ETV Bharat / opinion

ముంచుతున్న మానవ తప్పిదాలు

బంగాళాఖాతంలో ప్రభవించే అల్పపీడనాలు తీవ్ర వాయుగుండాలుగా మారిన ప్రతిసారీ తెలుగువారి గుండె కన్నీటి సుడుల్లో చిక్కుకుంటూనే ఉంది. రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రకృతి ఉత్పాతాల్ని నిలువరించడం మానవ మాత్రులకు సాధ్యం కాకపోయినా, వాటి తాలూకు నష్టాల్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేసేలా ప్రణాళికాబద్ధ చర్యలకు ప్రభుత్వాలు సంకల్పించాలి!

Natural disasters
ముంచుతున్న మానవ తప్పిదాలు
author img

By

Published : Oct 15, 2020, 7:54 AM IST

సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నెలరోజుల్లో నమోదయ్యే వర్షపాతం పట్టుమని కొన్ని గంటల వ్యవధిలోనే కుంభవృష్టిగా పడితే జనజీవనం ఎంతగా దుర్భర దుఃఖ భాజనం అవుతుందో నేడు కళ్లకు కడుతోంది. బంగాళాఖాతంలో ప్రభవించే అల్పపీడనాలు తీవ్ర వాయుగుండాలుగా మారిన ప్రతిసారీ తెలుగువారి గుండె కన్నీటి సుడుల్లో చిక్కుకుంటూనే ఉంది. తీరప్రాంత జిల్లాలను రెండు రోజులు వణికించిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం తీరం దాటి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. వాగులు వంకలను ఏకం చేసేలా 10-20 సెం.మీ. వానలతో ఏపీలో ఏడు జిల్లాల్ని ముంచెత్తిన వాయుగండం లోతట్టు ప్రాంతాల్నే కాదు, రెండు లక్షల ఎకరాల్లో పంటల్నీ నీటి కోరలతో కాటేసింది. మధ్యాహ్నానికి ఖమ్మం చేరిన ఉపద్రవం, సాయంత్రానికి హైదరాబాద్‌పై విలయ సదృశంగా విరుచుకుపడింది. వందేళ్లలో అత్యధిక వర్షపాతం రికార్డు 1983 అక్టోబరులో ఇరవై నాలుగ్గంటల వ్యవధిలో 35.5 సెం.మీ.గా నిజామాబాద్‌ పేరిట ఉంది. దాన్ని చెరిపేయాలన్నంత కసిగా పన్నెండు గంటల్లో హైదరాబాద్‌లో 32 సెం.మీ. వర్షపాతం భాగ్యనగర వాసుల్ని బెంబేలెత్తించింది.

మహానగరవ్యాప్తంగా చాలా చోట్ల పాతిక సెంటీమీటర్లకుపైగా కుంభవృష్టితో జనజీవనం సంక్షుభితమైపోయింది. తెలంగాణలో ఆరు జిల్లాలకు పెను ప్రమాదంగా పరిణమించిన విపత్తు- అయిదు జిల్లాల్లో తీవ్ర పంట నష్టానికి కారణమైంది. అనేకచోట్ల రహదారి వ్యవస్థను కోసేసి, పొంగిపొర్లే చెరువులు, దొరువులు, నాలాలతో వరద గండాన్ని సాక్షాత్కరింపజేసిన వాయుగుండం క్రమంగా ఉపశమిస్తున్నా- అది నేర్పుతున్న గుణపాఠాలు లెక్కలేనన్ని! ప్రకృతి ఉత్పాతాల్ని నిలువరించడం మానవ మాత్రులకు సాధ్యం కాకపోయినా, వాటి తాలూకు నష్టాల్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేసేలా ప్రణాళికాబద్ధ చర్యలకు ప్రభుత్వాలు సంకల్పించాలి!

మూడో స్థానంలో భారత్​..

ప్రకృతి విపత్తుల తాలూకు ముప్పు తీవ్రత తగ్గింపే లక్ష్యంగా 1989నుంచి ఐక్యరాజ్య సమితి ఏటా అక్టోబరు 13వ తేదీని అందుకోసం ప్రత్యేకించింది. కాకతాళీయమే అయినా అదే రోజున తీవ్ర వాయుగుండం ఉభయ తెలుగు రాష్ట్రాలనూ వణికించింది. 1980-2000 సంవత్సరాలతో పోలిస్తే, దరిమిలా రెండు దశాబ్దాల్లో ప్రకృతి విపత్తుల జోరు పెరిగిందంటున్న సమితి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా ముందస్తు హెచ్చరికలతో ప్రాణనష్టాన్ని పరిమితం చేయగలుగుతున్నా, ఆర్థిక నష్టాలు ఇంతలంతలవుతున్నాయని తాజాగా నివేదించింది. భూతాపంలో 1.1 సెంటీగ్రేడు పెరుగుదల పర్యవసానంగా సంభవిస్తున్న ఈ విపత్తుల తాకిడిలో చైనా, అమెరికాల తరవాత మూడో స్థానంలో ఇండియా ఉందని, గత 20 ఏళ్లలో 320కిపైగా ప్రకృతి ఉత్పాతాలకు గురై భారత్‌ ఎకాయెకి మూడు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని సమితి నివేదికాంశాలు ఘోషిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల్లో వరదల వాటా 44శాతం కాగా, ఏటా సగటున 17 భీకర వరదలతో ఇండియా రెండో స్థానంలో నిలుస్తోంది. వాయుగుండం ఉరిమినప్పుడల్లా వరద పోటెత్తి మహానగరాలు చిగురుటాకుల్లా వణికిపోవడానికి చెరువులూ కుంటల్ని ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూ సాగిన నగరీకరణే కారణమని నిపుణులు మొత్తుకొంటున్నారు. 2000 సంవత్సరం నాటి హైదరాబాద్‌ వరదలకు కారణాల్ని విశ్లేషించిన కిర్లోస్కర్‌ కమిటీ- నాలాలపై ఆక్రమణల తొలగింపు, లోతుపెంపు, కొన్ని చోట్ల దారి మళ్ళింపుల్ని సిఫార్సు చేసింది. ఆ విధంగా చూస్తే మానవ తప్పిదాలే నగరాల్ని ముంచుతున్నాయి. పోనుపోను ప్రాణాంతకంగా మారుతున్న విపత్తుల తీవ్రత తగ్గాలంటే, ఈ మానవ తప్పిదాల్ని సరిదిద్దాల్సిందే. తీరంలో మడ అడవుల పెంపకంనుంచి, వరద నివారణ వ్యవస్థల బలోపేతం దాకా శాస్త్రీయ పరిష్కారాలకు ప్రభుత్వాలు నిబద్ధం కావాల్సిందే!

ఇదీ చూడండి: చెరువుల ఆక్రమణే ఈ దుస్థితికి కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.