ETV Bharat / opinion

నిపుణ శక్తుల సృజన వ్యూహం.. స్థాయీ ప్రమాణాలేవి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలలెన్నో వేలంవెర్రి చదువులకు నెలవులుగా, నిరుద్యోగుల ఉత్పత్తి కార్ఖానాలుగా కునారిల్లుతున్నాయి. నాణ్యమైన విద్యాబోధనకు భరోసా ఇవ్వలేకపోతున్న కారణంగా దేశంలో ఇంజినీరింగ్‌ చదువులు మసకబారుతున్నాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) పేర్కొంది.

education
విద్య
author img

By

Published : Aug 25, 2021, 9:25 AM IST

తయారీరంగ పరిశ్రమల ప్రపంచ కేంద్రంగా జనచైనా నిలదొక్కుకున్నట్లే, నిపుణ మానవ వనరుల విశ్వరాజధానిగా భారత్‌ ఆవిర్భవించాలన్న ఆకాంక్షలు ఒకవంక మోతెక్కుతున్నాయి. ఆ స్వప్నాన్ని సాకారం చేయడంలో ముఖ్యభూమిక పోషించాల్సిన ఇంజినీరింగ్‌ కళాశాలలెన్నో మరోవైపు- వేలంవెర్రి చదువులకు నెలవులుగా, నిరుద్యోగుల ఉత్పత్తి కార్ఖానాలుగా కునారిల్లుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సారథి అనిల్‌ సహస్రబుద్ధే చెప్పినట్లు- నాణ్యమైన విద్యాబోధనకు భరోసా ఇవ్వలేకపోతున్న కారణంగా దేశంలో ఇంజినీరింగ్‌ చదువులు మసకబారుతున్నాయన్నది చేదునిజం.

ప్రస్తుత దుస్థితికి మూలాలు ఎక్కడున్నాయంటే, ముందుగా ఏఐసీటీఈనే వేలెత్తిచూపాలి. వాస్తవిక అవసరాలు, అవకాశాలను విశ్లేషించి ఎప్పటికి ఎంతమంది ఇంజినీర్లు కావాలో శాస్త్రీయంగా మదింపు వేసి ఆ ప్రకారమే కళాశాలల ఏర్పాటుకు అనుమతించాల్సిన మండలి విధ్యుక్తధర్మ నిర్వహణలో గాడితప్పిన పర్యవసానమే ఇదంతా! దాంతోపాటు విద్యార్థులకు, తల్లిదండ్రులకు సరైన మార్గనిర్దేశకత్వం కొరవడి కొందర్ని చూసి మరికొందరన్న చందంగా కొన్ని కోర్సుల వెంటే పరుగులు తీసే ధోరణులు శ్రుతిమించుతున్నాయి.

చాలాచోట్ల సివిల్‌, మెకానికల్‌, ఎలెక్ట్రికల్‌ వంటి సంప్రదాయ కోర్సుల్లో పెద్దయెత్తున సీట్లు మిగిలిపోతుండగా- కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ తదితరాలకు గిరాకీ ఇంతలంతలవుతోంది. గత ఏడెనిమిదేళ్లలో ఇంజినీరింగ్‌ కాలేజీల సంఖ్య 3398 నుంచి సుమారు నాలుగు వందల దాకా, 17 లక్షలకు పైబడిన స్థాయినుంచి నాలుగు లక్షల మేర సీట్లు తెగ్గోసుకుపోయాయి. మిగిలిన సీట్లకు సంబంధించీ ప్రాథమ్యాల ఎంపికలో సముచిత నిర్ణయాలు కరవై రాష్ట్రాలవారీగా కీలక విభాగాలు నిరాదరణకు గురై వెలాతెలాపోతున్నాయి. కోర్సుల ఎంపికలో హేతుబద్ధతమృగ్యమైతే మున్ముందు కొన్ని విభాగాల్లో బోధన సిబ్బంది ఖాళీల భర్తీ ఎలాగన్నదానిపై ఏఐసీటీఈ సహా వ్యూహకర్తల్లో ఎక్కడా కదలిక లేకపోవడం విస్మయపరుస్తోంది.

స్థాయీ ప్రమాణాలేవి?

స్థాయీ ప్రమాణాలు, అర్హులైన అధ్యాపకుల నియామకాల సంగతి గాలికొదిలేసి, చేతికి ఎముకే లేదన్న రీతిగా- నూతన కళాశాలలకు ఎడాపెడా అనుమతులు పందేరం చేయడమెంత అసంబద్ధమో తెలంగాణ వంటి రాష్ట్రాలు అయిదేళ్లక్రితమే సూటిగా తప్పుపట్టాయి. అటువంటి ఘాటు విమర్శల నేపథ్యంలో కొలువు తీరిన బీవీఆర్‌ మోహనరెడ్డి కమిటీ 2020 సంవత్సరంనుంచి కొత్త కాలేజీలకు, అదనంగా సీట్లు పెంచుకోవడానికి అనుమతుల ప్రదానంపై నిర్దిష్ట ఆంక్షలు సిఫార్సు చేసింది. నాలుగేళ్ల వ్యవధిలో మూడు లక్షల సీట్ల తెగ్గోతకు ఏఐసీటీఈ అనివార్యమై ఉపక్రమించినా- ప్రమాణాల మెరుగుదలకు, మానవ వనరుల సద్వినియోగానికి అక్కడికదే పరిష్కారం కాబోదు. 2022 నాటికి నిర్మాణ, రిటైల్‌, స్థిరాస్తి, రవాణా తదితర రంగాల్లో కొత్తగా 12 కోట్ల నిపుణ వనరులు కావాలన్న అంచనాలు ఆరేళ్లనాడే వెలుగు చూసినా- పటుతర కార్యాచరణ సాధ్యపడలేదు.

కనీసం ఇప్పటికైనా ఏయే రంగాల్లో ఎంతెంత మేర విభాగాల వారీగా అవసరాలున్నాయో మదింపు వేసే ప్రక్రియను చురుగ్గా చేపట్టాలి. ఆ వివరాల ప్రాతిపదికన ఎప్పటికప్పుడు విద్యాసంస్థల్లో ప్రవేశాల తీరుతెన్నుల్ని పర్యవేక్షిస్తూ ఇంతకు మించితే ఉపాధి అవకాశాలు కష్టతరమేనని వెల్లడించే వ్యవస్థ రూపుదాల్చాలి. అలాగైతే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోర్సుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడమెంత అత్యావశ్యకమో గుర్తెరిగి నడుచుకుంటారు! కాలావసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టదలచే కోర్సుల బోధనకు రాత్రికి రాత్రే నిపుణులు పుట్టుకురారు.

నిపుణశక్తుల విశ్వకేంద్రంగా..

అందుకోసం పటిష్ఠ వ్యూహం, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండితీరాల్సిందే. వివిధ రంగాలు, పరిశ్రమల కార్యసరళికి తగ్గట్లు విద్యార్థుల్లో అభిరుచి (ఆప్టిట్యూడ్‌), బృందంతో కలిసి పనిచేసే స్వభావం, కోడింగ్‌ ప్రావీణ్యం వంటివి పెంపొందించే ఏర్పాట్లూ ఊపందుకోవాలి. పాఠశాల స్థాయినుంచే చదువుల క్రమాన్ని సాంతం ప్రక్షాళిస్తేనే- అపార మానవ వనరుల గని నిపుణశక్తుల విశ్వకేంద్రంగా భాసిల్లడానికి మార్గం సుగమమవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.