వహించే సాఫ్ట్​వేర్​ సంస్థలు.. ఇప్పుడు పంథా మార్చాయి. కృత్రిమ మేధ సాయంతో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వర్చువల్ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా.. వారి సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేసి ఎంపిక చేస్తున్నాయి. అందుకే ఉపాధి కోసం ప్రయత్నించే అభ్యర్థులు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Online recruitment
Online recruitment
author img

By

Published : Dec 13, 2021, 7:11 AM IST

Online recruitment: మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు సాంకేతికతే పెద్ద పరిష్కార మార్గంగా నిలుస్తోంది. కొవిడ్‌తో అతలాకుతలమైన ప్రపంచం మళ్ళీ జవసత్వాలను కూడగట్టుకుంటున్న వేళ విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో అభివృద్ధికి సాంకేతికతే ప్రధాన ఆలంబనగా నిలుస్తోంది. నియామకాలు సైతం ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే సాగుతూ ఉద్యోగార్థులకు ఊపిరి పోస్తున్నాయి. కొవిడ్‌తో గతేడాది సాఫ్ట్‌వేర్‌ సహా చాలా రంగాల్లో ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. ఇప్పుడు దేశంలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు కొత్త ఒప్పందాలు కుదరడంతో మానవ వనరుల అవసరాలు బాగా పెరిగాయి. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో అభ్యర్థుల ప్రతిభాపాటవాలను గణించడానికి, వారికి ముఖాముఖీ నిర్వహించడానికి చాలా సంస్థలు ఆన్‌లైన్‌ వేదికగా ముందుకెళ్తున్నాయి.

సొంత వేదికలు

కరోనా రెండోదశ ఉద్ధృతి ముగియడంతో కంపెనీలు మూడు, నాలుగు నెలల కిందటే కొత్త నియామకాలకు తెరతీశాయి. ఇన్ఫోసిస్‌ 35 వేల మందికి కొలువులిచ్చింది. టీసీఎస్‌ 40 వేలు, హెచ్‌సీఎల్‌ 22 వేలు, విప్రో 12 వేలు, కాగ్నిజెంట్‌ 30 వేల మంది నియామక ప్రక్రియ చేపట్టాయి. ఆరోగ్య సంరక్షణ, సైబర్‌ భద్రత, కమ్యూనికేషన్లు, క్లౌడ్‌ సేవలు వంటి విభాగాల్లో కొత్త ఆర్డర్లు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలు ఐటీ సేవల కోసం వెచ్చించే మొత్తం వచ్చే ఏడాది 11శాతం పెరగవచ్చని సాంకేతిక పరిశోధన, కన్సల్టింగ్‌ సంస్థ గార్ట్‌నర్‌ తాజాగా పేర్కొంది. ఐటీ సేవల్లో ముందంజలో ఉన్న భారత కంపెనీలకు ఇది అనుకోని అవకాశం. దాంతో కొత్తగా మరింత మందిని నియమించుకోవడానికి కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. టీసీఎస్‌ 35 వేల మందిని, ఇన్ఫోసిస్‌ 10 వేల మందిని, హెచ్‌సీఎల్‌ టెక్‌ 20వేల మందిని నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇవన్నీ ఈ ఏడాది ఇప్పటికే జరిగిన నియామకాలకు అదనం. అభ్యర్థుల వైఖరి, సామర్థ్యాల పరిశీలనకు ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్లు, వర్చువల్‌ ఇంటర్వ్యూలు ఇప్పుడు ఐటీ కొలువుల్లో సర్వసాధారణంగా మారాయి.

కృత్రిమ మేధ సాయంతో

అభ్యర్థుల వ్యవహారశైలి ఎలా ఉంది, బృందంతో కలిసి ఎలా పని చేయగలరనే అంశంపై కృత్రిమ మేధతో కూడిన టూల్స్‌ను ఉపయోగిస్తూ సంస్థలు ఓ అవగాహనకు వస్తున్నాయి. కృత్రిమ మేధ నివేదికల సాయంతో సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ క్యాప్‌జెమినీ గతేడాది 125 కళాశాలల్లో 60 వేల మందికి ముఖాముఖీ నిర్వహించింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తమ భాగస్వామ్య విద్యాసంస్థల్లోని విద్యార్థులతోపాటు మిగతా అభ్యర్థులనూ ఆన్‌లైన్‌లో పరీక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసుకుంది. అభ్యర్థుల కోడింగ్‌ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కోడ్‌వీటా పేరుతో ఆన్‌లైన్‌ పరీక్షను టీసీఎస్‌ నిర్వహిస్తోంది. అందులో ప్రతిభ చూపిన వారికే కొలువులిస్తోంది. అభ్యర్థుల ప్రతిభాపాటవాలను పరీక్షించడానికి ఇన్ఫోసిస్‌ 'ఇన్ఫిటీక్యూ' పేరుతో ఓ ఆన్‌లైన్‌ వేదికను నిర్వహిస్తోంది. క్యాప్‌జెమినీ 'ఎక్సెల్లర్‌' పేరుతో ఆన్‌లైన్‌ నియామక వేదికను ఏర్పాటు చేసుకుంది. ముందుగా అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవడానికి ఓ యూఆర్‌ఎల్‌ లింక్‌ ఇస్తుంది. దానిలో నమోదు చేసుకున్న వారినుంచి అర్హులను ఎంపిక చేసి, ఎక్సెల్లర్‌ వేదికగా నియామకాలు చేపడుతుంది. మిగతా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలూ సొంత ఆన్‌లైన్‌ వేదికలను రూపొందించుకున్నాయి.

నిజానికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ నియామకాలు నిర్వహిస్తున్నప్పటికీ అవి సీనియర్‌ ఉద్యోగులకే పరిమితమయ్యేవి. కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవారిని కళాశాలలకు వెళ్లి ప్రాంగణ ఎంపికల్లో ఎంచుకునేవి. లేదంటే వారినే సంస్థకు పిలిచి ముఖాముఖీ చేపట్టేవి. గత రెండు మూడేళ్లుగా పెద్ద కంపెనీలు ప్రాంగణ ఎంపికలను బాగా తగ్గించేశాయి. ఒకే కళాశాలలోని విద్యార్థులను కాకుండా వివిధ విద్యాసంస్థల్లోని వేల మంది అభ్యర్థులనుంచి కావాల్సిన వారిని ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. తాజాగా అభ్యర్థుల ఎంపికకు ఆన్‌లైన్‌ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. కృత్రిమ మేధ(ఏఐ)తో వర్చువల్‌ ఇంటర్వ్యూలు చాలా సులువయ్యాయి. వాటి వల్ల ఉద్యోగార్థికి, కంపెనీకి సమయం, డబ్బు ఆదా అవుతాయి. అవసరమైతే ఒకేరోజు, ఒకేసారి ఎక్కువ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నియామక కమిటీలోని సభ్యులు వేర్వేరుచోట్ల ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉండటం కంపెనీలకూ వెసులుబాటే. అభ్యర్థిని నేరుగా చూడకుండా, అతడి దృక్పథాన్ని దగ్గరగా పరిశీలించకుండా కొలువులోకి తీసుకోవడం కంపెనీలకు కొంత ఇబ్బందికరమే. అయినా, పెద్ద సంఖ్యలో అభ్యర్థులను కంపెనీ ప్రాంగణాలకే పిలిచి ముఖాముఖీ నిర్వహించడం కొవిడ్‌ సంక్షోభ నేపథ్యంలో ప్రమాదకరం కావడంతో కంపెనీలు వర్చువల్‌ ఇంటర్వ్యూల బాట పట్టాయి.

తేలిగ్గా తీసుకోవద్దు

వర్చువల్‌ ఇంటర్వ్యూనే కదా అని తేలిగ్గా తీసుకుంటే బోల్తాపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామూలు ముఖాముఖీకంటే అభ్యర్థులు దీనికి మరింత జాగ్రత్తగా సన్నద్ధం కావాలని పేర్కొంటున్నారు. ప్రశాంతమైన పరిసరాల్లో, మంచి ఆహార్యంతో వర్చువల్‌ ఇంటర్వ్యూలో పాల్గొనే అభ్యర్థి వృత్తిగతంగా పనికొస్తారని కంపెనీలు భావిస్తాయి. అంతేకాదు వర్చువల్‌ ఇంటర్వ్యూలే కదా అని అవకతవకలకు పాల్పడితే సులువుగానే కనిపెట్టేస్తారు. ఇందుకోసం కంపెనీలు ప్రత్యేకమైన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నాయి. క్యాప్‌జెమినీ- అభ్యర్థులకు సాధారణ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు బదులు గేమ్‌ ఆధారిత ఆప్టిట్యూడ్‌ పరీక్ష నిర్వహిస్తోంది. దాన్ని కంప్యూటర్‌ తెరపైనుంచి స్క్రీన్‌షాట్‌ తీయలేరు కాబట్టి ఆప్టిట్యూడ్‌ పరీక్షలో అభ్యర్థులు అవకతవకలకు పాల్పడకుండా నిరోధించగలుగుతారు. మిగిలిన కంపెనీలు సైతం ఇటువంటి వ్యవస్థలనే ఏర్పాటు చేసుకున్నాయి. అందువల్ల నైపుణ్యాలను నిరూపించుకుంటూ నిజాయతీతో ముందుకెళ్తేనే ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూల్లో కొలువులను అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది.

కోడింగ్‌కే ప్రాధాన్యం

దేశవ్యాప్తంగా ఏటా ఇంజినీరింగ్‌ పట్టభద్రులై బయటికి వస్తున్న 20 లక్షల మంది విద్యార్థుల్లో మూడొంతుల మందికి కనీసం కోడ్‌ రాయడమూ రావడంలేదని పరిశ్రమ వర్గాలు కొన్నేళ్లుగా చెబుతున్నాయి. ఉద్యోగాలిద్దామన్నా నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దొరకడం లేదన్నది వారి వాదన. అందుకే సాధారణ ముఖాముఖీ మాదిరిగానే వర్చువల్‌ ఇంటర్వ్యూల్లోనూ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రధానంగా అభ్యర్థి కోడింగ్‌ సామర్థ్యానికే ప్రాధాన్యమిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా ఆన్‌లైన్‌లోనే తరగతులు కొనసాగుతున్నందువల్ల విద్యార్థులు కోడింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో పరిశీలిస్తున్నాయి. కొన్ని కంపెనీలు హ్యాకర్‌ ర్యాంక్‌, హ్యాకర్‌ ఎర్త్‌వంటి వేదికల్లో విద్యార్థులు ఎలా సాధన చేస్తున్నారో చూడటమే కాకుండా, లీడర్‌ బోర్డులో స్కోరునూ లెక్కిస్తున్నాయి. అందుకే కోడింగ్‌ సామర్థ్యం పెంచుకోవాలని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలతోపాటు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూల్లో ఎలా వ్యవహరించాలనే తీరుపైనా అభ్యర్థులు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

రచయిత- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

ఇదీ చూడండి: 'మొబైల్‌ ఛార్జీల తరహాలోనే బ్రాడ్‌బ్యాండ్‌ ధరలకూ రెక్కలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.