దేశ సార్వభౌమత్వానికి, పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చింది. భారత్‌లో పబ్‌జీకి 50 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఇందులో 33 కోట్ల మంది నిత్యం దీన్ని ఆడేవారేనన్న లెక్కలు గేమింగ్ రంగంలో భారతీయులకున్న ఆసక్తిని చాటుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే మన దేశంలో ఏకంగా 17.5 కోట్ల మంది పబ్‌జీని డౌన్‌లోడ్‌చేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతేకాదు- ఏటా 300 కోట్ల గేమింగ్ యాప్ డౌన్‌లోడ్లతో భారత్ ముందంజలో ఉంది. ఇంత ఆదరణ ఉన్న గేమింగ్ రంగంలో మన సత్తా ఎంతన్నది తరచి చూసుకుంటే మాత్రం వెనకబాటుతనమే కనిపిస్తోంది. ఒకప్పుడు ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలవారే వీటిని ఆడగలిగేవారు. గడిచిన నాలుగేళ్లలో దేశంలో మొబైల్ డేటా చౌకయ్యింది. స్మార్ట్‌ఫోన్లు సామాన్యులకు అందుబాటు ధరలో దొరుకుతున్నాయి.
మొబైల్ ఫోన్ వేదికగా గేమింగ్ రంగం..
ఇవాళ దేశంలో 56 కోట్ల మంది అంతర్జాలం వినియోగిస్తుంటే అందులో 85 శాతానికి పైగా సెల్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌వాడేవారే. దీంతో గేమింగ్‌రంగం మొబైల్‌ఫోన్ వేదికగా వర్ధిల్లుతోంది. భారత్‌లో 75 శాతం 45 ఏళ్లలోపు వారే కావడమూ ఈ రంగం విస్తృతికి కారణమవుతోంది. 2021 నాటికి దేశంలో ఆన్‌లైన్‌లో ఆటలాడేవారి సంఖ్య 62.8 కోట్లకు చేరుతుందని, దాంతో పాటే ఆన్‌లైన్ గేమింగ్ వ్యాపారం ఏడు వేల కోట్ల రూపాయలకు పైబడుతుందని గూగుల్ కేపీఎంజీ అంచనా. 2023 నాటికి రూ.11వేల కోట్లు దాటుతుందనీ చెబుతున్నారు.
అవకాశాలున్నా... అందుకోవడం లేదు!
వినోద రంగంలో సినిమా, టీవీలను ఎప్పుడైతే మొబైల్‌ఫోన్‌దాటేసిందో అప్పుడే గేమింగ్‌రంగానికి మహర్దశ మొదలయింది. దేశంలో ఇవాళ అంతర్జాలం వినియోగిస్తున్నవారి సంఖ్య 56 కోట్లు. ఇందులో దాదాపు 67 శాతం పురుషులే కావడం, వారిలోనూ యువతే ఎక్కువగా ఉండటం- ఆన్‌లైన్‌గేమింగ్‌లో బహుళ అవకాశాలకు ద్వారాలు తెరుస్తోంది. దేశంలో ఇప్పటికీ ఆటలను అభివృద్ధి చేసే కంపెనీలు 275 మాత్రమే ఉన్నాయి. మన దగ్గర గేమింగ్‌రంగం పెద్దగా రాబడులను సాధించలేకపోవడానికి చాలా కారణాలున్నాయి. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గేమింగ్‌యాప్‌లను డబ్బులు పెట్టి కొనుక్కునేవారు, చందారూపంలో డబ్బులు చెల్లించేవారు దేశంలో చాలా తక్కువ. ఒక డిజిటల్‌గేమ్‌తయారు చేసి, అభివృద్ధి చేశాక దాన్నుంచి డబ్బు సంపాదించడానికి రెండు రకాల పద్ధతులున్నాయని చెబుతున్నారు. '99 గేమ్స్' ముఖ్య కార్యనిర్వహణాధికారి రోహిత్‌భట్. ఇందులో ఒకటి- ఆ యాప్‌ను ప్లే స్టోర్‌లేదా యాపిల్‌ఐ స్టోర్‌లో పెట్టి అమ్మడం. లేదంటే యాప్‌ఉచితంగా ఇచ్చేసి ఆ తరవాత అందులో ఏదైనా అదనపు సౌకర్యాలు కల్పించడానికి డబ్బులు వసూలు చేయడం. ఈ రెండో పద్ధతిని 'ఫ్రీమియం' నమూనా అంటారు.
1000లో 10 మంది మాత్రమే..
ప్రస్తుతం మన దేశంలో గేమింగ్ కంపెనీలన్నీ దీన్నే అనుసరిస్తున్నాయి. అయితే ఇక్కడే మన గేమింగ్ వ్యాపారం దెబ్బతింటోంది. అమెరికాలో 1,000 మంది ఒక ఆన్‌లైన్ గేమ్ ఆడుతుంటే అందులో కనీసం 100 మంది డబ్బులు పెట్టి అందులో అదనపు సౌకర్యాలు పొందుతారు. భారత్‌లో 1,000 మందిలో 10 మంది మాత్రమే కొంటారు. ఇక యాప్ కొనాలంటే అసలు మనవాళ్లు వాటి జోలికే పోరని రోహిత్‌భట్ చెబుతున్నారు. అందుకే కోట్ల మంది గేమింగ్‌పై ఆసక్తి చూపుతున్నా, ఊహించిన స్థాయిలో ఆర్థికాభివృద్ధి లేదు. ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే ప్రతికూలాంశం. భారత్‌లో విదేశీ నేపథ్యంలో వచ్చే ఆటలనే ఆదరించడం కూడా కొంత సమస్యే.
సమన్వయ నైపుణ్యాలకు పదును
ఇండియాలో గేమింగ్‌వ్యాపారం 2020 చివరికి రూ.6,530 కోట్లకు చేరుతుందని గణాంక సంస్థ స్టాటిస్టా అంచనా. అమెరికాలో ఇదే సమయానికి ఈ వ్యాపారం రూ.15 లక్షల కోట్లు దాటిపోతుందని లెక్కగట్టింది. మన దగ్గర గేమింగ్‌అంటే కేవలం కాలక్షేపమే. అమెరికా, యూకేలాంటి దేశాల్లో పూర్తిస్థాయి వృత్తి. గేమ్‌రూపకర్తలు, దాన్ని అభివృద్ధి పరిచేవాళ్లు, పెట్టుబడిదారులు, నిర్వాహక కంపెనీలు, ఆటగాళ్లు, పోటీలు నిర్వహించేవారు... అదంతా ఒక పెద్ద వ్యవస్థ. ఆన్‌లైన్‌గేమ్స్‌లోనూ భారీగా పోటీలు నిర్వహిస్తుంటారు. వాటిలో గెలిస్తే వచ్చే బహుమతి మొత్తం కూడా చాలా భారీ స్థాయిలో ఉంటుంది. ఎపిక్‌గేమ్స్‌ఫోర్ట్‌నైట్2019లో నిర్వహించిన రెండు ఆన్‌లైన్‌పోటీల్లో విజేతలకు ఇచ్చిన బహుమతి మొత్తం రూ.470 కోట్లు. అందుకే క్రికెట్, ఫుట్‌బాల్‌మాదిరిగా వీటిలోనూ ప్రొఫెషనల్‌ఆటగాళ్లుంటారు.
సదభిప్రాయం లేకనే..
లీగ్ ఆఫ్ లెజెండ్స్ పేరుతో రియోట్ గేమ్స్‌అనే కంపెనీ రూపొందించిన ఓ ఆన్‌లైన్‌గేమ్ గతేడాది ఏకంగా 11వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది మన దేశంలో మొత్తం గేమింగ్ రంగం ఏడాదిన్నర ఆదాయానికి సమానం. మన దేశంలో డిజిటల్ గేమ్స్ అంటే తల్లిదండ్రుల్లో సదభిప్రాయం లేదు. పిల్లలు దానికి బానిసలవుతున్నారని, కంటిచూపు దెబ్బతింటుందని వాళ్లను ఆడకుండా నిరుత్సాహ పరుస్తుంటారు. గేమ్స్‌ఆడటం వల్ల పిల్లల్లో సృజన, చురుకుదనం పెరుగుతాయని, ఒకేసారి ఎక్కువ అంశాలను సమన్వయం చేసుకోగలిగే (మల్టీటాస్కింగ్) నైపుణ్యం అలవడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సృజనాత్మక రంగంలో ఉపాధి విదేశాల్లో బాగున్నా మనలాంటి దేశాల్లో దానివల్ల ఎంత సంపాదించగలమన్న భావన తల్లిదండ్రుల్లో ఉందని, అది పోవాలంటే ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగాలనేది నిపుణుల మాట.
ఆశావహ పరిణామాలు
భారత దేశంలో డిజిటల్‌గేమింగ్‌కు ఎంతో ఆదరణ ఉందని, అందుకే మనదైన ఇతివృత్తంతో వాటిని తయారు చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ‘మన్‌కీ బాత్’లో పిలుపిచ్చారు. మన పౌరాణిక, జానపథ గాథలు, సంస్కృతీ సంప్రదాయాల నుంచి ఇందుకోసం ఎన్నో ఆలోచనలు సృష్టించుకోవచ్చని ఆయన సూచించారు. డిజిటల్‌గేమింగ్‌రంగంలోనూ ‘ఆత్మనిర్భర్‌భారత్’కి మోదీ ఇచ్చిన పిలుపునకు మనవాళ్లు ముందుకొస్తుండటం ఇప్పుడు ఆశావహ పరిణామం. ప్రధాని పిలుపు మేరకు ఫౌజీ (ఫియర్‌లెస్‌అండ్‌యునైటెడ్‌గార్డ్స్) పేరుతో ఒక ఆన్‌లైన్‌గేమ్‌ను త్వరలోనే తీసుకొస్తున్నామని తాజాగా ఎన్‌కోర్‌గేమ్స్‌అనే దేశీయ సంస్థ ప్రకటించింది. బాలీవుడ్‌కథానాయకుడు అక్షయ్‌కుమార్‌దీనికి మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.
భారతీయ సైన్యం సాహసాలే ఇతివృత్తంగా ఈ ఫౌజీ గేమ్‌ను రూపొందించామని ఎన్‌కోర్‌గేమ్స్ సీఈవో విశాల్‌గొండల్‌ప్రకటించారు, దీని ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని భారత్‌కా వీర్(భారతీయ యుద్ధవీరులకు మద్దతుగా రక్షణశాఖ నడుపుతున్న సంస్థ)కు విరాళంగా ఇస్తామని ఆయన ప్రకటించడం విశేషం. ఓగ్రి హెడ్ స్టూడియోస్ 2018లో రూపొందించిన 'అసుర' అనే డిజిటల్‌గేమ్‌సాధించిన విజయాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా వచ్చే పదేళ్లలో గేమింగ్ రంగంలో విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. మొబైల్ విస్తృతితో గ్రామీణ ప్రాంతాల్లోనూ గేమింగ్‌పై ఆసక్తి పెరుగుతుండటంతో భవిష్యత్తు ఆశాజనకంగా ఉండగలదని భావిస్తున్నారు!
- శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కొండవీటి, రచయిత
ఇదీ చదవండి: 'సెప్టెంబర్ చివరి నాటికి 65 లక్షల కరోనా కేసులు