లాక్‌డౌన్‌కు అక్కడక్కడా తూట్లు పడటంతో అరకొర అనుకున్న మహమ్మారి ఇంతింతై అన్నట్టు వ్యాప్తి మొదలెట్టింది. ఇప్పుడు ఆ మహమ్మారి కబళింపు పెరుగుతున్న దశలో, మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన సమయంలో ‘హాట్‌స్పాట్’లను వదిలి మిగిలిన చోట్ల మినహాయింపులనడంలోని ఉచితానుచితాలను కాలమే నిర్ణయించాలేమో!
ఆ సమయంలో నిద్ర పోతుందా
వరదలు తుపానులు వచ్చినప్పుడు నిత్యావసరాల కోసమని జనాలు రోజూ బయటికి వెళతారా... లేదే! మరెందుకు ఒక ప్రణాళికాబద్ధంగా కాక ప్రతి రోజూ కొన్ని గంటలపాటు ప్రతిచోటా దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతించారు? ఆ సమయంలో కరోనా నిద్ర పోతానని చెప్పిందా? నిజానికి మొదట్లోనే మరింత కట్టుదిట్టంగా వ్యవహరించి ఉంటే ఈ రోజు దేశంలో ఇన్ని కరోనా కేసులుండేవి కాదు. దిల్లీ నుంచి వచ్చిందని ఎవరో ఒకరి మీదకి తోసేసి మిగతా అంతా బాగే అనుకుంటే కాదనేందుకు ఏమీ లేదు. అయితే అది దిల్లీకి ఎలా వచ్చింది? అక్కడినుంచి దేశమంతటా ఎలా విస్తరించింది? నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది? లోపించిందేమిటో వేరే చెప్పనవసరం లేదు.
నెత్తిమీద గూడు దూరమై నోటికాడ ముద్దపోయి
అన్నింటికంటే కడుపు మండే విషయం ఏంటంటే- నిత్యావసరాలు కాబట్టి రోజూ ఇన్ని గంటలని సరకుల దుకాణాలు అనుమతించండి; బ్యాంకుల్లో, ఏటీఎంలలో డబ్బులు మెండుగా అందుబాటులో ఉంచండి అని డబ్బులున్న వాళ్ళ అవసరాలు ఆలోచించే ప్రభుత్వాలకి దేశమంతటా ఒక్కసారిగా పనులాగి పోయి, కూలి నిలిచిపోయి, నెత్తిమీద గూడు దూరమై నోటికాడ ముద్దపోయి పసిబిడ్డలతో కట్టుబట్టలతో నడిరోడ్లో నిలబడ్డవాళ్ళ గోడు పట్టలేదెందుకు? ఎన్ని ఆకలి కడుపులు, ఎన్ని మైళ్ల కాలి నడకలు? ఎన్ని దిక్కులేని చావులు? ‘లాక్‌డౌన్’ అన్న వెంటనే నెమ్మదిగా పకడ్బందీ ప్రణాళిక ఏర్పాటయ్యేంత వరకు- కూలి పనులకోసం సొంతూరు వదిలి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకోసం వెన్వెంటనే కొన్ని స్కూళ్లు, ఇతర సత్రాలను ఆశ్రయాలుగా ప్రకటించి కనీసం రోజూ బ్రెడ్ ప్యాకెట్లు, అరటిపళ్ళు, నీళ్ళు, సబ్బులులాంటివైనా అందుబాటులోకి తెచ్చి ఉండవచ్చు! అలాగే ఉన్న ఊళ్ళోనే ఉన్నా, కూలి లేక తిండి లేక అలమటిస్తున్న వాళ్లకి ఆయా ప్రాంతాల్లో కాసింత తిండి అందుబాటులోకి తెచ్చి ఉండవచ్చు. అలాకాక వాళ్ల చావుకి వాళ్లని వదిలేసి, మేడల్లో మేము టిక్ టాకుల్లోనో, నెట్ ఫ్లిక్స్‌లతోనో కాలం గడిపేస్తామని కడుపునిండినోడనుకుంటే అంతకంతే పెద్ద భ్రమ లేదు! ఇప్పటి వరకు మరణాలే రోజూవారి కృత్యాలుగా చూసిన దేశాలని అడగండి... పోయింది పేదలే కాదని చావు సాక్ష్యాలిస్తాయి! ఇప్పటికీ ఆర్థిక నష్టం లెక్కలదే పై చెయ్యి! ఆర్థిక వ్యవస్థ మనుషులకోసం! మనుషులే మిగలని నాడు ఆర్థిక వ్యవస్థ ఎవరి కోసం?
కొత్తగా మరో పెద్ద దెబ్బ
ఇప్పుడు కొత్తగా కొన్నిచోట్ల మరో పెద్ద దెబ్బ. సాయం చెయ్యాలనుకున్న హస్తాల్ని దూరంగా ఉంచుతున్నారు. ‘మీసాయం మాకివ్వండి మా స్వచ్ఛంద సేవకులతో చేయిస్తామం’టున్నారు. నిష్కల్మషంగా నిజమైన మానవత్వంతో నలుగురికీ సాయపడే వాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. ప్రభుత్వం ఒక వెబ్‌సైట్ తెరిచి- తాముగా పేద ప్రజలకు సాయం చేస్తామని ముందుకొచ్చే వాళ్లకు, సరైన నియమ నిబంధనలతో అనుమతులు ఇస్తే బాగుంటుంది. అవసరమైతే ప్రభుత్వ వాలంటీర్లుగా కూడా ప్రజల్ని వాడుకుని పులి హోర, పొంగలి, బ్రెడ్డులాంటి పదార్థాలు ఎక్కువ మొత్తంలో తయారు చేసి, ఎక్కువమందికి పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటే చాలా వరకూ ప్రజల రాకపోకల్ని నియత్రించవచ్చు.
ముందే గుర్తించి ఉంటే
నిత్యావసరాలు రోజూ కొనుక్కునేది బడుగు జీవులే. అంతోఇంతో నెలకు సంపాదించుకునే వాళ్ళు వారం పది రోజుల పాటు నిల్వలు ఉంచుకోగలరు. రోజూ రోడ్ల మీద పడాల్సిన అవసరం వారికి లేదు. ఈ విషయం గుర్తుంచుకుని ‘లాక్ డౌన్’ అమలు చేసి ఉంటే మొదట్లో ఇలా పొడిగించుకోవలసిన పరిస్థితి వచ్చేది కాదేమో. కొన్నిచోట్ల ఎండకి, వానకి, గాలికి ఓర్చుకుంటూ వందల మైళ్లదూరంలోని సొంతూళ్లబాట పట్టిన- వలస కూలీల వాహనాలను అడ్డుకోవడం తెలిసిన అధికారులకు- ఆకలి పొట్టతో వారు అన్ని మైళ్లు ఎలా నడవగలరన్న ఆలోచన లేకపోవడమే బాధాకరం. ఇక ఇళ్లలో ఉన్నవారు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా అన్నీ వండేసుకుని వాడేసుకోనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. కాబట్టి, ఇప్పుడు కూడా ఏమీ అందుబాటులో లేవన్నట్టే కాస్త కట్టడి చేసుకుని జీవనం కొనసాగిస్తే, ముందు జీవనం సులభమవుతుంది. అన్నట్టు, మనకు చేతనైన పరిధిలో అందుబాటులో ఉన్న పేదల ఆకలి తీర్చే ప్రయత్నం మాత్రం చేసే తీరాలి... మనం జాగ్రత్తగా ఉంటూ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పుకొంటూ ముందుకు నడవాలి!
(రచయిత- అంజలి.జి)
ఇదీ చదవండి: అందమైన కురుల కోసం ఈ చిట్కాలు పాటించండి...