కొవిడ్ అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభంతోపాటు విద్యా సంక్షోభాన్నీ సృష్టిస్తోంది. భారతదేశంలో 25 కోట్లమంది విద్యార్థులు పాఠశాలలకు కాని, ఉన్నత విద్యాలయాలకు కాని వెళ్లలేక ఇంటిపట్టునే ఉండిపోయారు. దీంతో ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు ఆన్‌లైన్‌లో విద్యాభ్యాసం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్ని విశ్వవిద్యాలయాలు ప్రత్యామ్నాయ బోధన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఏ దేశ ప్రగతికైనా ఉన్నత విద్య కీలకం. నవకల్పనలు, శాస్త్రసాంకేతిక పరిశోధనలకు ఉన్నత విద్యాలయాలు వేదికలవుతున్నాయి. చోదక (డ్రైవర్) రహిత వాహనాలు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, హెచ్‌ఐవీకి మందుల మిశ్రమంతో చికిత్స వంటి నవకల్పనలు విశ్వవిద్యాలయాల్లోనే ఉద్భవించాయి. లాక్‌డౌన్‌వల్ల స్మార్ట్‌ఫోన్ల ద్వారా అంతర్జాల విద్యాబోధన, అభ్యాసాలు ఊపందుకున్నాయి. గూగుల్ క్లాస్‌రూమ్, బ్లాక్ బోర్డ్, వెబెక్స్, జూమ్, కోర్సెరా, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి సాంకేతిక యాప్‌లు ఆన్‌లైన్ విద్యావిప్లవానికి వాహకాలవుతున్నాయి. 2021కల్లా భారతదేశంలో ఆన్‌లైన్ విద్య దాదాపు రూ.15 వేలకోట్ల పరిశ్రమగా అవతరిస్తుందని అంచనా. ఆన్‌లైన్ విద్య కింద అంతర్జాల వీడియో ఆధారిత కోర్సులు, ఈ-బుక్స్, సిమ్యులేషన్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, యానిమేషన్, పజిల్స్ వంటి అంశాలతో విద్యాబోధన ఆసక్తికరంగా సాగుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆన్‌లైన్ పాఠాలు, అభ్యాసాలను తయారుచేయాల్సిన బాధ్యత అధ్యాపక వర్గంపై పెరుగుతుంది. ఇందుకోసం వారు తగిన శిక్షణ పొందాలి. ప్రభుత్వం, విద్యాసంస్థల నుంచి వారికి ప్రోత్సాహకాలు లభించాలి. వాట్సాప్, యూట్యూబ్, టెడ్, వెబెక్స్, జూమ్, గూగుల్ మీట్ వంటి వేదికల నుంచి అంతర్జాల తరగతుల నిర్వహణ తర్ఫీదు పొందాలి. విద్యార్థుల పురోగతి బేరీజు వేయడానికి చాట్స్ తదితర వర్చువల్ సాధనాలను ఉపయోగించవచ్చు ఇందుకు క్లౌడ్ సాంకేతికతలు ఎంతో ఉపకరిస్తాయి.
కొత్త ధోరణులు
ఆన్‌లైన్ విద్యకు సాంకేతిక ఊతం విద్యా సంవత్సరంలో కొంతకాలంపాటు స్మార్ట్ తరగతి గదుల్లో చదవాల్సిన రోజులు వచ్చేస్తున్నాయి. ప్రొజెక్టర్లు, వైర్‌లెస్ డిస్‌ప్లే తెరలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ఐప్యాడ్‌లు, లేజర్ పాయింటర్లు, వైఫై, యూఎస్‌బీ పెన్‌డ్రైవ్‌ల రంగప్రవేశంతో నల్లబల్లలు, సుద్దముక్కలు కనుమరుగు కానున్నాయి. తరగతి గదుల్లో వైఫై కనెక్షన్లు తప్పనిసరి అవుతున్నాయి. గ్రామాల్లో ఉన్నతశ్రేణి అర్హతలు, అనుభవం గల అధ్యాపకుల అందుబాటు తక్కువ కాబట్టి వారు పట్టణాల నుంచి ఆన్‌లైన్ ద్వారా గ్రామీణ విద్యార్థులకు తరగతులు నిర్వహించడం సులువు. గ్రామీణ విద్యార్థులకు క్లౌడ్ తరగతులు ఎంతో అక్కరకొస్తాయి. మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకూ అంతర్జాలంలో వీడియో పాఠాలు, చాట్ భేటీలు నిర్వహించడం తేలిక. తక్షణ లిఖిత, వీడియో సందేశాలు విద్యార్థుల మధ్య, ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య అనుసంధానం ఏర్పరుస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోట్లమంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ప్రచురించి అందించడం ఖర్చుతో కూడిన పని. ఆన్‌లైన్ పాఠాల ద్వారా ఆ వ్యయం తగ్గించుకోవచ్ఛు క్లౌడ్ ఆధారిత పాఠ్యపుస్తకాలను తరచూ సులభంగా సవరించుకోవచ్ఛు అత్యంత తాజా అభ్యసన సమాచారాన్ని విద్యార్థులకు అందించవచ్ఛు కృతిమ మేధ వినియోగం ద్వారా ప్రతి విద్యార్థిపైనా ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టవచ్ఛు పరీక్షల నిర్వహణ కూడా ఆన్‌లైన్‌కు వ్యాప్తి చెందనుంది. కాలసూచిక (టైమర్) పెట్టుకుని నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రాన్ని పూర్తిచేయవచ్ఛు వారి జవాబులను స్వయంచాలిత పద్ధతిలో మూల్యాంకనం చేసి మార్కులు వేయవచ్ఛు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరును కృత్రిమ మేధ (ఏఐ)తో నమోదు చేయవచ్ఛు ముఖగుర్తింపు సాధనాన్ని ఉపయోగించి ఏఐ హాజరు వేస్తుంది. బయటి వ్యక్తులు విద్యాసంస్థ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోకి చొరబడకుండా అడ్డుకొంటుంది. మానవ పర్యవేక్షణ లేకుండా పరీక్షలనూ నిర్వహించగలదు. విద్యార్థుల ప్రవర్తన, అభ్యసన సామర్థ్యం, వారి పనితీరులను నిష్పాక్షికంగా అంచనా వేయడానికి ఏఐ ఎంతో తోడ్పడుతుంది. వర్చువల్ రియాలిటీ కళ్లద్దాలు విద్యాభ్యాసానికి అమోఘంగా తోడ్పడతాయి. ఉదాహరణకు జీవశాస్త్ర విద్యార్థుల కళ్లెదుట త్రీడీ అస్థిపంజరాన్ని నిలిపి, అస్థికల గురించి క్షుణ్నంగా బోధించే సౌలభ్యాన్ని ‘వర్చువల్ రియాలిటీ’ అందిస్తుంది.
భవిష్యత్తులో ఉన్నత విద్య
డేటా విశ్లేషణ సామర్థ్యం కలిగిన 'ఏఐ ట్యూటర్లు' విద్యార్థులు ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో కనిపెట్టి ఆ లోపాన్ని సరిదిద్దుతాయి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు కోడింగ్, రోబాటిక్స్ నేర్చుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ఉన్నత విద్యాలయాల్లో అధ్యాపకుల స్థానాన్ని ఏఐ ట్యూటర్లు ఆక్రమించే రోజూ త్వరలో రావచ్ఛు మున్ముందు విద్యాలయాల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) రంగ ప్రవేశం చేస్తుంది. విద్యార్థులు ఐఓటీని ఉపయోగించేటప్పుడు ఉత్పన్నమయ్యే డేటాను విశ్లేషించి విద్యా బోధనకు మరింత పదును పెట్టవచ్ఛు విదేశీ విద్యాసంస్థల మాదిరిగా ఆన్‌లైన్ డిగ్రీలను అందించడానికి భారత ప్రభుత్వం స్వదేశీ వర్సిటీలను అనుమతించనుంది. కాబట్టి మున్ముందు మన విశ్వవిద్యాలయాలు అధునాతన కంప్యూటర్లు, ఇతర సాధన సంపత్తిని, హైస్పీడ్ ఇంటర్నెట్‌ను సమకూర్చుకోవాలి. విద్యార్థులూ అలాంటి సౌకర్యాలను అందిపుచ్చుకోవాలి. మొత్తం మీద భారతీయ విద్యారంగ స్వరూపస్వభావాలను అధునాతన సాంకేతికత సమూలంగా మార్చేయబోతోంది.
- డాక్టర్ కె.బాలాజీరెడ్డి (రచయిత- సాంకేతిక విద్యారంగ నిపుణులు)