ETV Bharat / opinion

సాంకేతికతకు దూరంగా వృద్ధులు- యువత చొరవే కీలకం

పిల్లలు, యువకులు, నడివయస్కులు సాంకేతికతను అందిపుచ్చుకొంటున్నా- వృద్ధులకు ఇవి సమస్యాత్మకమవుతున్నాయి. ఆన్​లైన్​ పద్ధతులు, డిజిటల్​ విధానాలు క్రయవిక్రయాలు, చెల్లింపుల సేవల్ని పొందేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. డిజిటల్‌ నిరక్షరాస్యతే ఇందుకు కారణం!

technology
సాంకేతికతకు దూరంగా వృద్ధులు- యువత చొరవే కీలకం
author img

By

Published : Oct 2, 2020, 8:18 AM IST

సాంకేతిక పరిజ్ఞానం మానవుడి జీవనశైలిని సులభతరం చేస్తోంది. ఆన్‌లైన్‌ పద్ధతులు, డిజిటల్‌ విధానాలు క్రయవిక్రయాలు, చెల్లింపుల సేవలన్నింటినీ అరచేతిలోకి తెచ్చాయి. కరోనా కాలంలో ఈ కార్యకలాపాలు మరింత పుంజుకొన్నాయి. పిల్లలు, యువకులు, నడివయస్కులు వీటిని అందిపుచ్చుకొంటున్నా- వృద్ధులకు ఇవి సమస్యాత్మకమవుతున్నాయి. సౌకర్యాలు పొందడానికి అష్టకష్టాలు పడుతున్నారు. డిజిటల్‌ నిరక్షరాస్యతే ఇందుకు కారణం!

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు రానున్న అయిదేళ్లలో ఇప్పటికన్నా మూడింతలు అధికం కానున్నాయని బెంగళూరులోని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ సంస్థ సర్వేలో తేలింది. భారత్‌లో 2019-20లో రూ.2,162 లక్షల కోట్ల విలువైన డిజిటల్‌ చెల్లింపులు జరిగాయి. 2025నాటికి ఈ మొత్తం రూ.7,092 లక్షల కోట్లకు చేరనుందన్నది అంచనా. దేశంలో ప్రస్తుతం ఉన్న 16.2కోట్ల మొబైల్‌ చెల్లింపుదారుల సంఖ్య 2025నాటికి 80 కోట్లకు పెరగనుంది. వీరిలో వృద్ధులు లేకపోవడమే ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వృద్ధులకే ఎంతో అవసరం. చిన్నపాటి చొరవతో ఎన్నో సౌలభ్యాలు వారు పొందవచ్చు. పెద్దగా శారీరక శ్రమ లేకుండా ఇంటివద్ద నుంచే తమ పనులను వారు స్వయంగా చక్కబెట్టుకోవచ్చు. మందుల కొనుగోళ్లు, బ్యాంకు లావాదేవీలు సులభంగా జరుపుకోవచ్చు. కొవిడ్‌ కాలంలో ఆరోగ్యపరంగానూ వారికి ఇదెంతో అవసరం. అందువల్ల డిజిటల్‌ అక్షరాస్యత వైపు వారు అడుగులు వేయాలి.

చైనాలో 85.4 కోట్లమంది అంతర్జాలాన్ని వాడుతున్నారు. తరవాతి స్థానంలో భారత్‌ (56 కోట్లు) ఉంది. వయసువారీగా వాడకందారుల నిర్ధారణ కోసం ఇంటర్‌నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎమ్‌ఏఐ), నీల్సన్‌ సంస్థలు నిరుడు సంయుక్త సర్వే నిర్వహించాయి. దీనిప్రకారం 50 ఏళ్లకు పైబడినవారు ఆరుశాతమే అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు కొన్ని నెలల ముందు హెల్పేజ్‌ ఇండియా సంస్థ దిల్లీ, ఒడిశా, తమిళనాడు, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, ఉత్తరాఖండ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సర్వే జరిపింది. 1,580 మంది వృద్ధులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో 60 శాతానికిపైగా డిజిటల్‌ నిరక్షరాస్యులు ఉన్నారు. తెలంగాణలో 400 మంది వృద్ధుల్లో దాదాపు 240మంది, తమకు ఇంటర్‌నెట్‌ను వినియోగించడం, యూట్యూబ్‌ చూడటం, గూగుల్‌ సెర్చ్‌, డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌లో నిత్యావసరాలను ఆర్డర్‌ చేయడం తెలియదని చెప్పారు. ఉద్యోగ ఉపాధుల కోసం పిల్లలు దేశవిదేశాలకు వలసబాట పడుతుంటే ఇంటివద్ద కాలం వెళ్లదీసేది వృద్ధులే. ఈ నేపథ్యంలో సులభంగా నేర్చుకోదగిన సాంకేతికతను వృద్ధులు అలవరచుకోవడం ఎంతో అవసరం. వీటిపై వృద్ధులకు అవగాహన కల్పించగలిగితే దైనందిన జీవితంలో వారెదుర్కొనే అనేక కష్టాల నుంచి ఉపశమనమూ లభిస్తుంది. ఈ విషయంలో యువకులైన కుటుంబ సభ్యులు చొరవ తీసుకోవాలి. అదే కొరవడుతోందని అధ్యయనాలు స్పష్టీకరిస్తున్నాయి.

అందరికీ సాంకేతిక పరిజ్ఞానం లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ‘జాతీయ డిజిటల్‌ అక్షరాస్యత మిషన్‌’(ఎన్‌డీఎల్‌ఎం) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 2017 ఫిబ్రవరిలో చేపట్టిన ప్రధానమంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌ (పీఎమ్‌దిశ) కింద నిరుటి మార్చి వరకు ఆరు కోట్లమందిని డిజిటల్‌ అక్షరాస్యులుగా మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కాని, గత ఏడాది చివరి వరకు 2.56 కోట్లమంది మాత్రమే డిజిటల్‌ అక్షరాస్యులయ్యారు. ఈ కార్యక్రమంలో వృద్ధులను డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న అంశం లేకపోవడం పెద్దలోపం. ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌, హెల్పేజ్‌ ఇండియా ఫౌండేషన్‌ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పలు పట్టణాల్లో వృద్ధులను డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ముందుకు వచ్చాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో సందేశాలు చూడటం, వాటిని పంపించడం, ఆన్‌లైన్‌లో నిత్యావసరాలను ఆర్డర్‌ చేయడం, క్యాబ్‌ బుకింగ్‌, గూగుల్‌ సెర్చ్‌, డిజిటల్‌ పేమెంట్స్‌ చేయడం, యూట్యూబ్‌ చూడటం, స్కైప్‌ను వినియోగించడం... తదితరాలపై అవగాహన కల్పిస్తున్నాయి. డిజిటల్‌ అక్షరాస్యత పెరుగుదల వల్ల బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు, కరోనా కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో తెలంగాణలో అంగన్‌వాడీ కార్యకర్తలకు పోషకాహారం నిల్వ, పంపిణీ వివరాలను వాట్సాప్‌ ద్వారా అందజేస్తున్నారు. వాటికి తగిన విధంగా స్పందించేలా కార్యకర్తలకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుతున్నారు. ఇదే తరహాలో గ్రామాల్లోని వృద్ధులకు ఇంటర్‌నెట్‌, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై వివరించాల్సిన అవసరం ఉంది. పట్టణాలు, గ్రామాల్లోని విద్యార్థులు, యువకులు ఒక్కొక్కరు ఒక్కో వృద్ధుణ్ని డిజిటల్‌ అక్షరాస్యుడిగా మలచే బాధ్యతను స్వీకరించాలి. ప్రభుత్వాలు ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి.

- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.