కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుండగా.. జేడీఎస్ సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. అయితే, కుటుంబ పార్టీ అయిన జేడీఎస్‌కు ఇంట్లోనే ఐక్యత కొరవడింది. దేవెగౌడ సొంత కోడలే తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశాలు కనిపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పార్టీ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దేవెగౌడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ కుమారుల్లో.. కుమారస్వామి, రేవన్న రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. కుమారస్వామి సీఎంగా పనిచేయగా.. రేవన్న మంత్రిగా సేవలందించారు. రేవన్న భార్య భవానీ రేవన్న ఇప్పుడు ఆ పార్టీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. హసన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భవానీ భావిస్తున్నారు. ఈ విషయంలో కుమారస్వామి సుముఖంగా లేరు. పార్టీకి విశ్వాసపాత్రుడైన కార్యకర్తను హసన్‌లో పోటీకి దింపుతామని కుమారస్వామి చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ.. భవానీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హసన్ జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలైన భవానీకి.. ఆమె భర్త రేవన్న మద్దతుగా ఉన్నారు. కుమారులు ప్రజ్వల్ రేవన్న, సూరజ్ రేవన్న సైతం ఆమె వెంటే నడుస్తున్నారు. ప్రజ్వల్ ప్రస్తుతం హసన్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సూరజ్ ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఒక్క సీటు విషయంలో కుటుంబంలోనే చీలిక వచ్చే పరిస్థితులు రావడం దేవెగౌడకు తలనొప్పిగా మారింది. వయసురీత్యా రాజకీయ కార్యకలాపాల్లో అరుదుగా పాల్గొంటున్న ఆయన.. ఆదివారం సాయంత్రం ఇదే విషయంపై సమావేశం పెట్టారు. కుమారస్వామి, రేవన్నతో పాటు భవానీతో చర్చలు జరిపారు. అయితే, ఈ భేటీలో పరిష్కారం లభించినట్లు కనిపించడం లేదు. స్వయంగా దేవెగౌడ రంగంలోకి దిగినప్పటికీ.. ప్రతిష్టంభన కొనసాగడం చర్చనీయాంశమవుతోంది. భేటీ తర్వాత కుమారస్వామి, రేవన్న వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.
"హసన్ సీటుకు సంబంధించి ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. దీనిపై తొందరేం లేదు. సానుకూలంగా చర్చించే నిర్ణయం తీసుకుంటాం. దేవెగౌడ దిల్లీకి వెళ్లారు. ఆయన తిరిగి రాగానే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. నా వైఖరిని ఇప్పటికే చెప్పా. అందులో ఎలాంటి మార్పు లేదు. ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని దేవెగౌడ నిర్ణయం తీసుకుంటారు."
-కుమారస్వామి, జేడీఎస్ నేత, మాజీ సీఎం
తుది నిర్ణయం దేవెగౌడదేనని రేవన్న సైతం స్పష్టం చేశారు. 'దేవెగౌడ, కుమారన్న, నేను కలిసి నిన్న రాత్రి చర్చలు జరిపాం. దేవెగౌడ ఏం చెబితే అదే ఫైనల్. ఆయనకు 40ఏళ్ల అనుభవం ఉంది. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు' అని రేవన్న చెప్పుకొచ్చారు.
కుమారస్వామి ప్లాన్ ఇదే!
హసన్ నియోజకవర్గం నుంచి హెచ్‌పీ స్వరూప్‌ను బరిలో దించాలన్నది కుమారస్వామి ఆలోచనగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, దివంగత హెచ్ఎస్ ప్రకాశ్ కుమారుడైన స్వరూప్.. గతంలో హసన్ జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కుమారస్వామి తన వెంట ఉన్నారన్న ధైర్యంతో.. నియోజకవర్గంలో చురుకుగా తిరుగుతున్నారు. మద్దతుదారులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
అయితే, తనకు కాకుండా వేరేవారికి హసన్ టికెట్ ఇస్తే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసేందుకు భవానీ సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. దీనిపైనా మాట్లాడిన కుమారస్వామి.. అలాంటి వదంతుల గురించి తనకు తెలియదని అన్నారు. దీనిపై ఆమెనే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. జేడీఎస్ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితా మంగళవారం లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. అందులో హసన్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించడం లేదని కుమారస్వామి సూచనప్రాయంగా చెప్పారు. దీన్ని బట్టి ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేదని స్పష్టమవుతోంది.
మరోవైపు, చన్నపట్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుమారస్వామి.. ఏప్రిల్ 19న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి రామనగర నుంచి ఏప్రిల్ 17న నామపత్రాలు సమర్పిస్తారని చెప్పారు.
దేవెగౌడ సొంత జిల్లా హసన్. వొక్కలిగల ప్రాబల్యం ఇక్కడ అధికం. ఈ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ హసన్ అసెంబ్లీ స్థానం మినహా ఆరింటిని జేడీఎస్ గెలుచుకుంది. హసన్ నుంచి బీజేపీ నేత ప్రీతమ్ గౌడ గెలుపొందారు. జిల్లాలో బీజేపీ గెలిచిన తొలి సీటు ఇదే కావడం విశేషం.
కర్ణాటకలో మే 10న శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.