Myanmar teak export: అమెరికాకు చెందిన కొన్ని వ్యాపార సంస్థలు మయన్మార్ నుంచి అక్రమంగా టేకును దిగుమతి చేసుకోవడం ద్వారా అక్కడి జుంటాను (సైనిక ప్రభుత్వాన్ని) పరోక్షంగా పెంచి పోషిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మయన్మార్‌లో పెరిగే టేకుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఆ కలపతో అమెరికాలో సంపన్నులకోసం విలాసవంతమైన చిన్న ఓడలను తయారు చేస్తున్నారు. టేకు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంతో బలపడుతున్న జుంటా ప్రజలపై దాష్టీకాలకు తెగబడుతోందని మయన్మార్ ప్రజల సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కృషిచేసే 'జస్టిస్ ఫర్ మయన్మార్' గ్రూపు పేర్కొంటోంది.
Burma teak export:
గతేడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో పదేళ్ల ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ టాట్మడవ్ (మయన్మార్ సైన్యం) అధిపతి జనరల్ మిన్ ఆంగ్ లాయింగ్ సైనిక తిరుగుబాటుతో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. కలప ఎగుమతుల ద్వారా జుంటాకు నిధులు అందే అవకాశం ఉందని గ్రహించిన అమెరికా, గత ఫిబ్రవరి నుంచే మయన్మార్ టింబర్ ఎంటర్‌ప్రైజెస్ (ఎంటీఈ)పై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంస్థ అయిన ఎంటీఈ ఒక్కటే వేలంపాట ద్వారా ప్రైవేటు కంపెనీలకు కలపను విక్రయిస్తుంటుంది. ఆంక్షలు ఉన్నప్పటికీ, అగ్రరాజ్యంలో మయన్మార్ కలపకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని అక్కడి సంస్థలు అడ్డదారిలో కలపను తరలిస్తున్నాయని జస్టిస్ ఫర్ మయన్మార్ గ్రూపు పేర్కొంటోంది. కలప విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అధికంగా జుంటాయే తీసుకొంటోందని, అలా బలం పుంజుకొంటున్న సైన్యం- ప్రజలపై మారణకాండకు తెగబడుతోందని ఆరోపిస్తోంది. చిన్నపిల్లలపైనా హత్యాకాండ సాగిస్తోందని వాపోతోంది.
Burma teak Myanmar military
గతేడాది ఫిబ్రవరి నుంచి మయన్మార్‌లో జుంటా రాక్షస క్రీడలో దాదాపు 1,400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పదివేల మందికి పైగా జైళ్లలో మగ్గుతున్నారు. స్థానికంగా కొన్ని సాయుధ సంస్థలు జుంటా పాలనపై తిరుగుబాటు ప్రకటించడంతో ప్రస్తుతం అక్కడ అంతర్యుద్ధ ఛాయలు నెలకొన్నాయి. గతేడాది జనవరి-నవంబరు మధ్యలో అమెరికా సంస్థలు మయన్మార్ నుంచి దాదాపు 1,600 టన్నుల టేకును తరలించుకుపోయినట్లు జస్టిస్ ఫర్ మయన్మార్ గ్రూపు చెబుతోంది. జుంటాకు నిధులు దక్కకుండా మయన్మార్ నుంచి అన్నిరకాల కలప దిగుమతులను అగ్రరాజ్యం నిషేధించాలని డిమాండు చేస్తోంది.
బర్మా టేకు.. ప్రపంచంలోనే బెస్ట్!
Burma Teak US Exports
మయన్మార్‌లో పెరిగే టేకును ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా భావిస్తారు. కొన్నేళ్లుగా విపరీతంగా నరికివేతకు గురవుతుండటంతో అక్కడి టేకువృక్షాలు క్రమంగా తరిగిపోతున్నాయి. మయన్మార్‌లో జుంటా బలపడితే భారత్‌కు సైతం తలనొప్పులు తప్పవు. ఈశాన్య భారతంలోని సాయుధులకు మయన్మార్ సైన్యంతో దోస్తీ కుదిరింది. దాని ద్వారా ఆయుధాలు సమకూర్చుకొని ఆ వేర్పాటువాద శక్తులు ఈశాన్యంలో కల్లోల పరిస్థితులు సృష్టించవచ్చు. మరోవైపు డ్రాగన్ దేశమూ జుంటాతో బంధాన్ని బలోపేతం చేసుకుంది. దానికి భారీయెత్తున ఆయుధాలు సరఫరా చేస్తోంది. మయన్మార్ ద్వారా భారత ఉగ్రముఠాలకు దన్నుగా నిలిచి దేశీయంగా ఇబ్బందులు సృష్టించాలని చైనా యత్నిస్తోంది. ఈ తరుణంలో మయన్మార్ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తూ, దేశ భద్రతా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలి. ఈశాన్యంలో బాహ్యశక్తుల ప్రమేయాన్ని నిలువరించాలి.
- సంజీవ్ కె.బారువా
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: షాకిచ్చిన పాక్ పైలట్.. విమానాన్ని అత్యవసర ల్యాండ్ చేసి..!